మహిళలు..మహరాణులు
సాక్షి ప్రతినిధి, చెన్నై: పురుషుని జీవితంలో స్త్రీ సగభాగం అనే రోజులు దాటిపోయి స్త్రీ పురుషుల సమానత్వం సాగుతున్న దశలో రాజకీయ పార్టీలు సైతం అదే బాటలో పయనిస్తున్నాయి. ఎన్నికల రంగంలోకి మహిళా అభ్యర్థులను దించడంలో డీఎంకే, అన్నాడీఎంకే పోటీపడుతున్నాయి.
అత్యధిక సంఖ్యలో మహిళా అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా అన్నాడీఎంకే ముందంజలో నిలిచి ఉంది. ప్రస్తుత ఎన్నికల్లో అన్నాడీఎంకే పోటీ చేస్తున్న 227 స్థానాలకుగాను 31 మంది మహిళలకు అవకాశం కల్పించింది. అలాగే డీఎంకే 174 సీట్లకుగాను 19 సీట్లను మహిళా అభ్యర్థులకు కేటాయించింది. డీఎంకే చరిత్రలో ఇంతపెద్ద సంఖ్యలో మహిళలకు అవకాశం ఇవ్వడం ఇదే ప్రథమం. డీఎంకేలో 1996 వరకు సింగిల్ డిజిట్‌గా ఉన్న మహిళా అభ్యర్థులు 2001లో తొలిసారిగా 16 స్థానాలతో డబుల్ డిజిట్‌కు చేరుకున్నారు.
అలాగే అన్నాడీఎంకే 1989 ఎన్నికల్లో కేవలం 4 సీట్లతో పరిమితం కాగా ఆ తరువాత ఎన్నికల్లో ఈ సంఖ్యను ఏకంగా 27కు పెరిగిపోయింది. 1991 నాటి ఎన్నికల్లో తొలిసారిగా 27 స్థానాలతో అన్నాడీఎంకే మహిళా అభ్యర్థుల సంఖ్య డబుల్ డిజిట్‌కు చేరుకుంది. చట్టసభ ఎన్నికల్లో 1977 నుంచి మహిళల ప్రాధాన్యతను పరిశీలిస్తే డీఎంకే కంటే అన్నాడీఎంకేనే గణనీయంగా పెంచుకుంటూ పోతోంది. అన్నాడీఎంకేలో ఒకప్పుడు 13.65 శాతంగా ఉన్న మహిళా అభ్యర్థులు 1991లో 27 సీట్లలో పోటీ చేయడం ద్వారా 16 శాతానికి పెరిగారు.
మహిళా సామాజిక కార్యకర్త షీలు ఈ అంశంపై మాట్లాడుతూ ద్రవిడ పార్టీలు మహిళలకు కేటాయిస్తున్న సీట్ల సంఖ్య ఎంతమాత్రం సమర్థనీయం కాదని అన్నారు. ఒక వైపు 33 శాతం మహిళా బిల్లును సమర్థిస్తూ తమ పార్టీల్లో కేవలం 16 నుంచి 20 శాతానికి పరిమితం కావడం ఏమిటని ప్రశ్నించారు. అంతేగాక, గెలుపు సాధ్యమైన సీట్లలో పురుష అభ్యర్థులను నిలబెట్టి, కష్టసాధ్యమైన సీట్లను స్త్రీలకు కేటాయించారని ఆమె ఆరోపించారు.
పైగా ప్రజలకు పరిచితం కాని వ్యక్తులను నిలబెట్టారని తప్పుపట్టారు. వీటన్నిటినీ విశ్లేషించుకుంటే మహిళలకు కేవలం మొక్కుబడిగా కేటాయించారేగానీ, స్త్రీపట్ల గౌరవంతో కాదని ఆమె అన్నారు. మహిళా బిల్లుకు చిత్తశుద్ధితో సమర్థిస్తున్నవారైతే ఎన్నికల్లో 33 శాతం సీట్లను మహిళలకు కేటాయించాలని ఆమె అన్నారు. 33 శాతం సీట్లను కేటాయించిన పక్షంలో మహిళా బిల్లు సులభంగా పాస్ అయిపోతుందని చెప్పారు. గత పది అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకేలలో మహిళా అభ్యర్థుల గణాంకాలు ఇలా ఉన్నాయి.