మహిళా పోలీస్ ‘పరుగు’..!
- కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియ మొదలు
- అర్హత సాధించిన మహిళా అభ్యర్థులు 4,366 మంది
- బుధవారం కూడా కొనసాగనున్న పరీక్ష
సాక్షి, ముంబై: పోలీస్ శాఖలో భర్తీ ప్రక్రియలో భాగంగా మహిళా అభ్యర్థులకు నిర్వహిస్తున్న మూడు కి.మీ. పరుగు పరీక్ష (రన్నింగ్ టెస్ట్) కోసం వైద్యపరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ పరుగు పరీక్ష బుధవారం వరకు కొనసాగనుందని అధికారి ఒకరు తెలిపారు. పరుగు పందెంలో మహిళా అభ్యర్థులకు ఏదైనా అవాంఛనీయ ఘటనలు ఎదురైతే వెంటనే ప్రాథమిక చికిత్స అందజేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఇటీవల పురుష అభ్యర్థుల 5 కి.మీ.పరుగు పందెం సమయంలో సరైన సమయానికి వైద్యసదుపాయం అందక ఐదుగురు అభ్యర్థులు మరణించిన సంగతి తెలిసిందే. దీంతో మహిళా పోలీసు అభ్యర్థుల పరుగు పరీక్షలో తగు జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు.ఇదిలా ఉండగా, 4,366 మంది అభ్యర్థులు అవుట్ డోర్ పరీక్షలో అర్హత సాధించారు. వీరికి విక్రోలిలోని ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేలోని సర్వీస్ రోడ్ వద్ద రన్నింగ్ టెస్టును నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
దాదాపు సగం మంది మహిళా అభ్యర్థులు మంగళవారం జరిగిన పరుగు పరీక్షలో పాల్గొన్నారు. మిగిలినవారు బుధవారం జరుగనున్న పరుగు పరీక్షలో పాల్గొంటారని అధికారి తెలిపారు. సాధారణంగా పరుగు సమయంలో అభ్యర్థులకు ఊపిరికి సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి లేదా డీహైడ్రేషన్‌కు గురవుతారు. ఆ సమయంలో సరైన వైద్య సహాయం అందిస్తే వారికి ప్రాణాపాయం ఉండదు. దీంతో మహిళా అభ్యర్థుల రన్నింగ్ టెస్ట్ సమయంలో రన్నింగ్ ట్రాక్ పొడవునా వైద్యులను అందుబాటులో ఉంచినట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.
అదేవిధంగా అభ్యర్థుల కోసం మరుగుదొడ్ల సౌకర్యం కూడా కల్పించామని చెప్పారు. అంతేకాక ఈసారి కార్పొరేషన్, పలు స్వచ్ఛంద సంస్థలు కూడా అభ్యర్థులకు కనీస సౌకర్యాల ఏర్పాటుకు ముందుకువచ్చాయి.
ఇదిలా వుండగా, నగరంలో పోలీసు కానిస్టేబుళ్ల కోసం 2,570 ఖాళీలు ఏర్పడగా, ఇందులో మూడవ వంతు మహిళా అభ్యర్థుల కోసం ఖాళీగా ఉన్నాయి.
మహిళా అభ్యర్థుల కోసం పండ్లు, ఇతర అల్పాహారాన్ని కూడా అందజేస్తున్నట్లు అధికారి తెలిపారు. మహిళా కోటా కింద ఉన్న పోస్టులు పూర్తిగా భర్తీకాకపోతే, మిగిలిన వాటిని పురుషులతో భర్తీచేయనున్నామని ఆ అధికారి వివరించారు. అయితే మహిళల కోసం కేటాయించిన వాటిలో భర్తీ కాని పోస్టులను పురుషులతో భర్తీచేయనున్నట్లు అధికారి వెల్లడించారు.