
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం కొత్తరూపు సంతరించుకుంటోంది. ఇప్పటికే జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీల పునర్విభజన పూర్తవగా తాజాగా పరిపాలనలో కీలకమైన పోస్టుల భర్తీలో కొత్త వ్యవస్థ మొదలవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు బుధవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ‘తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్) ఆర్డర్–2018గా దీన్ని పేర్కొంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం జిల్లాల పునర్విభజన జరిగింది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం జోనల్ విధానాన్ని రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి గురువారం ఉత్తర్వులు (124) జారీ చేశారు. కొత్త జోనల్ విధానం ప్రకారం తీసుకునే ఏ నిర్ణయమైనా రాజ్యాంగం లోని 371 (డీ) ప్రకారం 1975 అక్టోబర్ 18న జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి తాజా నోటిఫికేషన్ జారీ చేశారు. స్థానికత, పోస్టులు, క్యాడర్, జిల్లా, జోన్, మల్టీజోన్ వంటి అంశాలను పేర్కొంటూ కొత్త విధానంలో 14 పాయింట్లలో పొందుపరిచారు.
కొత్త జోనల్ విధానంలోని అంశాలివీ
రాష్ట్రపతి ఆమోదించిన కొత్త జోనల్ విధానం ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల్లోని అన్ని రకాల పోస్టులను జిల్లా, జోన్, మల్టీజోన్, రాష్ట్రస్థాయి, సివిల్ సర్వీస్ కేడర్‌లవారీగా వర్గీకరించాలి. 36 నెలల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. గడువులోగా పూర్తి చేయని పరిస్థితుల్లో మళ్లీ రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్, దీనికి సమానమైన, దీనికంటే తక్కువ కేడర్ పోస్టులను ప్రత్యేక కేటగిరీగా పేర్కొన్నారు. మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్, ప్రభుత్వ పాఠశాలల్లోని నాన్ గెజిట్ కేటగిరీలోని టీచర్ల పోస్టులను జిల్లా యూనిట్‌గా ఒక కేడర్‌గా భావిస్తారు. జూనియర్ అసిస్టెంట్ పైస్థాయికి సమానమైన పోస్టుల నుంచి సూపరింటెండెంట్, దీనికి సమానమైన పోస్టులను ప్రత్యేక కేడర్‌గా పేర్కొన్నారు. ఈ పోస్టులు జోన్ పరిధిలో ఉంటాయని తెలిపారు. సూపరింటెండెంట్‌పై స్థాయికి సమానమైన పోస్టుల నుంచి డిప్యూటీ కలెక్టర్ పోస్టు వరకు ఉండే అన్ని రకాల పోస్టులను మల్టీజోనల్ పోస్టులుగా నిర్ధారించారు.
అన్ని స్థానిక కేడర్లలోని ఉద్యోగుల ఉన్నతస్థాయి పదోన్నతులకు సమాన అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. లోకల్ కేడర్ నుంచి ఇతర ఆఫీసులకు, సంస్థలకు ఒక ఉద్యోగిని బదిలీ చేయడానికి ఈ ఉత్తర్వు వర్తించదు. ఒక లోకల్ కేడర్ నుంచి మరో లోకల్ కేడర్‌కు బదిలీ జరగాలి. ప్రతి మల్టీజోన్ ఒక లోకల్ ఏరియాగా ఉంటుంది. కొన్ని మినహా అన్ని రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థల పోస్టులు వీటి పరిధిలో ఉంటాయి. లోకల్ కేడర్‌కు బదిలీ చేయడంతో ఇబ్బంది పడినట్లుగా భావించిన ఉద్యోగి ఈ విషయంపై ప్రభుత్వానికి ఆరు రోజుల్లోగా వినతిపత్రం ఇవ్వాలి.
పైకేడర్ పోస్టుల భర్తీ విషయంలో లోకల్ కేడర్ నుంచి సమానావకాశాలు వర్తిస్తాయి. లోకల్ కేడర్ అధికారిని ఏ కార్యాలయానికైనా బదిలీ చేయవచ్చని పేర్కొన్నారు. ఒక లోకల్ కేడర్‌లో ఉన్న ఉద్యోగిని ఇతర లోకల్ కేడర్‌కు బదిలీ చేయొచ్చు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రతి కేటగిరీ పోస్టులకు, ప్రతి ప్రాంతానికి ఒక లోకల్ కేడర్‌ను, నియామకాల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వచించిన ‘స్థానికత’ప్రకారం పోస్టులను, నియామకాలను, విధి నిర్వహణ అంశాలను పేర్కొన్నారు.
ప్రతి జిల్లా ఒక లోకల్ ఏరియాగా ఉంటుంది. అలాగే ప్రతి జోన్‌ను ఒక లోకల్ ఏరియాగా పరిగణిస్తారు. మల్టీజోన్ విషయంలోనూ ఇదే విధంగా ఉంటుంది. ఒకటికంటె ఎక్కువ జిల్లాల్లోని ఒకే కేడర్ పోస్టులుగా ఉండే పోస్టులను ప్రత్యేక కేడర్‌గా పరిణగిస్తారు. జోన్, మల్టీజోన్ విషయంలోనూ ఇదే తరహా విధానం ఉంటుంది.
డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కు అర్హత సాధించే వ్యక్తి అక్కడ స్థానికుడిగా ఉంటారు. పోస్టులవారీగా పేర్కొనే నిబంధనల ప్రకారం ఈ స్థానికతను పరిగణనలోకి తీసుకుంటారు. తెలంగాణ ప్రభుత్వ అమోదిత విద్యా సంస్థల్లో వరుసగా నాలుగేళ్లు చదివిన వారిని స్థానికులుగా పరిగణిస్తారు. చదివిన జిల్లాలను స్థానిక జిల్లాగా పేర్కొంటారు.
జిల్లా, జోనల్, మల్టీజోనల్ పరిధిలోని అన్ని పోస్టుల భర్తీలో స్థానికులకు ప్రాధాన్యత ఉంటుంది. అన్ని విభాగాల్లోనూ 95 శాతం పోస్టులను డెరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద భర్తీ చేస్తారు. ఇలా భర్తీ చేసే 95 శాతం పోస్టుల్లో పూర్తిగా స్థానికులకే అవకాశం ఉంటుంది. ఈ మేరకు రిజర్వేషేన్లు కల్పిస్తారు. ఓపెన్ కేటగిరీ కింద 5 శాతం మాత్రమే ఉంటాయి. స్థానిక అభ్యర్థులు లేకపోవడం వల్ల ఖాళీగా మిగిలే పోస్టులను తర్వాత స్థానికులకే చెందేలా క్యారీ ఫార్వర్డ్ చేస్తారు.
సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, ప్రత్యేక కార్యాలయాలు, కొత్తగా ఏర్పాటు చేసే కార్యాలయాలు, రాష్ట్రస్థాయి కార్యాలయాలకు జోనల్ విధానంలోని నిబంధనలు వర్తించవని గెజిట్‌లో పేర్కొన్నారు. ఆయా కార్యాలయాల్లోని సిబ్బందిని మాత్రం జిల్లాల్లోని కార్యాలయాలకు పరస్పరం బదిలీ చేయవచ్చని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment