ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాలు పెరిగినా జోన్లు నాలుగే | Committee of Superiors made proposals on zonal system of employees | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాలు పెరిగినా జోన్లు నాలుగే

Published Wed, Feb 16 2022 4:06 AM | Last Updated on Wed, Feb 16 2022 4:23 PM

Committee of Superiors made proposals on zonal system of employees - Sakshi

సాక్షి, అమరావతి: ఉగాది నుంచి కొత్త జిల్లాల ఏర్పాటుకు చర్యలు ప్రారంభమైన నేపథ్యంలో ఉద్యోగుల జోనల్‌ వ్యవస్థ పైన ఉన్నతాధికారుల కమిటీ ప్రతిపాదనలు తయారు చేసింది. ఉన్నత విద్యా సంస్థల పరిధిపైనా అధికారులు కసరత్తు పూర్తి చేశారు. సిక్స్‌ పాయింట్‌ ఫార్ములా ప్రకారం ప్రస్తుతం ఉద్యోగుల జోనల్‌ వ్యవస్థ ఎలా ఉంది, కొత్త వ్యవస్థ ఎలా ఉండాలో ప్రతిపాదించారు. ప్రస్తుతం 13 జిల్లాలు ఉన్నాయి. వీటికి రెండు మల్టీ జోన్లు (1, 2), వాటి పరిధిలో నాలుగు జోన్లు  (1, 2, 3, 4) ఉన్నాయి. మల్టీ జోన్‌–1 పరిధిలోని జోన్‌–1లో శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలు, జోన్‌–2లో తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు ఉన్నాయి. మల్టీ జోన్‌–2 పరిధిలోని జోన్‌–3లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, జోన్‌–4లో అనంతపురం, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్‌ కడప జిల్లాలున్నాయి.  

కొత్త జోనల్‌ వ్యవస్థ ఇలా..  
పునర్వ్యవస్థీకరణ అనంతరం 26 జిల్లాలనూ అదే క్రమంలో విభజిస్తారు. ప్రస్తుతం ఉన్న విధంగానే రెండు మల్టీ జోన్లు, నాలుగు జోన్లనే ప్రతిపాదించారు. కానీ వాటి పరిధిలో కొత్త జిల్లాలు అదనంగా వస్తాయి. ఒక్కో జోన్‌లో 5 నుంచి 7 జిల్లాలు వస్తాయి. మల్టీ జోన్‌–1 పరిధిలోని జోన్‌–1లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలు, జోన్‌–2లో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలు రానున్నాయి. మల్టీ జోన్‌–2 పరిధిలోని జోన్‌–3లో గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, జోన్‌–4లో కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలను ప్రతిపాదించారు.

కొత్తగా ఏర్పడుతున్న శ్రీ బాలాజీ జిల్లాలో 17 మండలాలు నెల్లూరులో (జోన్‌–3), 18 మండలాలు చిత్తూరులో (జోన్‌–4) ఉండటంతో దాన్ని ఏ జోన్‌లో ఉంచాలనే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటారు. జూనియర్‌ అసిస్టెంట్‌ దానికి సమాన స్థాయి ఉద్యోగుల బదిలీలు జిల్లా పరిధిలోనే ఉండడంతో వారు పూర్తిగా జోనల్‌ వ్యవస్థలోకి వస్తారు. జూనియర్‌ అసిస్టెంట్‌ కంటే పై స్థాయి ఉద్యోగుల నుంచి సూపరింటెండెంట్ల వరకు జోనల్‌ స్థాయి పరిధిలో ఉంటారు. సూపరింటెండెంట్‌ ఆ పై క్యాడర్‌ ఉద్యోగులంతా మల్టీ జోన్‌లోకి వస్తారు. అందువల్ల విభజనలో వారిపై ప్రభావం ఉండదు.  
ఉన్నత విద్యా సంస్థల పరిధి 
రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థలన్నీ ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీల పరిధిలో ఉన్నాయి. ఆంధ్రా యూనివర్సిటీ రీజియన్‌లో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలు ఉన్నాయి.  శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్‌లో అనంతపురం, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, వైఎస్సార్‌ కడప జిల్లాలున్నాయి. జిల్లాల విభజన తర్వాత ఆంధ్రా యూనివర్సిటీ రీజియన్‌లో శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, బాపట్ల, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం జిల్లాలను ప్రతిపాదించారు.

శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్‌లో అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, శ్రీబాలాజీ, శ్రీ సత్యసాయి, వైఎస్సార్‌ కడప జిల్లాలు ఉండాలని ప్రతిపాదించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోకి ప్రకాశం జిల్లా (ఆంధ్రా వర్సిటీ రీజియన్‌) పరిధిలోని 5 మండలాలు, నెల్లూరు జిల్లా (వెంకటేశ్వర వర్సిటీ రీజియన్‌) పరిధిలోని 30 మండలాలు ఉండడంతో దాన్ని ఏ రీజియన్‌ పరిధిలో చేర్చాలనే అంశంపై కసరత్తు జరుగుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement