సాక్షి, న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీలకు గత నెల జరిగిన ఎన్నికల్లో దాదాపు 90 శాతం పోలింగ్ జరగడం విశేషం. ఓటర్లు సృష్టించిన ఈ తుపానుకు త్రిపురలో వామపక్ష ప్రభుత్వం తుడుచుపెట్టుకుపోగా, నాగాలాండ్‌లో నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ అనే కొత్త పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా దెబ్బతిన్నది.
ఈసారి పోలింగ్‌లో మహిళలు విశేషంగా పాల్గొన్నప్పటికీ ఎప్పటిలాగా కనిపించని మార్పు ఒక్కటే. అదే మహిళల ప్రాతినిధ్యం. త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లో ముగ్గురేసి మహిళలు ఈ ఎన్నికల్లో విజయం సాధించగా, ఎప్పటిలాగే నాగాలాండ్‌లో ఒక్కరు కూడా విజయం సాధించలేదు. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 13 మంది స్వతంత్య్ర సభ్యులు సహా మొత్తం 60 మంది మహిళలు పోటీ చేశారు. వారు కేవలం ఆరుగురు మాత్రమే విజయం సాధించారు.
మహిళల ప్రాతినిథ్యం విషయంలో మొదటి నుంచి ఈ రాష్ట్రాల పరిస్థితి అలాగే ఉంది. 1960వ దశకం నుంచి ఇప్పటి వరకు ఈ మూడు రాష్ట్రాల్లో 307 మంది మహిళలు పోటీ చేయగా, వారిలో 44 మంది మాత్రమే విజయం సాధించారు. 2013 సంవత్సరంతో పోలిస్తే త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లో మహిళల ప్రాతినిథ్యం తగ్గింది. 2013లో తొమ్మిది మంది మహిళా ఎమ్మెల్యేలు ఉండగా, ఈసారి ఆరుగురు మహిళలు మాత్రమే విజయం సాధించారు. మేఘాలయలో మాజల్ అంపారిన్ లింగ్డో, దిక్కాంచిసిర అనే మహిళలు తమ స్థానాలను తిరిగి గెలుచుకోగా, మాజీ కేంద్ర మంత్రి పీఏ సంగ్మా కూతురు అగాథా సంగ్మా తొలిసారి అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించారు.
త్రిపురలో ప్రభుత్వం వ్యతిరేక ఓటును తట్టుకొని సీపీఎం తరఫున బిజితా నాథ్ అనే మహిళ మాత్రమే విజయం సాధించారు. మిగతా ఇద్దరు కళ్యాణి రాయ్, శంతన చక్మా బీజేపీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. ఇక నాగాలాండ్‌లో ప్రధాన రాజకీయ పార్టీలేవీ మహిళలను పోటీకి నిలబెట్టలేదు. ఎక్కువ మంది స్వతంత్య్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. ఒక్కరు కూడా విజయం సాధించలేదు. దేశవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల ప్రాతినిథ్యం అంతో ఇంతో పెరుగుతుండగా, ఈశాన్య రాష్ట్రాల్లో రానురాను తగ్గుతోంది.
దేశవ్యాప్తంగా మహిళల ప్రాతినిథ్యం 7. 6 శాతం ఉండగా, నాగాలాండ్‌లో జీరో, హర్యానాలో అత్యధికంగా 14.4 శాతం ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో మహిళల ప్రాతినిధ్యం తగ్గిపోవడానికి రెండు కారణాలు చెబుతారు. ఒకటి రాజకీయాల్లో మహిళలకు తగిన అనుభవం లేదన్నది ఒక్కటైతే మగవాళ్లలో పోలిస్తే మహిళలకు రాజకీయాల్లో బలహీనులని, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో, సమర్థపాలన అందించడంలో వారు పోటీ పడలేరన్నది రెండో కారణం. అయితే గత 15 ఏళ్లలో మహిళా ఎమ్మెల్యేల చేపట్టిన పనులను పరిశీలిస్తే వారే మగవారికన్నా ఎక్కువ రాణించారు. పలు నియోజక వర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువ ఉన్నప్పటికీ, పలు ప్రచార ర్యాలీల్లో మహిళలే ఎక్కువ క్రియాశీలకంగా పాల్గొన్నప్పటికీ ఎన్నికల్లో ఎక్కువ మంది మహిళలు గెలవక పోవడం చిత్రమైన పరిస్థితి. అది వారికో శాపంలా పరిణమించింది.
Comments
Please login to add a commentAdd a comment