సాక్షి, మాచారెడ్డి: తెలంగాణ ముందస్తు ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎలాగైనా ఈ ఎన్నికల్లో విజయం సాధించి తీరాలనే ధృఢ సంకల్పంతో అన్ని పార్టీల అభ్యర్థులు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ కొందరు ఓటర్లకు నజరానాలు ఇస్తామని, మరికొందరు తాగినోళ్లకు తాగినంత మద్యం ఇస్తామని ఆశ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు మధ్య వయస్కుల మధ్య జరిగిన ముచ్చట ఇదిగో..
నర్సన్న ఏమ్జేస్తున్నవే తిన్నవా? ఏం కూరనే.. ఏమ్జేస్తలేను రాజన్న– ఇగో ఇప్పుడే తిన్న... ఏం కూరండిన్రే. గదే పప్పు కూడు ఏందే ఏమో పనాడ అచ్చినవ్ ఏ ఇట్రా నేన్జేప్పే ముచ్చట యాడ దొరికితే ఆడ చెప్పేది కాదు. చెవుల జెప్తా ఇట్రాయే నర్సన్న నీ పాడుగాను నీ తోని గిదే పరేషాన్ చెప్పిందినవె బరబర ఒర్రుతావ్. అరే ఏందే రాజన్న ఏమో గట్లనవడ్తివి. ఏమొర్రిన్నే ఏంది ముచ్చట అని అడుగుతున్నగంతే.
ఇగో ఈడ మనకులపోళ్లు ఎంత మందుంటరే నర్సన్న. ఓ 50 మందుంటరా ఏ గంత మందుండరే రాజన్న. 20, 30 మంది కంటే ఎక్వ ఉండరు. అయితాయే గానీ ఏం మచ్ఛట్నే ఏమో నానవెట్టవడ్తివి. ఏమ్లేదు నర్సన్న, గా పార్టీల పన్జేయడ గదే మన పెద్దొల్ల ఆశన్న కొడుకు రమేశ్‌గాడు. అయితే పొద్దీకి కల్లు దుకాండ్ల గల్సిండు. కలిసి మీ కులపోళ్లంతా మందు తాగుతరా కల్లు తాగుతరా అని అడగవట్టిండే. ఇగ నీయవ్వ అట్టప్పుడు కల్లే తాగుడు గీ ఎలచ్చన్లప్పుడు కల్లే తాగాల్న అని పోరనికి చెప్పినా మాకు మందే కావాలని.
మంచి పన్జేసినవే రాజన్న గిన్ని రోజులకు గదొక్కటే మంచి పనిజేసినవనుకో. అరె గట్లంటవెందే నర్సన్న, నేనెప్పుడన్నా లంగపన్లు జేసిన్నా. ఏ... నేను నవ్వుకుంటన్న తియ్యు. నువ్వేమో దీర్ఘాలు దియ్యవడ్తివేమే రాజన్న అవె మొన్న రాత్రి గా పార్టోళ్లు గూడా తాగినోళ్లకు తాగినంత అన్కుంట ఇండ్ల పొండి దిరిగిండ్రంట మా చిన్న పోరడు చెప్పవంట్టిండు. అవే రాజన్న మరెవందాం. నీ... ఓళ్లు తాగిపిచ్చిన తాగుదారి, తినిపిచ్చినా తిందాం నర్సన్న.. మరి ఓళ్లు తాగిపిచ్చినా తాగుదాం సరే ఓటు ఓళ్లకేద్దామంటవే రాజన్న..
ఓళ్లచ్చి తాగిపిచ్చినా, తాగుదాం తినిపిస్తే తిందాం తర్వాత దేకింగే. మనం కొనాకరికి ఓటు ఓళ్లకేస్తమో ఆళ్లచ్చి జూస్తరంటవా నర్సన్న. (వీరద్దరి ముచ్చట వింటున్న రాజు అనే యువకుడ మధ్యలో కలుగజేస్కొని) ఏం పెద్దమనుషులు మీరు నడీడుకు వచ్చిండ్రు. తాగిపిస్తే తినిపిస్తేనే ఓటేస్తారా? తప్పుగదానే ఇయ్యల తాగిపిచ్చి తినిపిచ్చినోళ్లు రేపు గద్దెనెక్కినాక మనకు పని ఉత్తగా జేసిపెడ్తటండరా నాడు ఓట్లువట్టిగేసిండ్రా. తాగిపిస్తేనే ఏసిండ్రని దెప్పుతరు. మన దగ్గర కూడా పనిజేసిపెట్టినందుకు లంచం ఇవ్వమంటడు అప్పుడు ఏమ్జేస్తరే, అరే... చిన్నోడివైనా మంచి జెప్పినవ్ బిడ్డా, తూ... నీయవ్వ ఆళ్లు తాగిపిస్తే ఉంటాది. ఓళ్ల దగ్గర ఏం దీసుకోకుండా మంచి పనులు చేసేటోళ్లకే మా ఓటు వేస్తం.. పా రాజన్న గా హోటళ్ల ఇంత చాయ్ తాగుదాం.
Comments
Please login to add a commentAdd a comment