జిల్లా మారితేనే కొత్త పోస్టింగ్‌లు | CS Somesh Kumar Issued Orders Over Zonal System Transfer For Employees | Sakshi
Sakshi News home page

జిల్లా మారితేనే కొత్త పోస్టింగ్‌లు

Published Sat, Dec 25 2021 3:52 AM | Last Updated on Sat, Dec 25 2021 3:52 AM

CS Somesh Kumar Issued Orders Over Zonal System Transfer For Employees - Sakshi

ఉదాహరణకు.. ఉమ్మడి ఆదిలాబాద్‌కు చెందిన ఉద్యోగి ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలో పనిచేస్తున్నాడు అనుకుంటే.. ప్రస్తుతం కేడర్‌ ఫిక్సేషన్‌లో భాగంగా ఆ ఉద్యోగిని మంచిర్యాల జిల్లాకు కేటాయిస్తే.. ఆ ఉద్యోగికి కొత్తగా పోస్టింగ్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్నచోటనే పనిచేయాల్సి ఉంటుంది. 

కానీ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ఉద్యోగి ప్రస్తుతం నిర్మల్‌ జిల్లాలో పని చేస్తూ ఉండి.. మంచిర్యాల జిల్లాకు కేటాయించిన పక్షంలో మాత్రం జిల్లాలో సీనియారిటీ ఆధారంగా కౌన్సెలింగ్‌ ద్వారా మంచిర్యాలలో కొత్తగా పోస్టింగ్‌ ఇవ్వాలి. ఆ ఉద్యోగి నిర్మల్‌ జిల్లా నుంచి రిలీవ్‌ అయ్యి.. మంచిర్యాల జిల్లాలో చేరతారు.

సాక్షి, హైదరాబాద్‌: కొత్త జోనల్‌ విధానం అమల్లో భాగంగా జిల్లాలు మారిన ఉద్యోగులకు మాత్రమే కొత్త పోస్టింగ్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా మారని ఉద్యోగులు మాత్రం ప్రస్తుతం పనిచేస్తున్న స్థానంలోనే ఉంటారని అందులో పేర్కొన్నారు. సాధారణ బదిలీలపై గతంలో ఇచ్చిన ఆంక్షలను సర్కార్‌ సడలించింది.

సాధారణ బదిలీలు చేయాల్సి వస్తే కొత్తవారిని కూడా బదిలీల ప్రక్రియలో భాగస్వామ్యం చేయనుంది. కొత్త పోస్టింగ్‌ల అమలుకు వీలుగా విధి విధానాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులోభాగంగా ఇప్పటికే కొత్త జిల్లాలకు వెళ్లిన ఉద్యోగుల సీనియారిటీ జాబితాను అన్ని ప్రభుత్వ శాఖలూ సిద్ధం చేశాయి. 25వ తేదీన వీటిని అందుబాటులోకి తెస్తారు. 26, 27 తేదీల్లో కొత్త జిల్లాలకు వెళ్లిన ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకుంటారు.

28, 29న కౌన్సెలింగ్‌ పూర్తి చేసి, 30న పనిచేయాల్సిన ప్రాంతానికి సంబంధించిన ఆదేశాలు జారీ చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం జిల్లా కేడర్‌కు వర్తిస్తుంది. జోనల్, మల్టీ జోనల్‌ ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించిన బదిలీ ఉత్తర్వులు ఆ తర్వాత వచ్చే అవకాశముంది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలు స్వాగతించగా, ఏప్రిల్‌లో జరిగే సాధారణ బదిలీలకు దీంతో ఇబ్బంది కలుగుతుందని ఉపాధ్యాయ సంఘాలు అనుమానం వ్యక్తం చేశాయి.  

నిబంధనలు ఇవీ.. 
జిల్లాకు కొత్తగా వచ్చిన ఉద్యోగుల సీనియారిటీ జాబితాను సంబంధిత శాఖల ఉన్నతాధికారులు తయారు చేస్తారు. దీన్ని కలెక్టర్‌ ఆమోదిస్తారు. ఈ జాబితాను శనివారం అందరికీ అందుబాటు లో ఉంచుతారు. 27నుంచి ఉద్యోగులు ఏ ప్రాంతంలో పోస్టింగ్‌ కోరుకుంటున్నారనే ఆప్షన్లు ఇస్తారు. 

జిల్లా అధికారులు అన్ని కేడర్లకు సంబంధించిన ఖాళీలను, ఎక్కడ తక్షణ అవసరం ఉందనే వివరాలను గుర్తిస్తారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా కొత్తగా జిల్లాకు వచ్చిన ఉద్యోగులతో భర్తీ చేస్తారు. భర్తీ చేయాల్సిన పోస్టులనే కౌన్సెలింగ్‌లో ఉంచుతారు. ఉదాహరణకు జిల్లాకు 40 మంది జూనియర్‌ అసిస్టెంట్లు మంజూరై... పోస్టులు 50 ఉన్నప్పుడు, అవసరమైన పోస్టులను మాత్రమే అందుబాటులో ఉంచుతారు.  

ఉద్యోగుల పోస్టింగ్, బదిలీల వ్యవహారం మొత్తం పారదర్శకంగా నిర్వహిస్తారు. తెలంగాణ గెజిటెడ్, నాన్‌–గెజిటెడ్, గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తారు. æ ప్రత్యేక కేటగిరీ, భార్యాభర్తల విషయంలో ప్రాధాన్యత నిర్ధారించేందుకు జిల్లాస్థాయి ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తారు. పోలీసు, రెవెన్యూ, కమర్షియల్‌ టాక్స్, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్, స్టాంప్స్‌ అండ్‌ రిజిష్ట్రేషన్‌ విభాగాల్లో అక్కడి అవసరాలకు అనుగుణంగా ఆయా శాఖలు మార్గదర్శకాలు రూపొందించుకోవచ్చు. ఈ మొత్తం ప్రక్రియ ఏడు రోజుల్లో పూర్తవ్వాలి.

స్వాగతిస్తున్నాం 
ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉన్నాయి. దీన్ని స్వాగతిస్తున్నాం. భార్యాభర్తల బదిలీలు, కౌన్సెలింగ్‌ ద్వారా ఎక్కడి వారక్కడే ఉండేలా కసరత్తు చేయడం మంచి పరిణామమే. ఈ దిశగా చొరవ చూపిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. 
– మామిళ్ల రాజేందర్‌  (టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు) 

బదిలీలపై స్పష్టత ఇవ్వాలి
కొత్త వారికే పోస్టింగ్‌లు ఇవ్వడం వల్ల.. ఆ జిల్లాలో ఏళ్ల తరబడి బదిలీ కోసం ఎదురుచూస్తున్న వారికి న్యాయం జరిగే అవకాశం కన్పించడం లేదు. ఏప్రిల్‌లో సాధారణ బదిలీలు నిర్వహిస్తే అప్పటికే ఉద్యోగులు కోరుకున్న పోస్టులో ఇప్పుడొచ్చిన కొత్తవాళ్లు ఉంటారు. ఏళ్ల తరబడి కోరుకున్న ప్రాంతానికి వెళ్లాలనుకునే వారికి నిరాశే.  
– చావా రవి  (యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement