ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులను అరెస్టు చేసి తరలిస్తున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: జోనల్ విధానం అమలు కోసం ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవోపై ఉపాధ్యాయుల వ్యతిరేకత రోజురోజుకూ పెరగుతోంది. పలు సంఘాలు సోమవారం వివిధ రూపాల్లో తమ నిరసనలు తెలిపాయి. సీనియారిటీ ప్రాతిపదికగా కేటాయింపులు చేయడం, భార్యాభర్తలు ఒకే చోట పనిచేసే ఆప్షన్లను పరిగణలోనికి తీసుకోకపోవడంపై టీచర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
కొత్త జిల్లాలకు కేటాయించినా ఆ జిల్లాల్లో పట్టణ ప్రాంతాలకు సమీపంలోని స్కూళ్లను బ్లాక్ చేశారని, దీంతో మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని పలువురు నేతల వద్ద వాపోయారు. జీవోకు వ్య తిరేకంగా ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని యూటీ ఎఫ్ సహా పలు సంఘాలు నిర్ణయించాయి.
టీచర్ల అరెస్ట్: సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం నేతలు కరివేద మహిపాల్‌రెడ్డి, అరికెల వెంకటేశం నేతృత్వంలో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ కార్యాలయం ముట్టడికి ఉపాధ్యాయులు ప్రయత్నించారు. దీంతో ఎస్‌జీటీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ను సంఘం నేతలు కలిసి 317 జీవో వల్ల తమకు కలిగే అసౌకర్యాన్ని వివరించారు.
ఇదెక్కడి అన్యాయం?: బాధిత ఉద్యోగులు
317 జీవో అమలులో స్పౌజ్ కేసులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో 13 జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. వేర్వేరుగా బదిలీ అయిన భార్యాభర్తల ఉద్యోగులు తమ ఆందోళనను మీడియాకు వివరించారు. 33 జిల్లాల్లో కేవలం 19 జిల్లాల్లోనే భార్యాభర్తలకు ఒకే జిల్లాలో పోస్టులు ఇచ్చారని, 13 జిల్లాల్లో పోస్టులు బ్లాక్ చేసి, భార్యభర్తలను వేర్వేరు ప్రాంతాలకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
భారీ పోలీసు బందోబస్తు: 13 జిల్లాల స్పౌజ్ బాధితులు సుమారు 150 మందికి పైగా ప్రెస్‌క్లబ్‌కు రావడంతో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ప్రగతిభవన్‌లో మంత్రివర్గ సమావేశం జరుగుతుండటంతో వీళ్లంతా ప్రెస్‌క్లబ్ నుండి ప్రగతిభవన్ వెళ్లే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు పెద్ద సంఖ్యలో రంగంలోకి దిగారు.
8 నెలల బాబుతో ఎలా ఉండాలి?
నాకు యాదాద్రి జిల్లాకు బదిలీ అవగా నా భర్త అనిల్‌కు రంగారెడ్డి జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. 250 కిలోమీటర్ల దూరం. నాకు 8 నెలల బాబు ఉన్నాడు. చిన్న పిల్లాడితో భర్త ఒకచోట, నేను ఒకచోట ఎలా ఉంటాం?
– సుమ
చాలా ఇబ్బంది పడుతున్నాం
నేను పదేళ్లుగా గద్వాల జిల్లాలో టీచర్‌గా పని చేస్తున్నా. నాకు అదే గద్వాలకు పోస్టింగ్ ఇచ్చి నా భర్తకు రంగారెడ్డి జిల్లాకు ఇచ్చారు. ఇద్దరు అమ్మయిలు వారానికోసారి ఇంటికి వచ్చి వెళ్లాల్సి వస్తోంది. ప్రయాణం చేయలేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం. అత్తమామను చూసుకోలేకపోతున్నాం.
– భార్యాభర్తలు పద్మ, శంకర్
Comments
Please login to add a commentAdd a comment