సాక్షి, అమరావతి: పాత జోనల్ విధానంలో మార్పులు చేసి కొత్త జిల్లాలతో కొత్త జోన్లు, మల్టీజోన్ ఏర్పాటుచేయాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా. కేఎస్ జవహర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో స్థానికత, జోనల్ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ చేయాల్సి ఉన్నందున.. రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ ప్రతిపాదనపై శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో సీఎస్ వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు.
కొత్త జోన్లు, మల్టీజోన్ ఏర్పాటుచేసేందుకు వీలుగా రాష్ట్రపతి ఉత్తర్వుల (1975)కు సవరణ చేసేందుకు ప్రతిపాదిత అంశంపై సీఎస్ సమీక్షించారు. స్థానికత, ప్రతిపాదిత నూతన జోనల్ విధానం తదితర అంశాలపై సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి. భాస్కర్ వివరించారు.
ఈ సమావేశంలో.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌కుమార్ గుప్తా, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ సీహెఎచ్ హరికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
రహదారుల కోత నివారణ..
ఇక రాష్ట్రంలో నదీ పరీవాహక ప్రాంతాల్లో దశాబ్దాలుగా వేధిస్తున్న రోడ్ల కోత నివారణకు కూడా ప్రభుత్వం త్వరలో ముగింపు పలకనుంది. ఇందుకోసం ఫుల్ డెప్త్ రిక్లమేషన్ (ఎఫ్డీఆర్) సాంకేతికతతో రోడ్లు నిర్మించాలని నిర్ణయించింది. ఈ అంశంపైనా శుక్రవారం సీఎస్ జవహర్‌రెడ్డి సమీక్షించారు. ఈ విధానంలో రోడ్లు నిర్మాణానికి తీసుకుంటున్న చర్యలపై ఆయన చర్చించారు.
మెత్తటి నేలల్లో రోడ్లు నిర్మిస్తున్నా, వర్షాలుపడినా, వరదలు వంటి విపత్తులు వచ్చినా నదీతీర ప్రాంతాల్లోని రోడ్లు తరచూ కోతకు గురవుతున్నాయి. ఈ సమస్య తీర ప్రాంత జిల్లాల్లో దశాబ్దాలుగా ఎదురవుతోంది. ఇలా రహదారుల విధ్వంసంతో ప్రభుత్వానికి రూ.వేలకోట్ల నష్టం జరుగుతోంది. ఇకపై రోడ్లను రీసైక్లింగ్ చేయడం ద్వారా వనరుల కొరతతో పాటు వాటి జీవితకాలాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఈ నేపథ్యంలో.. ఫుల్ డెప్త్ రిక్లమేషన్ పెర్ఫార్మెన్స్ అనే కొత్త విధానంలో రోడ్ల నిర్మాణం అందుబాటులోకి వచ్చింది. ఈ విధానంలో పాత రోడ్డును యంత్రాల సాయంతో రెండు నుంచి మూడు అడుగుల లోతు తవ్వుతారు. ఆ తర్వాత సిమెంట్, కెమికల్‌తో మిక్స్‌చేసి చదును చేస్తారు. ఆపై ఒకదానిపై మరొక లేయర్‌ను నిర్మిస్తారు. ఇవి సాధారణ రోడ్లు కంటే 15 నుంచి 20 ఏళ్లు చెక్కుచెదరకుండా ఉంటాయి.
పైగా ఈ విధానంలో రోడ్లు నిర్మిస్తే పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, ఆర్‌డబ్ల్యూఎస్ విభాగాల ఈఎన్‌సీలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment