తొలిసారి మహిళా ప్రతినిధులు!
సౌదీ అరేబియా.. అక్కడ ఇన్నాళ్ల పాటు మహిళలకు అసలు ప్రాతినిధ్యమే లేదు. ఆ దేశ చరిత్రలోనే తొలిసారిగా 20 మంది మహిళా ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యారు. అలాగే, అక్కడి మహిళలు కూడా దేశ చరిత్రలో తొలిసారి ఓట్లు వేశారు. మొత్తం దేశంలో ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల స్థానాల సంఖ్యతో పోలిస్తే మహిళా ప్రతినిధుల సంఖ్య నామమాత్రమే అయినా.. తొలిసారి కావడంతో కనీసం ఈమాత్రమైన ప్రాతినిధ్యం ఉందన్న సంతోషం మిగిలింది. దేశంలో మొత్తం 2,100 మునిసిపల్ కౌన్సిల్ సీట్లుండగా వాటిలో కేవలం 20.. అంటే సుమారు 1 శాతం సీట్లను మాత్రమే మహిళలకు కేటాయించారు. అసలు నడకే లేని చోట ఒక్క అడుగు ముందుకు పడటంతో వాళ్లంతా సంతోషంగా ఉన్నారు. సౌదీలో ఇప్పటికీ మహిళలకు డ్రైవింగ్ చేసే హక్కు లేదు. అక్కడి గార్డియన్‌షిప్ చట్టాల్లో కూడా పురుషాధిక్యత స్పష్టంగా కనిపిస్తుంది. పెళ్లి, ప్రయాణాలు, ఉన్నత చదువులు.. ఇలాంటి ప్రతి అంశాల్లోనూ పురుషుల మాట వినాల్సిందే.
ఇప్పుడు తొలిసారి మహిళా సభ్యులు అక్కడి కౌన్సిల్‌కు ఎన్నిక కావడంతో, రాజు తలచుకుంటే మరింత మంది మహిళలకు అవకాశం లభిస్తుంది. 2100 స్థానాలకు మొత్తం 7వేల మంది పోటీపడగా, వాళ్లలో 979 మంది మహిళలున్నారు. ఇంతకుముందు 2005, 2011 సంవత్సరాల్లో కూడా ఈ కౌన్సిళ్లకు ఎన్నికలు జరిగినా, అవి కేవలం పురుషులకే పరిమితం అయ్యాయి.