సాక్షి, నిజామాబాద్ : ఎన్నికల్లో కీలకమైన ప్రచార ఘాట్టం మరో మూడు రోజుల్లో ముగుస్తుండటంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే జాతీయ స్థాయి అగ్రనేతల బహిరంగ సభలతో జిల్లాలో ప్రధాన పార్టీల ప్రచారం తారా స్థాయికి చేరింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నిజామాబాద్ నగరంలో జరిగిన భారీ బహిరంగసభకు హాజరుకాగా, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ ఆర్మూర్, కామారెడ్డి సభల్లో పాల్గొన్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రచార సభలు జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో జరిగాయి. ఇక మూడు రోజులే సమయం ఉండటంతో అభ్యర్థులు ప్రచార వేగాన్ని పెంచారు.
నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉన్న తక్కువ సమయంలో ఎక్కువ మందిని కలిసే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచే గ్రామాల్లోకి వెళుతున్నారు. రాత్రి 10 గంటల వరకు ఓటర్లను కలుస్తూ తమ ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాత్రి 10 తర్వాత ఆయా గ్రామాల్లో తమ సన్నిహితులు, అనుచరవర్గాలతో సమావేశమై బూత్ స్థాయిలో సమీక్ష చేస్తున్నారు. పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారం నిలిపి వేయాల్సి ఉంటుంది. డిసెంబర్ 5 వరకే ప్రచారం చేసుకునేందుకు సమయం ఉంది. దీంతో ప్రణాళిక బద్ధంగా అభ్యర్థులు ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు.
నియోజకవర్గాన్ని చుట్టేసిన టీఆర్‌ఎస్ అభ్యర్థులు
టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిత్వాలు రెండు నెలల ముందే ఖరారు కావడంతో ఆ పార్టీ అభ్యర్థులు రెండు నెలల ముందే కదనరంగంలోకి దిగారు. ముందుగా ఆత్మీయ సమ్మేళనాల పేరుతో కుల సంఘాల నేతలు, సభ్యులతో మమేకమయ్యారు. ఎన్నికల్లో ప్రభావితం చూపే అన్ని సామాజికవర్గాలతో ఈ సమావేశాలు నిర్వహించారు. బాన్సువాడలో ఆపద్ధర్మ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి గ్రామగ్రామాన పర్యటిస్తున్నారు. బాల్కొండలో వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్‌లో ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. నిజామాబాద్ రూరల్‌లో బాజిరెడ్డి గోవర్ధన్, బోధన్‌లో షకీల్ అమేర్‌లు ఓటర్లను కలుస్తున్నారు. నిజామాబాద్ నగరంలో బిగాల గణేష్‌గుప్త, కామారెడ్డిలో గంప గోవర్ధన్, ఎల్లారెడ్డిలో ఏనుగురవీందర్‌రెడ్డి, జుక్కల్‌లో హన్మంత్‌షిండేలు నియోజకవర్గం కలియదిరుగుతున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారం వేగవంతం
కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ప్రచార వేగాన్ని మరింత పెంచారు. ముందస్తు ఎన్నికలు ప్రకటించిన వెంటనే అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారైన కామారెడ్డి, బోధన్, ఆర్మూర్ వంటి నియోజకవర్గాల్లో షబ్బీర్‌అలీ, పి సుదర్శన్‌రెడ్డి, ఆకుల లలితలు ముందునుంచే ప్రచార బరిలో ఉండగా, తర్వాత ఖరారైన జుక్కల్‌లో సౌదాగర్ గంగారాం, బాన్సువాడలో కాసుల బాల్‌రాజు, నిజామాబాద్ అర్బన్‌లో తాహెర్ బిన్ హందాన్, నిజామాబాద్ రూరల్‌లో డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి, బాల్కొండలో ఈరవత్రి అనీల్, ఎల్లారెడ్డిలో నల్లమడుగు సురేందర్‌లు టిక్కెట్లపై ధీమాతో అంతకుముందు నుంచే నియోజకవర్గంలో తమ అనుచరులతో సమావేశాలు నిర్వహించారు. శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేశారు. ఇప్పుడు తమ ప్రచార పర్వాన్ని మరింత వేగవంతం చేశారు.
దీటుగా బీజేపీ అభ్యర్థుల ప్రచారం
జిల్లాలో అన్ని స్థానాల్లో బీజేపీ ప్రచారం జోరందుకుంది. తొలి జాబితాలోనే అభ్యర్థిత్వాలు ఖరారైన ఆర్మూర్, కామారెడ్డి, నిజామాబాద్ రూరల్ అభ్యర్థులు పొద్దుటూరి వినయ్‌కుమార్‌రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, గడ్డం ఆనంద్‌రెడ్డిలు ప్రచారం ముందునుంచే ప్రారంభించారు. రెండో జాబితాలో ఖరారైన నిజామాబాద్ అర్బన్, బా ల్కొండ, బోధన్‌లలో యెండల లక్ష్మినారాయణ, రుయ్యాడి రాజేశ్వర్, అల్జాపూర్ శ్రీనివాస్, ఎల్లారెడ్డిలో బాణాల లక్ష్మారెడ్డి, జుక్కల్‌లో అరుణతా ర, బాన్సువాడలో నాయుడు ప్రకాష్‌ల ప్రచారం జోరందుకుంది. అన్ని పార్టీల అభ్యర్థులు, వారి అనుచరులు రావడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి తారా స్థాయికి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment