ఓటు వేసేందుకు బారులు తీరిన మహిళా ఓటర్లు
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కశ్మీర్, బిహార్ ప్రాంతాల్లోని 51 లోక్‌సభ సీట్లకు ఐదవ విడత పోలింగ్ జోరుగా సాగుతుంది. మొత్తం 674 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, వారిలో 12 శాతం మంది మహిళలు ఉండడం విశేషం. మొత్తం ఏడు విడతల్లో అతి తక్కువ సీట్లకు ఈ రోజు పోలింగ్ జరుగుతుండగా, ఇప్పటి వరకు జరిగిన నాలుగు విడతలకన్నా ఈ విడత పోలింగ్‌లో మహిళా అభ్యర్థులు ఎక్కువగా ఉండడం విశేషమని ఎన్నికల కమిషన్ వివరాలు తెలియజేస్తున్నాయి. ఏప్రిల్ 11న జరిగిన తొలి విడత పోలింగ్‌లో 69 శాతం పోలింగ్, ఏప్రిల్ 18వ తేదీన జరిగిన రెండో విడత పోలింగ్‌లో 68 శాతం, ఏప్రిల్ 23న జరిగిన మూడో విడత పోలింగ్‌లో 66.04 శాతం, నాలుగో విడత పోలింగ్‌లో 64 శాతం పోలింగ్ నమోదయింది.
బిహార్
సీతమరాహి, మధుబని, ముజఫర్‌పూర్, శరణ్, ఆజిపూర్ నియోజకవర్గాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతోంది. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఐదు సీట్లను ఎన్డీయేనే కైవసం చేసుకుంది. ఈ సారి ఈ ఐదు నియోజకవర్గాల్లో ఎన్డీయేకు వ్యతిరేకంగా రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ, హిందుస్థానీ హవామ్ మోర్చా సెక్యులర్, వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీలతో కూడిన మహా కూటమి పోటీ చేస్తోంది.
జమ్మూ కశ్మీర్
అనంత్‌నాగ్ లోక్‌సభ నియోజకవర్గానికి ఇప్పటికే రెండు విడతల పోలింగ్ పూర్తవగా, ఈ రోజు మూడవ విడత పోలింగ్ జరుగుతోంది. ఇక్కడ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ తరఫున ఆ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ తరఫున గులామ్ అహ్మద్ మీర్, నేషనల్ కాన్ఫరెన్స్ తరఫున హస్నైన్ మసూది, బీజేపీ తరఫున సోఫి మొహమ్మద్ యూసఫ్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి మెహబూబా ముఫ్తీ విజయం సాధించారు.
జార్ఖండ్
కోడెర్మా, రాంచి, కుంతీ, హజారీబాగ్–నాలుగు సీట్లకు ఈరోజు పోలింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ నాలుగు సీట్లకు బీజేపీయే ప్రాతినిధ్యం వహిస్తోంది. ఒక్క హజారీబాగ్‌లో తప్పించి మూడు సీట్లలో బీజేపీ కొత్తవారినే పోటీకి దింపింది.
మధ్యప్రదేశ్
బోతుల్, దమోహ్, హోషంగబాద్, ఖజూరహో, రేవా, సాత్నా, తికాంగఢ్ స్థానాలకు ఈ రోజు పోలింగ్. వీటిల్లో రేవా నియోజకవర్గం కీలకమైనది. ఇక్కడ ముగ్గురు ప్రధాన అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీ జనార్దన్ మిశ్రా, కాంగ్రెస్ తరఫున సిద్ధార్థ్ తివారీ, సీపీఎం తరఫున్ గిరిజేష్ సింగ్ సెంగార్ పోటీ పడుతున్నారు.
రాజస్థాన్
అల్వార్, దౌసా ముఖ్యస్థానాలతోసహా 12స్థానాలకు ఈ రోజు పోలింగ్ కొనసాగుతోంది. మూక హత్యలు, గోరక్షక దాడులతో అల్వార్ ప్రాంతం వార్తల్లోకి ఎక్కింది. ఈ సీటుకు బీజేపీ మత ప్రచారకుడు బాలక్‌నాథ్‌ను రంగంలోకి దింపగా, కాంగ్రెస్ పార్టీ మాజీ కేంద్ర మంత్రి జతేంద్ర సింగ్‌ను బరిలోకి దింపింది. ఇక దౌసా నియోజకవర్గం నుంచి ప్రధానంగా ఇద్దరు మహిళలు పోటీ పడుతున్నారు. బీజేపీ తరఫున జస్ కౌర్ మీనా, కాంగ్రెస్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే మురారీ లాల్ మీనా భార్య సవితా మీనా పోటీ పడుతున్నారు.
ఉత్తరప్రదేశ్
మొత్తం 80 సీట్లకుగాను ఈ రోజు 14 సీట్లకు పోలింగ్ కొనసాగుతోంది. 2014లో జరిగిన ఎన్నికల్లో వీటిల్లో 12 సీట్లను బీజేపీయే కైవసం చేసుకొంది. వీటిల్లోని అమేథీ, రాయబరేలి సీట్లను కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు గెలుచుకున్నారు. అమేథిలో ఈసారి రాహుల్ గాంధీపై బీజేపీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పోటీ చేస్తుండగా, సోనియా గాంధీపై బీజేపీ అభ్యర్థిగా మాజీ కాంగ్రెస్ నాయకుడు దినేష్ ప్రతాప్ సింగ్ పోటీ చేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్
శ్రీరాంపూర్, హూగ్లీ, ఆరమ్‌బాగ్, హౌరా, బారక్‌పూర్, ఉల్బేరియా, బాంగావ్ నియోజకవర్గాలకు నేడు పోలింగ్ కొనసాగుతోంది. అంతకుముందు పోలింగ్ జరిగిన నియోజక వర్గాల్లో హింసాకాండ చెలరేగడంతో ఈసారి ఎన్నికల కమిషన్ ఈ అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతకు సైన్యాన్ని రంగంలోకి దింపింది.
Comments
Please login to add a commentAdd a comment