బదిలీలు ఉంటాయో.. లేదో!?  | GO 317 Confusion not to leave Gurukul | Sakshi

బదిలీలు ఉంటాయో.. లేదో!? 

Published Mon, Jul 17 2023 12:49 AM | Last Updated on Mon, Jul 17 2023 12:49 AM

GO 317 Confusion not to leave Gurukul - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల విద్యాసంస్థల్లోని ఉద్యోగుల్లో జీఓ 317 భయం వీడలేదు. రాష్ట్రంలో నూతన జోనల్‌ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత స్థానికత ఆధారంగా ఉద్యోగుల కేటాయింపులను దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలు పూర్తి చేసినప్పటికీ... కేవలం గురుకుల విద్యా సంస్థల్లో మాత్రమే ఈ ప్రక్రియ పెండింగ్‌లో పడింది. నాలుగు గురుకుల సొసైటీల పరిధిలో దాదాపు 30వేల మంది బోధన, బోధనేతర సిబ్బంది ఉన్నారు.

వీరందరికీ స్థానికత ఆధారంగా జిల్లా, జోనల్, మల్టీజోనల్‌ స్థాయిలో కేటాయింపులు జరిపారు. ఈ మేరకు నూతన కేటాయింపులతో కూడిన జాబితాలను గురుకుల సొసైటీలు సిద్ధం చేసినప్పటికీ 2022–23 విద్యా  సంవత్సరం మధ్యలో ఉద్యోగులకు స్థానచలనం కలిగిస్తే ఇబ్బందులు వస్తాయన్న భావనతో ఈ ప్రక్రియను అప్పట్లో వాయిదా వేశారు. కానీ ప్రస్తుతం నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై రెండో నెల గడుస్తున్నా జీఓ 317 అమలు ఊసేలేదు. 

ఉద్యోగ ఖాళీలపై స్పష్టత ఎలా...? 
రాష్ట్రంలో నూతన జోనల్‌ విధానం అమల్లోకి రావడంతో ఉద్యోగ ఖాళీలపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ముందుగా ఉద్యోగుల కేటాయింపులు పూర్తయిన తర్వాతే ఖాళీలపై స్పష్టత వస్తుందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు చేసింది. ఈ క్రమంలో గతేడాది అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ కేటాయింపులు పూర్తయ్యాయి. స్థానికత ఆధారంగా ఈ కేటాయింపులు జరపడంతో జిల్లా, జోన్లు, మల్టీజోన్ల వారీగా ఉద్యోగ ఖాళీలపై స్పష్టత వచ్చింది.

ఈక్రమంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులున్న గురుకుల విద్యా సంస్థల సొసైటీల్లోనూ జీఓ 317 అమలు చేస్తేనే ఉద్యోగ ఖాళీల లెక్క తేలుతుందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం... ఆ దిశగా చర్యలు చేపట్టాలని సొసైటీ కార్యదర్శులను ఆదేశించింది. దాంతో గతేడాది జూలై, ఆగస్టు నెలల్లో ఈ కసరత్తు పూర్తి చేసి ప్రాథమిక జాబితాలు రూపొందించినప్పటికీ... వాటిని ఇప్పటివరకు అమలు చేయలేదు.

వాస్తవానికి 2023–24 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి నూతన కేటాయింపులకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడితే ఆ మేరకు ఉద్యోగులు విధుల్లో చేరే వీలుండేది. కానీ విద్యా సంవత్సరం ప్రారంభమై రెండో నెల గడుస్తున్నాజీఓ 317 అమలుపై సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతం విద్యా సంవత్సరం కొనసాగుతుండడం.... మరోవైపు ఎన్నికల సమయం ముంచుకొస్తుండడంతో ఉద్యోగులను కొత్త స్థానాలకు బదిలీ చేసే అవకాశంపై సొసైటీ వర్గాల్లో కొంత ఆనిశ్చితి కనిపిస్తోంది. ఇంకోవైపు గురుకుల విద్యా సంస్థల్లో కొలువుల ఖాళీల లెక్కపైనా అయోమయం నెలకొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement