ఉద్యోగుల సాధారణ బదిలీలకు అవకాశం కల్పించిన ప్రభుత్వం
5 నుంచి మొదలైన ప్రక్రియ.. శాఖల వారీగా మార్గదర్శకాలు విడుదల
సీనియార్టీ, ఖాళీల స్థితిని అంచనా వేసుకుంటున్న ఉద్యోగులు..
‘గరిష్టంగా 40%’ నిబంధనతో సీనియర్లకే బదిలీ చాన్స్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో బదిలీల ఫీవర్ మొదలైంది. దాదాపు ఆరేళ్ల తర్వాత సాధారణ బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వడంతో హడావుడి కనిపిస్తోంది. ప్రధానంగా ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేస్తున్న వారు స్థానచలనం కోసం కసరత్తు మొదలుపెట్టారు. సీనియార్టీ, ఖాళీల స్థితిని అంచనా వేసుకుంటూ బదిలీలకు ఉన్న అవకాశాలను విశ్లేషించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల సాధారణ బదిలీలకు అవకాశం కల్పిస్తూ ఈనెల 3వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 5వ తేదీ నుంచి బదిలీల ప్రక్రియను ప్రభుత్వ శాఖలు మొదలు పెట్టాయి.
20లోగా పూర్తి చేయాలి
ఉద్యోగుల సాధారణ బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఈనెల 20వ తేదీ వరకు సడలిస్తూ.. నిర్దేశించిన షెడ్యూల్‌లోగా అన్ని శాఖలు ఉద్యోగుల బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వులకు అనుగుణంగా ప్రభుత్వ శాఖలు విడివిడిగా బదిలీల మార్గదర్శకాలు జారీ చేస్తున్నాయి. ఇప్పటికే పలు విభాగాలు మార్గదర్శకాలు విడుదల చేయగా... ఒకట్రెండు రోజుల్లో దాదాపు అన్ని శాఖలు కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నాయి.
బదిలీలకు సంబంధించిన రోజువారీ షెడ్యూల్‌ను సైతం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ మేరకు ఈనెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఉద్యోగుల నుంచి బదిలీల దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు వాటిని పరిశీలించడం, అర్హుల జాబితాను విడుదల చేయడం పూర్తి చేసిన తర్వాత ఈనెల 19, 20 తేదీల్లో బదిలీ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులున్న పాఠశాల విద్యాశాఖలో బదిలీల ప్రక్రియ ఇప్పటికే ప్రశాంతంగా ముగిసింది.
రంగారెడ్డి జిల్లాలో ఒకట్రెండు కేటగిరీలు మినహా టీచర్ల బదిలీ దాదాపు పూర్తయింది. ప్రస్తుత బదిలీల్లో జీఓ 317 కింద నూతన కేటాయింపులు జరిగిన ఉద్యోగులు మినహా మిగతా వారిలో చాలామందికి, ప్రధానంగా స్థానచలనం కలిగే అవకాశం ఉంది. మరోవైపు 317 కింద కేటాయింపుల్లో అన్యాయం జరిగిందంటూ కొందరు ప్రభుత్వానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పెట్టుకున్నారు. వారికి కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చే నివేదికను బట్టి మార్పులు జరిగే అవకాశం ఉంటుంది.
సీనియర్లకే స్థానచలనం!
ఉద్యోగుల బదిలీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు విధించింది. గరిష్టంగా 40 శాతానికి మించి ఉద్యోగులను బదిలీ చేయొద్దని ఆదేశించింది. ఈ నిబంధన జూనియర్ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి ప్రభుత్వం ఒకేచోట రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులు బదిలీ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. మరోవైపు ఒకేచోట నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అధికారి/ఉద్యోగి తప్పనిసరి బదిలీల జాబితాలోకి చేరతాడు.
ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ బదిలీలు జరిగిన ఆరేళ్లు కావస్తోంది. దీంతో కొత్తగా నియమితులైన ఉద్యోగులు, జీఓ 317 కింద నూతన కేటాయింపుల్లో భాగంగా మారిన వారు, ఎన్నికల బదిలీలు మినహాయిస్తే దాదాపు ఉద్యోగులందరికీ బదిలీ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అలాగే మెజార్టీ ఉద్యోగులు బదిలీ జాబితాలోకి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అయితే 40 శాతానికి మించి ఉద్యోగుల బదిలీలు చేయొద్దనే నిబంధన కారణంగా పలువురు తప్పనిసరి బదిలీల జాబితాలో ఉన్నప్పటికీ స్థానచలనం కలిగే అవకాశం లేకుండా పోయే పరిస్థితి ఏర్పడనుంది .
ఆన్‌లైన్..మాన్యువల్
ప్రస్తుతం బదిలీల ప్రక్రియ ప్రారంభ దశలోనే ఉంది. ఉద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన తర్వాత సీనియార్టీ జాబితా ప్రకారం బదిలీలకు ఎంతమందికి అవకాశం దక్కుతుందో ఓ అంచానా వేసేందుకు అవకాశం ఉంటుంది. కాగా ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా బదిలీ విధానం మారనుంది. 100 మంది ఉద్యోగుల కంటే ఎక్కువ సంఖ్యలో బదిలీ అయ్యే చోట వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ప్రభుత్వ శాఖలు ఏర్పాట్లు చేసుకున్నాయి.
రాష్ట్రస్థాయి కార్యాలయంలో అయితే పరిమిత సంఖ్యలో ఉద్యోగులుండడంతో మాన్యువల్ కౌన్సెలింగ్‌కు అవకాశం ఉండగా... క్షేత్రస్థాయిలో మాత్రం ఆన్‌లైన్ కౌన్సెలింగ్ జరగనుంది. కౌన్సెలింగ్ ప్రక్రియలో పారదర్శకత కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచి్చంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ శాఖలు ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించుకున్నాయి.
పాలనకు తాత్కాలిక విరామం!
రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు మొదలు జిల్లా స్థాయి, మండల స్థాయి కార్యాలయాల్లో ప్రస్తుతం ఉద్యోగుల బదిలీలపైనే తీవ్ర చర్చ జరుగుతోంది. శాఖల వారీగా మార్గదర్శకాలు వెలువడిన తర్వాత దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆలోపు సంబంధిత ధ్రువపత్రాలు సిద్ధం చేసుకోవడంతో పాటు ఏయే స్థానాలకు బదిలీపై వెళ్లాలనే అంశంపై ఉద్యోగులు విశ్లేషణ చేసుకుంటున్నారు. రానున్న రెండు వారాల పాటు ఉద్యోగులంతా ఈ ప్రక్రియలోనే బిజీ అయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఈనెల 20వ తేదీ వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇతర కార్యకలాపాలకు తాత్కాలికంగా బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment