నగదు ‘బదిలీ’! కీలక పోస్టులన్నీ బేరం పెట్టిన కూటమి నేతలు | Zero service transfers to employees on recommendation of MLAs | Sakshi
Sakshi News home page

నగదు ‘బదిలీ’! కీలక పోస్టులన్నీ బేరం పెట్టిన కూటమి నేతలు

Published Tue, Aug 27 2024 5:01 AM | Last Updated on Tue, Aug 27 2024 5:01 AM

Zero service transfers to employees on recommendation of MLAs

అన్ని నియోజకవర్గాల్లో కీలక పోస్టులన్నీ బేరం పెట్టిన కూటమి నేతలు

ఎమ్మెల్యేల సిఫారసుతో ఉద్యోగులకు జీరో సర్వీసు బదిలీలు

చెప్పినంత ఇస్తేనే సిఫారసు లేఖలు.. లేకపోతే ఇబ్బందులు

విజయవాడ పటమట సబ్‌ రిజిస్ట్రార్‌ పోస్టుకు రూ.2కోట్లు... తిరుపతి రూరల్‌ తహసీల్దార్‌ పోస్టుకు రూ.2కోట్లు... కర్నూలు ఆర్‌డీవో పోస్టుకు రూ.కోటి... శ్రీ సత్యసాయి జిల్లాలో సీఐ పోస్టుకు రూ.50లక్షలు... ఇలా డిమాండ్‌ను బట్టి ఉద్యోగుల బదిలీలకు కూటమి ప్రజాప్రతినిధులు రేటు ఫిక్స్‌ చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అడ్డగోలుగా దోచుకోవడంపైనే దృష్టి పెట్టిన కూటమి నేతలు ఏ చిన్న అవకాశాన్నీ వదలడం లేదు. చివరికి సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సిఫారసు చేసేందుకు కూడా రూ.లక్షన్నర వసూలు చేయా లని నిర్ణయించారు. తాము చెప్పినంత ఇస్తే నిబంధనలను సైతం పట్టించుకోకుండా జీరో సర్వీస్‌ బదిలీలు కూడా చేయిస్తామని భరోసా ఇస్తున్నారు. మామూళ్లు ఇవ్వనివారిని, తమకు నచ్చనివారిని మారుమూల ప్రాంతాలకు పంపిస్తున్నారు.

పంచాయతీరాజ్, రెవెన్యూ, మైనింగ్, రిజిస్ట్రేషన్ల శాఖల్లో జోరుగా పైరవీలు సచివాలయ ఉద్యోగుల బదిలీకి టీడీపీ నేతల సంతకం తప్పనిసరి కానిస్టేబుల్‌ పోస్టింగ్‌కు సైతం డబ్బులు డిమాండ్‌

సచివాలయ బదిలీకి రూ. లక్షన్నర
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీ కోసం స్థానిక టీడీపీ నాయకుడి సంతకం ఉండాలని చెబుతుండటంతో ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. ఆ పార్టీ నేతలు బదిలీ కోసం సంతకం పెట్టడానికి రూ.1.50 లక్షలు అడుగుతుండడంతో ఆ శాఖలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అసలే తీవ్ర అవమాన భారంతో సతమతమవుతున్న సచివాలయ ఉద్యోగులు తాజా పరిణామాలతో హతాశులవుతున్నారు.  

0 సర్వీస్‌
కృష్ణా జిల్లా పెనమలూరు ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్‌ అసిస్టెంట్‌కి పది రోజుల క్రితం ఏవోగా పదోన్నతి రావడంతో ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో పోస్టింగ్‌ ఇచ్చారు. తాజా బదిలీల్లో ఆయన్ను పెనమలూరు ఏవోగా నియమించాలని స్థానిక ఎమ్మెల్యే సిఫారసు లెటర్‌ ఇచ్చారు. పట్టుమని పది రోజుల సర్వీసు కూడా పూర్తి కాకుండానే ఆయన బదిలీకి దరఖాస్తు పెట్టుకోవడం,దాని ఆమోదానికి రంగం సిద్ధమవడం విశేషం.

రూ. లక్ష లక్ష
ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని బుట్టాయగూడెంలో ఎంపీడీవో, తహసీల్దార్‌ కార్యాలయాల్లో డిప్యూటీ తహసీల్దార్, సీనియర్‌ అసిస్టెంట్‌తోపాటు ఎంపీడీవో కార్యాలయంలో ఏ పోస్టుకైనా సిఫారసు లెటర్‌ కావాలంటే ముందు లక్ష రూపాయలు ఇవ్వాలని, ఆ తర్వాత మరో రూ.లక్ష ఇవ్వాలని బేరం పెట్టారు. నియోజకవర్గంలో ఏ పోస్టుకైనా కప్పం కడితేనే సిఫారసు లెటర్‌ ఇస్తామని చెబుతున్నారు.  

రూ. 10 లక్షలు
మైనింగ్‌ శాఖలో ఎన్టీఆర్‌ జిల్లా ఏడీ పోస్టుకి రూ.10 లక్షలు అడుగుతున్నట్లు సమాచారం. ఇందులో మంత్రి పేషీ, కార్యదర్శి 
పేషీల భాగస్వామ్యం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.  

రూ. 2 కోట్లు
విజయవాడలోని పటమట, విశాఖలోని మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ పోస్టుల కోసం ఉన్నత స్థాయిలో పైరవీలు జరుగుతున్నాయి. ఈ పోస్టుల రేటు రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు పలుకుతున్నట్లు రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రచారం జరుగుతోంది. 

రాష్ట్ర ప్రభుత్వం బదిలీలకు ఇచ్చిన గ్రీన్‌సిగ్నల్‌ పైరవీలకు రెడ్‌ కార్పెట్‌లా మారింది. నిబంధనలు, మార్గదర్శకాలను కాగితాలకే పరిమితం చేసి కాసులు, సిఫారసులతోనే బదిలీ వ్యవహారాలు నడిపిస్తున్నారు. ఆయా శాఖల అవసరాలు, పనితీరుతో సంబంధం లేకుండా కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన వారినే పరిగణనలోకి తీసుకుంటున్నారు. అధికార పార్టీ ప్రయోజనాల కోసమే ఈ బదిలీల ప్రక్రియ నిర్వహిస్తున్నట్టు స్పష్టమవుతోంది. 

ఎమ్మెల్యేలు చెప్పిన వారిని, కాసులిచ్చిన వారిని మంచి పోస్టుల్లో కూర్చోబెట్టడానికి మాత్రమే అనుమతిస్తున్నారు. తమకు ఇష్టం లేని వారిని, డబ్బులు ఇవ్వలేని వారిని పక్కన పెట్టేసి మారుమూల ప్రాంతాలు, ప్రాధాన్యత లేనిచోట్లకు పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదేళ్లు ఒకేచోట పని చేసిన వారిని కచ్చితంగా మార్చాలనే ప్రధాన నిబంధనను ఎక్కడా పట్టించుకోవడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. 

పాలనాపరమైన అవసరాలు, వ్యక్తిగత అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోవాలని బదిలీల ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇష్టానుసారం బదిలీలకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతల సిఫారసులుంటే జీరో సర్వీసు ఉన్నా బదిలీకి అనుమతిస్తుండటంపై ఉద్యోగ వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి.       
 – సాక్షి, అమరావతి

గగ్గోలు పెడుతున్న అన్ని శాఖల ఉద్యోగులు, అధికారులు  
ఉద్యోగుల బదిలీలను ఎమ్మెల్యేలు తమకు అన్ని విధాలా అనుకూలంగా మార్చుకుంటున్నారు. నియోజకవర్గ, మండల కేంద్రాల్లోని తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను తమ గుప్పెట్లో ఉంచుకునేలా ఈ బదిలీల పర్వాన్ని నిర్వహిస్తున్నారు. తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సర్వేయర్లు, సీనియర్, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులన్నింటిలోనూ తమకు అనుకూలమైన వారినే నియమించాలని అధికారులకు స్పష్టం చేస్తున్నారు. ఎంపీడీవో, ఆ కార్యాల­యంలోని ఉద్యోగులతోపాటు వ్యవసాయాధికారులుగా పలానా వారిని నియమించాలని సిఫారసు చేస్తూ ఎమ్మెల్యేలు లేఖలు ఇస్తున్నారు. 

పంచాయతీ కార్యదర్శులు, వీఆర్‌వో పోస్టులకు సైతం సిఫారసు లేఖలు ఇస్తున్నారు. వాటి ప్రకారమే ఆయా శాఖల ఉద్యోగులను బదిలీల జాబితాలో చేరుస్తున్నారు. లేఖలు ఇచ్చేందుకు ఎమ్మెల్యేల కార్యాలయాల్లో ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు నిర్ణయించారు. ఆ లెటర్లు తీసుకెళ్లి అధికారులకు ఇచ్చాక.. అక్కడా డబ్బు అడుగుతున్నారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బదిలీల వ్యవహారం అంతా డబ్బుమయంగా మారిపోయిందని వాపోతున్నారు.

డిమాండ్‌ను బట్టి రేటు పెంచేశారు!
తిరుపతి రూరల్‌ మండలం తహసీల్దార్‌ పోస్టుకు మంచి డిమాండ్‌ ఉండటంతో రేటు కూడా పెంచేసినట్లు తెలిసింది. ఇక్కడికి వచ్చేందుకు గతంలో చంద్రగిరి నియోజకవర్గంలో పనిచేసిన ఓ మహిళా తహసీల్దార్‌ పైరవీలు చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి అత్యంత సన్నిహితుల ద్వారా రూ.75 లక్షలు ఇచ్చేందుకు ఆమె సిద్ధపడినట్లు సమాచారం. ఇదే పోస్టుకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పనిచేస్తున్న మరో తహసీల్దార్‌ కోటి రూపాయలు ఇస్తానని ముందుకు రావడం... ఆ వెంటనే మరో తహసీల్దార్‌ ఏకంగా 1.25 కోట్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తంచేసినట్లు తెలిసింది. 

ఈ పోస్టుకు గిరాకీ ఎక్కువగా ఉందని టీడీపీ నేత అమాంతంగా ధరను పెంచేశారు. ఏకంగా రూ.2 కోట్లు ధర నిర్ణయించారు. దీంతో అప్పటి వరకు తిరుపతి రూరల్‌పై ఆశలుపెట్టుకున్న చాలామంది తహసీల్దార్లు మరో పోస్టింగ్‌ చూసుకున్నారు. అయితే చిత్తూరు ఆర్డీవో కార్యాలయంలో పని చేస్తున్న తహసీల్దార్‌ మాత్రం రూ.1.5కోట్లు చెల్లించి, మిగతా మొత్తం మూడు నెలల్లో ఇచ్చేలా ఒప్పందం చేసుకుని ఆ సీటు చేజిక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.  

‘రిక్వెస్ట్‌’ పేరుతో దోపిడీకి స్కెచ్‌
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ శాఖ ఉద్యోగులు, అధికారుల నుంచి దోపిడీకి రిక్వెస్ట్‌ బదిలీ పేరిట పక్కా ప్లాన్‌ రెడీ చేశారు. ‘ఉద్యోగులంతా తప్పనిసరిగా బదిలీ అభ్యర్థన (రిక్వెస్ట్‌) ఫారం పూర్తి చేసి డీఐజీలు, జిల్లా రిజిస్ట్రార్‌లకు పంపండి. సబ్‌ రిజిస్ట్రార్లు, సీనియర్‌ అసిసెంట్లు, కార్యాలయ సిబ్బంది ఇది పాటించి తీరాల్సిందే...’ 

అంటూ ఒక ఉన్నతాధికారి మౌఖిక ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది. ఈ మేరకు ఇప్పటికే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అరడజను రిక్వెస్ట్‌ ఫారాలు వాట్సాప్‌లో సదరు అధికారికి పంపినట్లు సమాచారం. ఇప్పటికే డిప్యూటేషన్ల పేరుతో రూ.లక్షలు వెనకేసుకున్న అధికారులు... ఈ రిక్వెస్ట్‌ బదిలీల పేరుతో మరోసారి రూ.కోట్ల వసూళ్లకు తెరతీశారు. కాకినాడ జిల్లా రిజిస్ట్రార్, కాకినాడ జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలోని రెండు సబ్‌ రిజిస్ట్రార్‌ పోస్టులకు ఒక్కోదానికి రూ.60 లక్షల నుంచి రూ.కోటి వరకు ధర నిర్ణయించినట్లు తెలిసింది. 

సర్పవరం, సామర్లకోట సబ్‌ రిజిస్ట్రార్‌ పోస్టులకు రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షలు, రాజమహేంద్రవరంలో రెండు సబ్‌ రిజిస్ట్రార్‌ పోస్టులకు రూ.60లక్షలు నుంచి రూ.80లక్షలు చొప్పున రేటు ఫిక్స్‌ చేశారని ప్రచారం జరుగుతోంది. రాజానగరం, పిడింగొయ్యి సబ్‌ రిజిస్ట్రార్‌ పోస్టులకు రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలు, అమలాపురంలో రెండు సబ్‌ రిజిస్ట్రార్‌ పోస్టులకు రూ.50 లక్షల నుంచి రూ.80 లక్షలు, ముమ్మిడివరం సబ్‌రిజిస్ట్రార్‌ పోస్టుకు రూ.30లక్షలు చొప్పున ధర నిర్ణయించినట్లు తెలిసింది. ఈ దందా అంతా విజయవాడ ప్రధాన కార్యాలయంలోని మార్కెట్‌ అండ్‌ ఆడిట్‌ విభాగంలో పనిచేస్తున్న రిజిస్ట్రార్‌ ఒకరు అధికార పార్టీ నేతల కనుసన్నల్లో నడిపిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

జిల్లా స్థాయి పోస్టులకు భారీ డిమాండ్‌  
మంత్రుల స్థాయిలో పైరవీలు
జిల్లా స్థాయిలో ఉండే పోస్టులు, వివిధ కార్యాలయాల్లో ఉండే కీలకమైన సీట్లకు 
విపరీతమైన డిమాండ్‌ నెలకొంది. వీటి కోసం మంత్రులు, వారి పేషీలు, 
ఉన్నతాధికారుల వరకు పైరవీలు జరుగుతున్నాయి.  

పేషీకి ఒక రేటు 
⇒ పంచాయతీరాజ్, మైనింగ్, రిజిస్ట్రేషన్లు, ఇరిగేషన్‌ తదితర శాఖల్లో పోస్టులకు రూ.లక్షల్లో బేరాలు జరుగుతున్నాయి. పంచాయతీరాజ్‌ శాఖలోని ఏఈ, డీఈ, ఈఈ పోస్టులకు సంబంధిత మంత్రి పేషీ నుంచి భారీ డబ్బు అడుగుతున్నట్టు తెలిసింది. మైనింగ్‌ శాఖలో డీడీ, ఏడీ, జియాలజిస్టు, సర్వే పోస్టులకు మంత్రి సిఫారసు లేఖ, ఆ తర్వాత సంబంధిత కార్యదర్శి పేషీ లోని కొందరు వ్యక్తులతో మాట్లాడుకుంటున్నారు. ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు, శ్రీకాకుళం, అనకాపల్లి వంటి జిల్లాల పోస్టులకు రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షలకుపైగా రేటు పెట్టారు. మంత్రి పేషీ వద్ద ఒక రేటు, ఆ తర్వాత కార్యదర్శి పేషీ వద్ద మరో రేటు.. ఈ రెండు ఓకే అయిన వారికే పోస్టింగ్‌ ఇచ్చే పరిస్థితి నెలకొంది.

ఈ పోస్టులకు ప్రభుత్వ స్థాయిలోనే బేరం
⇒ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా బదిలీలన్నీ ఐజీ అండ్‌ కమిషనర్‌ కార్యాలయంలోనే చేసేలా ప్రతి ఉద్యోగి నుంచి ఆప్షన్లు తీసుకోవడం ఆ శాఖలో కలకలం రేపింది. సబ్‌ రిజిస్ట్రార్‌ పోస్టులకు భారీగా బేరాలు జరుగుతున్నాయి. విజయవాడలోని పటమట, విశాఖలోని మధురవాడ, భోగాపురం, కొత్తవలస, రేణిగుంట, తిరుపతి, నెల్లూరు, నల్లపాడు వంటి 25కు పైగా అధిక ఆదాయం వచ్చే సబ్‌ రిజిస్ట్రార్‌ పోస్టులను ప్రభుత్వ స్థాయిలోనే బేరానికి పెట్టారనే చర్చ జరుగుతోంది.  

ఇరిగేషన్‌లోనూ తక్కువేం కాదు...
⇒ ఇరిగేషన్‌ శాఖలో ఏఈ, డీఈ, ఈఈ పోస్టులకు అదే తరహాలో పైరవీలు సాగుతున్నాయి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో పని చేసేందుకు ఈ క్యాడర్‌ అధికారులు ఎగబడుతున్నారు. అక్కడైతే బాగా బిల్లులు మంజూరయ్యే అవకాశం ఉండటంతో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆ పోస్టులకు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు.  

ప్రకాశంలో పెద్ద ఎత్తున వసూలు
⇒ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రకాశం జిల్లాలో సీఐలు, ఎస్‌ఐలు, తహసీల్దార్ల బదిలీలు జరిగాయి. పోలీసు శాఖలో కోరిన చోట పోస్టింగ్‌ కోసం టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున నగదు వసూలు చేసినట్లు సమాచారం.  

రూ.8లక్షలు తెస్తేనే లెటర్‌ 
⇒ పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్టులో ఈఈ పోస్టుకి రూ.8 లక్షలు డిమాండ్‌ చేస్తున్నారు. అంత డబ్బు ఇస్తేనే సిఫారసు లెటర్‌ ఇస్తామని పలువురికి సంబంధిత మంత్రి అనుయాయులు చెప్పినట్లు తెలిసింది.

పక్కాగా పైసా వసూల్‌
సీఐకి రూ.50లక్షలు.. కానిస్టేబుల్‌కు రూ.50వేలు!
⇒ శ్రీ సత్యసాయి జిల్లాలో సీఐ పోస్టింగుల కోసం రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు బేరం జరిగినట్లు తెలిసింది. గోరంట్ల, హిందూపురం వన్‌టౌన్, ధర్మవరం వన్‌టౌన్, హిందూపురం రూరల్, హిందూపురం రూరల్‌ అప్‌గ్రేడ్, ధర్మవరం రూరల్, ముదిగుబ్బ, కదిరి స్టేషన్లలో సీఐల పోస్టులకు సిఫారసు లేఖలు ఎక్కువ ధర పలికినట్లు తెలిసింది. ఎస్‌ఐ స్థాయిలో ఏడాదికి రూ.5 లక్షలు చొప్పున ఇచ్చేందుకు అంగీకరించిన వారికే కోరిన చోట పోస్టింగులు ఇచ్చారని సమాచారం. కానిస్టేబుల్‌ బదిలీలకు కూడా టీడీపీ నేతలు రూ.50వేలు చొప్పున డిమాండ్‌ చేస్తున్నారు. 

తహసీల్దార్‌కు రూ.50లక్షలు.. వీఆర్‌వోకు రూ.లక్ష
⇒ శ్రీ సత్యసాయి జిల్లాలో కొన్ని మండలాల తహసీల్దార్‌ పోస్టులు రూ.50లక్షలు పలికినట్లు సమాచారం. జిల్లాలో పెద్దగా డిమాండ్‌ లేని మండలాల్లో అయినా ఆటంకాలు లేకుండా పని చేసుకునేందుకు టీడీపీ నేతలు రూ.20 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. చిలమత్తూరు, కొత్తచెరువు, ధర్మవరం, హిందూపురం, పుట్టపర్తి, గోరంట్ల మండలాల పోస్టింగ్‌లకు అత్యధిక ధర పలికినట్లు ప్రచారం జరుగుతోంది. వీఆర్‌వోల బదిలీలకు కూడా రూ.లక్ష నుంచి బేరం ఆడుతున్నట్లు తెలిసింది. 

ముందు డబ్బులు ఇవ్వండి.. తర్వాత బదిలీ అవ్వండి
⇒ ఎక్సైజ్‌ శాఖలో ‘సెబ్‌’ త్వరలోనే రద్దు చేస్తున్నామని, మద్యం పాలసీ మారగానే బదిలీలు ఖాయమని శ్రీ సత్యసాయి జిల్లాలో టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఇప్పుడు రూ.10లక్షలు ఇస్తే రేపు నచ్చినచోట పోస్టింగ్‌ వేయిస్తామని ఎస్‌ఐ, సీఐల నుంచి వసూళ్లకు తెరతీశారు.   

గతి‘లేఖ’.. నేతల చుట్టూ...
⇒ కృష్ణా జిల్లాలో కీలకమైన రెవెన్యూ, మునిసిపల్,పంచాయతీరాజ్, మైనింగ్, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్, విద్యుత్‌ శాఖల్లో ఉద్యోగుల బదిలీలను సొమ్ము చేసుకునేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. తమ సిఫారసు లేకుండా బదిలీలు చేయవద్దని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో సిఫారసు లేఖల కోసం ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రుల చుట్టూ అధికారుల ప్రదక్షిణలు చేస్తున్నారు. గన్నవరం, పెనమలూరు, గుడివాడ, మచిలీపట్నం, నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు సిఫారసు లేఖలు ఇచ్చేందుకు రూ.లక్షలు డిమాండ్‌ చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది.  

ఆర్‌డీవో పోస్టుకు రూ.కోటి.. ముగ్గురు పోటీ!
⇒ కర్నూలు ఆర్‌డీవో పోస్టును టీడీపీ నాయకులు రూ.కోటికి బేరం పెట్టినట్లు తెలిసింది. ఈ పోస్టు కోసం ముగ్గురు అధికారులు పోటీ పడుతున్నట్లు సమాచారం. అయితే ఎవరికి ఎంత రేటుకు ఈ పోస్టు దక్కుతుందో ఒకటి, రెండు రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. 

విశాఖలో రూ.10లక్షలు–రూ.20లక్షలు
⇒ విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం, భీమిలి,పెందుర్తి మండలాల తహసీల్దార్ల పోస్టింగ్‌ కోసం స్థానిక ప్రజాప్రతినిధులు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం.  

రాష్ట్రంలోనే మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ ప్రత్యేకం
⇒ రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించి మధురవాడ సబ్‌ రిజి­స్ట్రార్‌ పోస్టుకు అధికార పార్టీ నేతలు రాష్ట్రంలోనే అత్యధిక ధర రూ.2కోట్ల వరకు నిర్ణయించినట్లు తెలిసింది. ఆనందపురం, పెందుర్తి, గాజువాక, విశాఖ జాయింట్‌–1 పోస్టింగ్‌లకు గిరాకీ ఎక్కువగా ఉంది. ఇక్కడ పోస్టింగ్‌ కోసం రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు టీడీపీ నేతలు రేటు ఫిక్స్‌ చేసినట్లు సమాచారం. అయినా కొందరు అధికారులు బదిలీల కోసం ప్రజాప్రతినిధులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.  

పోస్టింగ్‌లు ఇవ్వకముందే డబ్బులు వసూలు
⇒ అనకాపల్లి జిల్లాలో తహసీల్దార్ల బదిలీల ప్రక్రియ పూర్తయింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా పోస్టింగ్‌ ఇవ్వలేదు. బదిలీల ప్రక్రియలో అచ్యుతాపురం, రాంబిల్లి, పరవాడ, సబ్బవరం, అనకాపల్లి, పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్‌.రాయవరం మండలాల్లో పోస్టింగ్‌ల కోసం రూ.10లక్షలు చొప్పున, నర్సీపట్నం, చోడవరం మండలాల్లో రూ.5 లక్షలు చొప్పున కూటమి ప్రజాప్రతినిధులు వసూలు చేసినట్లు సమాచారం.   

సిఫారసు ఉంటేనీ సీఐ పోస్టింగ్‌
⇒ అనకాపల్లి జిల్లాలో సీఐల బదిలీల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యేల లెటర్‌ ఉంటేనే పోస్టింగ్‌ ఇస్తున్నారు. ఇందుకోసం స్థానిక ప్రజాప్రతినిధులు రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు తీసుకున్నట్లు సమాచారం. అనకాపల్లి జిల్లాలో సబ్బవరం, అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం, నక్కపల్లి, చోడవరం సబ్‌ రిజిస్ట్రార్ల పోస్టింగ్‌ల కోసం రూ.10లక్షల నుంచి రూ.15లక్షల వరకు డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement