సాక్షి, న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ మూడు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాలను (త్రిపుర, నాగాలాండ్) బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. మేఘాలయలో మాత్రం హంగ్ పరిస్థితి నెలకొంది. ఏ పార్టీ కూడా పూర్తి మెజార్టీని సాధించలేకపోయాయి. ఈ మూడు రాష్ట్రాల్లో కూడా ఒక్కో రాష్ట్రానికి మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వాటిల్లో త్రిపురలో 59, మేఘాలయలో 59, నాగాలాండ్‌లో 60 స్థానాలకు ఎన్నికలుజరగడం కౌంటింగ్ పూర్తవడం జరిగింది.
లెఫ్ట్ కోట బద్ధలు.. త్రిపురలో బీజేపీ పాగా
దాదాపు 25 ఏళ్లుగా త్రిపురలో చక్రం తిప్పుతున్న వామపక్షాల కంచుకోటను బీజేపీ బద్ధలు కొట్టింది. త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ ఈ ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని చవి చూసింది. 2013లో లెఫ్ట్ పార్టీ సీపీఎం గతంలో మొత్తం 49 సీట్లు దక్కించుకోగా ఈసారి జరిగిన ఎన్నికల్లో కేవలం 16 సీట్లు మాత్రమే దక్కించుకోగలిగింది. అయితే, బీజేపీ మాత్రం భారీ విజయం అందుకుందనే చెప్పాలి. 2013లో అసలు ఖాతానే తెరవని బీజేపీ ఏసారి ఏకంగా 43సీట్లతో పూర్తి మెజార్టీ సాధించింది.
మేఘాలయలో హంగ్.. కాంగ్రెస్‌కే ఛాన్స్
ఇప్పటి వరకు మేఘాలయలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఈసారి జరిగిన ఎన్నికల్లో మాత్రం హంగ్ పరిస్థితి నెలకొంది. 2013లో కాంగ్రెస్ పార్టీకి 28 స్థానాలు రాగా ఈసారి 21 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఇక నేషనల్ పీపుల్స్ పార్టీకి(ఎన్‌పీపీ) 19 సీట్లు రాగా బీజేపీ కేవలం రెండు స్థానాలు మాత్రమే తన ఖాతాలో వేసుకోగలిగింది. ఇతరులు 17 స్థానాలు గెలుచుకున్నారు. బీజేపీ మద్దతిచ్చినా ఎన్‌పీపీకి 21 స్థానాలే వస్తాయి. మేజిక్ ఫిగర్ అందుకోవాలంటే మరో 9కిపైగా సీట్లు కావాల్సిందే. ఇలా చేయాలంటే ఇతరులపై ఎన్‌పీపీ ఆధారపడాలి కానీ, అది సాధ్యమయ్యేదిగా కనిపించడం లేదు. అయితే, గతంలో కాంగ్రెస్ పడిపోయే పరిస్థితుల్లో ఎన్‌పీపీ మద్దతు ఇచ్చినందున ఈసారి కూడా కాంగ్రెస్, ఎన్‌పీపీ భాగస్వామ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
నాగాలాండ్ బీజేపీ ఖాతాలో..
నాగాలాండ్ కూడా బీజేపీ ఖాతాలో దాదాపు పడింది. ఇక్కడ బీజేపీ ఒంటరిగా కాకుండా వివిధ పార్టీలతో కలిసి నేషనల్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ (ఎన్‌డీపీపీ ప్లస్)గా పోటీ చేసింది. ఈ కూటమి మొత్తం 30 స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ గతంలో ఇక్కడ 8 స్థానాలు గెలుచుకోగా ఈసారి మాత్రం ఖాతా కూడా తెరవలేకపోయింది. అయితే, నాగా పీపుల్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) మాత్రం 28 స్థానాలు గెలుచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment