బీడీకార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం | Rahul Gandhi Slams On KCR | Sakshi
Sakshi News home page

బీడీకార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం

Published Fri, Nov 30 2018 10:29 AM | Last Updated on Tue, Aug 27 2019 4:45 PM

Rahul Gandhi Slams On KCR - Sakshi

ఆర్మూర్‌ బహిరంగ సభలో మాట్లాడుతున్న రాహుల్‌ గాంధీ, వేదికపై కాంగ్రెస్‌ అభ్యర్థులు సుదర్శన్‌ రెడ్డి (బోధన్‌), భూపతి రెడ్డి (రూరల్‌), షబ్బీర్‌ అలీ (కామారెడ్డి), జువ్వాడి నర్సింగ్‌ రావు(కోరుట్ల), తాహెర్‌ బిన్‌ హందాన్‌ (అర్బన్‌), ఆకుల లలిత( ఆర్మూర్‌)

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: మద్దతు ధరలు అడిగిన రైతులపై కేసీఆర్‌ సర్కారు దాడి చేసిందని, సాగునీరు ఇవ్వమంటే పోలీసు కేసులు పెట్టారని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ విమర్శించా రు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతుల కష్టాలను తీరుస్తామని భరోసా ఇచ్చారు. నిజాం చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తామని, పసుపుబోర్డు ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్లే వారికోసం ఫెసిలిటేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, రూ.500 కోట్లు కేటాయించి ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని అన్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆర్మూర్‌లోని మినీస్టేడియంలో కాంగ్రెస్‌ పార్టీ బహిరంగసభలో రాహుల్‌గాంధీ ప్రసంగించారు. సీఎం కేసీఆర్, ప్రధాని మోదీలను లక్ష్యంగా చేసుకుని ఘాటైన విమర్శలు చేసిన రాహుల్‌.. స్థానిక అంశాలను కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. 17 రకాల రైతుల ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలను పెంచుతామని ప్రకటించిన రాహుల్‌గాంధీ పసుపునకు క్వింటాలుకు రూ.పది వేల చొప్పున కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. రూ.300 కోట్లు వెచ్చించి తన నివాసాన్ని నిర్మించుకున్న కేసీఆర్‌ నిజాంషుగర్స్‌ను తెరిపించేందుకు రూ.వంద కోట్లు ఇవ్వడానికి నిరాకరించారని విమర్శించారు.

బీడీ కార్మికులను ఆదుకుంటాం.. 
పొగాకు ఉత్పత్తులపై 28 శాతం జీఎస్టీ విధించడంతో బీడీకార్మికులు ఉపాధి కోల్పోతున్నారని, బీడీ పరిశ్రమపై ప్రభావం పడుతోందని అన్న రాహుల్‌.. జీఎస్టీని సమీక్షించి బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లే వారి కోసం రూ.500 కోట్లతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తామని, ఫెసిలిటేషన్‌ కేంద్రాలను ప్రారంభిస్తామని అన్నారు. 
తెలంగాణ ప్రజల ఆశలను వమ్ము చేశారు.. 
ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కొత్త రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఎన్నో కలలు కన్నారని, బంగారు భవిష్యత్తు ఉంటుందని భావించగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజల ఆకాంక్షలను గాలికొదిలేశారని అన్నారు. నీళ్లు.. నిధులు.. నియామకాలు.. అనే నినాదంతో తెలంగాణ ఉద్యమం సాగిందని, మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన కేసీఆర్‌ తెలంగాణ ప్రజలను వంచించారని దుయ్యబట్టారు.

ఎర్రజొన్నను కొనుగోలు చేస్తాం..: ఉత్తం కుమార్‌రెడ్డి 
ఎర్రజొన్నకు రూ.మూడు వేల మద్దతు ధర కల్పిస్తామని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. పసుపుబోర్డును ఏర్పాటు చేసి, క్వింటాలుకు రూ.పది వేల చొప్పున కొనుగోలు చేస్తామన్నారు. నిజాంషుగర్స్‌ను తెరిపిస్తామన్నారు. జీఎస్టీని సమీక్షించి బీడీకార్మికుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. గల్ఫ్‌ దేశాలకు వెళ్లే వారికోసం ఫెసిలిటేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అరాచకాలపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఆర్మూర్‌ ప్రాంత రైతులు ఆదర్శవంతులు : ప్రొఫెసర్‌ కోదండరాం 
కేసీఆర్‌ నాలుగున్నరేళ్ల పాలనలో రైతులు, బీడీ కార్మికులు వివిధ వర్గాల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్‌ కోదండరాం విమర్శించారు. ఆర్మూర్‌ ప్రాంతంలోని అన్ని గ్రామాల రైతులు ఆదర్శవంతులని అన్నారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతంలో కూడా ఆదర్శవంతమైన సేద్యం చేస్తున్నారని కితాబునిచ్చారు. ఉపాధి  కోసం దుబాయ్‌ వంటి దేశాలకు వలస వెళుతున్నారని అన్నారు. నిజామాబాద్‌ జిల్లాలో దేశంలోనే అత్యధికంగా బీడీ కార్మికులున్నారని వివరించారు. బీడీ కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ పాలనలో ఈ వర్గాల సమస్యలు పరిష్కారం జరగలేదని విమర్శించారు. ప్రజా కూటమి అధికారంలోకి వచ్చాక ఈ వర్గాల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని అన్నారు.

కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం.. 
ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌ పర్యటన కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా ఉపాధ్యక్షులు బాజిరెడ్డి గంగ బాగయ్య తదితరులు కాంగ్రెస్‌లో చేశారు. ఈ సభకు  నిజామాబాద్, కామారెడ్డి, జ గిత్యాల జిల్లాల నుంచి పార్టీ శ్రేణులను తరలించా రు. మధ్యాహ్నం 2.50 గంటలకు హెలికాప్టర్‌లో ఆర్మూర్‌కు చేరుకున్న రాహుల్‌ సుమారు 25 నిమిషాల పాటు ప్రసంగించారు. ఆయన ప్రసంగాన్ని మధుయాష్కిగౌడ్‌ తెలుగులో అనువదించారు. బ హిరంగసభలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా, ఏఐసీసీ నాయకులు వి హనుమంత్‌రావు, మండలి విపక్ష నేత, కామారెడ్డి అభ్యర్థి షబ్బీర్‌ అలీ, మాజీ మంత్రి, బోధన్‌ అ భ్యర్థి సుదర్శన్‌రెడ్డి,  నిజామాబాద్‌రూరల్‌ అభ్యర్థి డాక్టర్‌ ఆర్‌ భూపతిరెడ్డి, డీసీసీ అధ్యక్షులు, నిజా మాబాద్‌ అర్బన్‌ అభ్యర్థి తాహెర్‌బిన్‌హందాన్, ఆర్మూర్‌ అభ్యర్థి ఆకుల లలిత, బాల్కొండ అభ్యర్థి ఈరవత్రి అనీల్‌ తదితరులు పాల్గొన్నారు.  

సర్వం కోల్పోయాం ఆదుకోండి 

ఆర్మూర్‌: మా కన్న బిడ్డలకు మంచి చదువులు చెప్పించాలని గల్ఫ్‌ దేశంలో కూలీ పని చేసుకొని నాలుగు డబ్బులు సంపాదించుకుందామని వెళ్లిన తమ భర్తలు మృత్యువాత పడటంతో తమ కుటుంబాలు వీధిన పడ్డాయని, తమ లాంటి బాధితులకు అండగా నిలవాలని బాధిత మహిళలు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కోరారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలోని మినీ స్టేడియంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యం లో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు రాహుల్‌ గాంధీ ముఖ్య అతిథిగా విచ్చేయగా సభా స్థలి సమీపంలో గల్ఫ్‌ బాధిత మహిళలు ఆయనను కలిసి సమస్యను వివరించారు.

టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ విభాగం కన్వీనర్‌ నంగి దేవేందర్‌రెడ్డి, గల్ఫ్‌ బాధితుల సంఘం సెక్రటరీ మంద భీమ్‌రెడ్డి ఆధ్వర్యంలో బాధిత మహిళలు నూర్జహాన్‌ బేగం, దండుగుల లక్ష్మి ఆయనను కలిసి తమ వేదనను వినిపించారు.  నిజామాబాద్‌ జిల్లాలోని నవీపేట మండలం బినోల గ్రామానికి చెందిన నూర్జహాన్‌ బేగం మాట్లాడుతూ తన భర్త బషీర్‌ ఓమన్‌ దేశంలో గతేడాది మార్చి 8న మృత్యువాత పడ్డాడని వివరించింది. దీంతో తన ఇద్దరు పిల్లలు తబస్సుమ్, అల్మాస్‌లతో తన కుటుంబం వీధిన పడిందని విలపించింది. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలానికి చెందిన దండుగుల లక్ష్మి మాట్లాడుతూ తన భర్త దండుగుల జనార్దన్‌ దువాకత్తర్‌లో ఈ ఏడాది మార్చి 7న గుండె పోటుతో మరణించాడని వివరించింది. దీంతో తన పిల్లలు శషాంత్, అనిరుద్ద్‌లతో తమ కుటుంబం వీధిలో పడిందని వివరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement