north-east
-
కాంగ్రెస్ వల్లే చొరబాట్లు
గోహ్పూర్/ఆలో: గత కాంగ్రెస్ ప్రభుత్వాలు అనుసరించిన విధానాల కారణంగానే అస్సాంతోపాటు ఈశాన్య రాష్ట్రాలు అక్రమ చొరబాట్లతో ఇబ్బందులు పడుతున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో దేశం సాధించిన విజయాలు, అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని మండిపడ్డారు. శనివారం ఆయన అస్సాంలోని గోహ్పూర్, అరుణాచల్‌లోని ఆలో సభల్లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో అసోం ఏవిధంగా నిర్లక్ష్యానికి గురైందీ పెద్దవారిని అడిగి తెలుసుకోవాలని ప్రధాని యువతను కోరారు. ‘దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసిన కాంగ్రెస్‌కు అసోం ప్రజలు మద్దతిస్తారా? దేశం అభివృద్ధిని కాంక్షించని ఆ పార్టీ అస్సాం అభివృద్ధిని పట్టించుకుంటుందా?’ అని ప్రజలను ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజలను మోసం చేస్తూనే ఉంది. కానీ, ఈ చౌకీదార్(మోదీ) చొరబాట్లు, ఉగ్రవాదం, అవినీతిపై పోరాటం సాగిస్తున్నాడు. అందుకే వచ్చే ఎన్నికల్లో మా పార్టీకి మద్దతివ్వండి’ అని ప్రధాని ప్రజలను కోరారు. అనంతరం ఆయన అరుణాచల్‌లోని ఆలోలో మాట్లాడుతూ.. అప్రమత్తంగా ఉంటూ సరిహద్దులను కాపాడుతున్న ఇక్కడి ప్రజల వల్లనే అరుణాచల్ దేశానికి రక్షణ కవచంగా మారిందన్నారు. ‘దేశం గణనీయమైన విజయాలు సాధించినప్పుడు, మీరు సంతోషపడరా? దేశ విజయాలను చూసి ప్రతి ఒక్కరూ గర్వపడటం సహజం. కానీ కొందరు మాత్రం, దేశం సాధించిన ప్రగతి, విజయాలకు బాధపడతారు. ఉగ్రవాదులను వారి ఇళ్లలోనే హతమార్చినప్పుడు ప్రతిపక్షాలు ఎలా వ్యవహరించాయో మీరు చూశారు. మన శాస్త్రవేత్తలు సాధించిన ఘన విజయాలను కూడా వారు చులకన చేశారు. అలాంటి ప్రతిపక్ష పార్టీలను వచ్చే ఎన్నికల్లో మీరే శిక్షించాలి’ అని ప్రజలను కోరారు. అవినీతికి మారుపేరైన కాంగ్రెస్ పార్టీ..దేశ ప్రజల ప్రయోజనాలతో చెలగాటమాడుకుందని విమర్శించారు. దాదాపు 55 ఏళ్ల కాంగ్రెస్ రాచరిక పాలనలో రాష్ట్రాభివృద్ధి సుదూర స్వప్నంగా మిగిలిపోయిందని ఆరోపించారు. ‘మీ వల్లనే ఈశాన్య భారతాన మొదటగా అరుణాచల్‌లోనే కమలం వికసించింది. రాష్ట్రంలోని 50వేల కుటుంబాలకు విద్యుత్, 40 వేల కుటుంబాలకు వంట గ్యాస్ సౌకర్యం కల్పించడంతోపాటు ఒక లక్ష కుటుంబాలకు మరుగుదొడ్లు నిర్మించి ఇచ్చాం. స్వాతంత్య్రం వచ్చిన దాదాపు 7 దశాబ్దాల తర్వాత మా ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి రైలు సౌకర్యం కల్పించింది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ఈశాన్య ప్రాంతానికి గణనీయంగా నిధులు వెచ్చించాం’ అని వివరించారు. -
అన్నింటా ముందే, అయినా ఇదేమీ శాపం!
సాక్షి, న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీలకు గత నెల జరిగిన ఎన్నికల్లో దాదాపు 90 శాతం పోలింగ్ జరగడం విశేషం. ఓటర్లు సృష్టించిన ఈ తుపానుకు త్రిపురలో వామపక్ష ప్రభుత్వం తుడుచుపెట్టుకుపోగా, నాగాలాండ్‌లో నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ అనే కొత్త పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా దెబ్బతిన్నది. ఈసారి పోలింగ్‌లో మహిళలు విశేషంగా పాల్గొన్నప్పటికీ ఎప్పటిలాగా కనిపించని మార్పు ఒక్కటే. అదే మహిళల ప్రాతినిధ్యం. త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లో ముగ్గురేసి మహిళలు ఈ ఎన్నికల్లో విజయం సాధించగా, ఎప్పటిలాగే నాగాలాండ్‌లో ఒక్కరు కూడా విజయం సాధించలేదు. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 13 మంది స్వతంత్య్ర సభ్యులు సహా మొత్తం 60 మంది మహిళలు పోటీ చేశారు. వారు కేవలం ఆరుగురు మాత్రమే విజయం సాధించారు. మహిళల ప్రాతినిథ్యం విషయంలో మొదటి నుంచి ఈ రాష్ట్రాల పరిస్థితి అలాగే ఉంది. 1960వ దశకం నుంచి ఇప్పటి వరకు ఈ మూడు రాష్ట్రాల్లో 307 మంది మహిళలు పోటీ చేయగా, వారిలో 44 మంది మాత్రమే విజయం సాధించారు. 2013 సంవత్సరంతో పోలిస్తే త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లో మహిళల ప్రాతినిథ్యం తగ్గింది. 2013లో తొమ్మిది మంది మహిళా ఎమ్మెల్యేలు ఉండగా, ఈసారి ఆరుగురు మహిళలు మాత్రమే విజయం సాధించారు. మేఘాలయలో మాజల్ అంపారిన్ లింగ్డో, దిక్కాంచిసిర అనే మహిళలు తమ స్థానాలను తిరిగి గెలుచుకోగా, మాజీ కేంద్ర మంత్రి పీఏ సంగ్మా కూతురు అగాథా సంగ్మా తొలిసారి అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించారు. త్రిపురలో ప్రభుత్వం వ్యతిరేక ఓటును తట్టుకొని సీపీఎం తరఫున బిజితా నాథ్ అనే మహిళ మాత్రమే విజయం సాధించారు. మిగతా ఇద్దరు కళ్యాణి రాయ్, శంతన చక్మా బీజేపీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. ఇక నాగాలాండ్‌లో ప్రధాన రాజకీయ పార్టీలేవీ మహిళలను పోటీకి నిలబెట్టలేదు. ఎక్కువ మంది స్వతంత్య్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. ఒక్కరు కూడా విజయం సాధించలేదు. దేశవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల ప్రాతినిథ్యం అంతో ఇంతో పెరుగుతుండగా, ఈశాన్య రాష్ట్రాల్లో రానురాను తగ్గుతోంది. దేశవ్యాప్తంగా మహిళల ప్రాతినిథ్యం 7. 6 శాతం ఉండగా, నాగాలాండ్‌లో జీరో, హర్యానాలో అత్యధికంగా 14.4 శాతం ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో మహిళల ప్రాతినిధ్యం తగ్గిపోవడానికి రెండు కారణాలు చెబుతారు. ఒకటి రాజకీయాల్లో మహిళలకు తగిన అనుభవం లేదన్నది ఒక్కటైతే మగవాళ్లలో పోలిస్తే మహిళలకు రాజకీయాల్లో బలహీనులని, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో, సమర్థపాలన అందించడంలో వారు పోటీ పడలేరన్నది రెండో కారణం. అయితే గత 15 ఏళ్లలో మహిళా ఎమ్మెల్యేల చేపట్టిన పనులను పరిశీలిస్తే వారే మగవారికన్నా ఎక్కువ రాణించారు. పలు నియోజక వర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువ ఉన్నప్పటికీ, పలు ప్రచార ర్యాలీల్లో మహిళలే ఎక్కువ క్రియాశీలకంగా పాల్గొన్నప్పటికీ ఎన్నికల్లో ఎక్కువ మంది మహిళలు గెలవక పోవడం చిత్రమైన పరిస్థితి. అది వారికో శాపంలా పరిణమించింది. -
ఈశాన్య రాష్ట్రాల అంబాసిడర్‌గా మేరికోమ్
న్యూఢిల్లీ/అగర్తల: భారత ఒలంపిక్ బాక్సర్ చాంపియన్ మేరీకోమ్‌కు మరో అరుదైన గౌరవం దక్కనుంది. ఈశాన్య రాష్ట్రాలకు ఆమెను ప్రచారకర్త(బ్రాండ్ అంబాసిడర్)గా కేంద్ర ప్రభుత్వం నియమించనుంది. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు ఆదివారం వెల్లడించారు. 'డోనర్(డెవలప్ మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్రన్ రీజియన్) నాయకత్వంలో ఈశాన్య రాష్ట్రాలు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు పరిష్కారం చూపే కార్యక్రమాల ప్రచారం కోసం కొందరు ప్రముఖ వ్యక్తుల కోసం మంత్రి జితేంద్ర సింగ్ నేతృత్వంలో కమిటీ వేశాం. చివరిగా అది మేరీకోమ్‌ను ఎంపికచేసింది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నాం' అని డోనర్ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. మణిపూర్‌కు చెందిన మేరీకోమ్ ఇప్పటికే బాక్సింగ్‌లో ఐదు ప్రపంచ టైటిళ్లను, ఒలంపిక్ను గెలుచుకున్నారు. రియోడిజనరియోలో జరగనున్న ఒలంపిక్ గేమ్స్ అనంతరం తాను బాక్సింగ్ నుంచి విశ్రాంతి తీసుకోనున్నట్లు మేరీకోమ్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
మరో ద్రోణి
సాక్షి, చెన్నై: నైరుతీ, ఈశాన్య రుతు పవనాల ప్రభావం రాష్ర్టం మీద అంతంత మాత్రమే. దక్షిణాదిలోని తిరునల్వేలి, కన్యాకుమారిని మాత్రం ఈశాన్య రుతుపవనాలు కరుణించాయి. మిగిలిన చోట్ల ప్రభావం కరువే. అయితే, వరుసగా పైలీన్, హెలెన్, లెహర్ తుపాన్ల రూపంలో వర్షాలు పడుతుండడంతో అన్నదాతకు ఊరట కలుగుతోంది. ఈ తుపాన్ల ప్రభావంతో రాష్ట్రానికి పెను నష్టం తప్పినా, వర్షాలు మాత్రం పడుతుండటం విశేషం. లెహర్ బలహీన పడిన తర్వాత ఓ మూడు నాలుగు రోజులు వర్షాలు తెరపిచ్చాయి. అయితే, శనివారం బంగాళా ఖాతంలో నైరుతీ దిశలో ఏర్పడ్డ అల్ప పీడనం ప్రభావంతో సముద్ర తీర, దక్షిణాది జిల్లాల్లో శనివారం రాత్రి నుంచి వర్షాలు పడుతున్నాయి. రాత్రుల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. ఈ ద్రోణి శ్రీలంక - ఉత్తర తమిళనాడు వైపుగా నైరుతీ-వాయువ్య దిశలో సాగుతోంది. అదే సమయంలో బంగాళాఖాతంలో ఆదివారం మరో ద్రోణి బయలు దేరింది. ఆగ్నేయంలో నెలకొన్న ఈ ద్రోణి క్రమంగా బలపడే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు ద్రోణుల పుణ్యమా అని రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు పడనున్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ ప్రభావంతో చెన్నై, కడలూరు, నాగపట్నం, తూత్తుకుడి, కన్యాకుమారి తదితర సముద్ర తీరాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఆదివారం చిదంబరంలో అత్యధికంగా 11 సె.మీ, కాయిల్ పట్టినం, తిరుప్పూండిలో పది సెం.మీ, కులశేఖర పట్నంలో 8 సె.మీ, రామనాధపురంలో ఆరు సె.మీ వర్షం పడ్డట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. చెన్నై, కాంచీపురంలో కూడా వర్షం పడింది. ఆకాశం మేఘావృతమైంది. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో చలి మరికాస్త ఎక్కువైంది.