![Minister Pawan is making MPPs worthless](/styles/webp/s3/article_images/2024/12/30/pk.jpg.webp?itok=65QGTP7Q)
ప్రజలు ఎన్నుకున్న ఎంపీపీలకు గౌరవం లేకుండా, చులకన చేసేలా కూటమి కుట్రలు
ఎంపీపీలను పక్కన పెట్టి అధికారుల ద్వారా నిర్ణయాలు.. మండల పరిషత్‌లపై అధికార పార్టీ ఎమ్మెల్యేల పెత్తనం
ఎంపీపీ, పాలక మండలికి కనీస సమాచారం లేకుండా పనులు
ఎంపీపీలను కనీసం వారి గదుల్లో కూర్చోనీయకుండా అవమానాలపాలు
గాలివీడు ఘటనకు కారణాలివే..
నగరిలో ఎంపీపీకి తెలియకుండా రూ.20 లక్షల పనులు మంజూరు
రాష్ట్రంలో దాదాపు అన్ని మండలాల్లో ఇవే వ్యవహారాలు
649 ఎంపీపీల్లో 639 చోట్ల వైఎస్సార్‌సీపీ గెలుపు.. అందుకే ఎంపీపీలకు విలువ లేకుండా చేస్తున్న ఆ శాఖ మంత్రి పవన్
6 నెలల్లో ప్రభుత్వ సిబ్బందిపై కూటమి నేతల దాడులెన్నో.. అయినా పరామర్శించని పవన్
వైఎస్సార్ జిల్లా ఘటనలోనే అత్యుత్సాహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న మండల ప్రజాపరిషత్‌లపై కూటమి ప్రభుత్వం క్షుద్ర రాజకీయాలు చేస్తోంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని ఎంపీపీలు వైఎస్సార్‌సీపీ చేతుల్లో ఉండటంతో అధికార పార్టీ కుట్రలకు పాల్పడుతోంది. ఎంపీడీవోలను అడ్డం పెట్టుకుని ఎంపీపీలను చులకన చేస్తోంది. పంచాయతీరాజ్ చట్టాన్ని పూర్తిగా తుంగలో తొక్కుతోంది.
ప్రజలు ఎన్నుకున్న ఎంపీపీలను పక్కన పెట్టి, వారికి కనీస సమాచారం లేకుండా, వారి ప్రమేయం లేకుండా ఎంపీడీవోల ద్వారా పనులు మంజూరు చేయించేస్తోంది. తద్వారా ఎంపీపీలను నామమాత్రంగా మార్చేయడానికి ప్రయత్నిస్తోంది. వారికి కనీస గౌరవం ఇవ్వకుండా, చివరకు వారి గదిలో కూర్చోనివ్వకుండా చేస్తోంది. అన్నమయ్య జిల్లా గాలివీడు వివాదానికి ఇవే కారణమని అధికారవర్గాలే చెబుతున్నాయి.
నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్‌నాయుడు స్థానిక ఎంపీడీవోపై ఒత్తిడి తెచ్చి ఎంపీపీకి సమాచారం లేకుండా, మండల పరిషత్ తీర్మానం చేయకుండా ఆ మండల పరిషత్ నుంచే రూ.20 లక్షలు పనులను మంజూరు చేయించుకోవడమూ ఇదే తోవలోది. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం. అయినా దాదాపు ప్రతి మండలంలో ఇదే తరహాలో వ్యవహారాలు జరుగుతున్నాయి.
వైఎస్సార్‌సీపీ పట్టును జీరి్ణంచుకోలేకే..
2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 649 మండలాల్లో 632 చోట్ల వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. వీటిలో ఎలాంటి పనులు మంజూరు చేయాలన్నా మండల పరిషత్ తీర్మానం అవసరం.
అయితే, మండలాల్లో వైఎస్సార్‌సీపీ పట్టును జీర్ణించుకోలేని కూటమి పార్టీ ఎమ్మెల్యేలు పలుచోట్ల ఎంపీడీవోలను అడ్డంపెట్టుకొని లేని అధికారాలను చెలాయించడానికి ప్రయత్నిస్తున్నారు. మండల పరిషత్ తీర్మానం లేకుండా అధికారుల ద్వారానే పనులు మంజూరు చేయించుకుంటూ ఎంపీపీలను ప్రజల్లో పూర్తిగా చులకన చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఎంపీపీలను అవమానపరిచేలా కార్యక్రమాలు
దాదాపు అన్ని మండలాల్లోనూ ఎంపీపీలను అవమానపరిచేలా కూటమి ఎమ్మెల్యేలు కార్యక్రమాలు చేపడుతున్నారు. మండల స్థాయిలో జరిగే సమావేశాలకు వైఎస్సార్‌సీపీ ఎంపీపీలను పిలవకుండా చేయడం, ఆ ఎంపీపీల చేతిలో ఓడిన టీడీపీ నేతల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించడం వంటి కుటిల రాజకీయాలు చేస్తున్నారు.
కొందరు ఎంపీపీలను వారి గదుల్లో కూర్చోనీయకుండా చేస్తున్నారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేల ప్రాపకం కోసం కొందరు ఎంపీడీవోలు స్థానిక ఎంపీపీలను అందరి ముందే చులకన చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఎంపీపీలు, ఎంపీడీవోల మధ్య ఘర్షణలకు దారి తీస్తున్నాయి.
మరింత రెచ్చగొడుతున్న పవన్..
మండల పరిషత్ కార్యకలాపాలు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఒక భాగం. ఆ శాఖకు పవన్‌కళ్యాణే మంత్రి. రాష్ట్ర ప్రభుత్వం తరహాలోనే మండల పరిషత్‌లకు కూడా మండల స్థాయిలో స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చాక మండల పరిషత్ అధికారాలను పూర్తిగా నిర్విర్యం చేసేలా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరాలు సాగుతున్నాయి.
తన శాఖలో జరుగుతున్న ఈ కుటిల రాజకీయాలను కట్టడి చేయాల్సిన పవన్.. వాటికి మరింత ఆజ్యం పోస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఆయన చర్యలు ఎంపీపీలకు విలువ లేకుండా చేస్తున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో శనివారం ఆయన పర్యటనే ఇందుకు ఉదాహరణ అని చెబుతున్నారు.
ఎంపీపీకి కనీసం విలువ ఇవ్వని నేపథ్యంలో గాలివీడు ఘటన జరిగిందని, అక్కడికి పవన్ వెళ్లడం ద్వారా ఎంపీపీలను మరింత చులకన చేశారని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంత మానవత్వం చూపుతున్న పవన్.. శనివారమే వైఎస్సార్ జిల్లాలోనే ఓ రైతు కుటుంబం అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడినా, ఆ వైపు ఎందుకు కన్నెత్తి చూడలేదని ప్రశి్నస్తున్నారు.
పట్టించుకోని పవన్
ఈ ఏడాది జూన్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు నుంచి రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ప్రభుత్వ సిబ్బందిపైన, వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలపైన భౌతిక దాడులు జరుగుతున్నాయి. అయినా పవన్ వేటినీ పట్టించుకోలేదు. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ కాకినాడ మెడికల్ కాలేజీలో దళిత డాక్టర్‌ను దూషిస్తూ దాడి చేసినా ఆ వైద్యుడిని పవన్ పరామర్శించలేదు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/13_26.png)
పిఠాపురంలో ఓ మైనర్‌పై కూటమి నాయకులే అత్యాచారం చేశారని ఆరోపణలొచ్చినా ఆ బాలికను పరామర్శించలేదు. నంద్యాల జిల్లా మచ్చుమర్రిలో మైనర్‌పై హత్యాచారానికి పాల్పడినా ఆయనకు పట్టలేదు. కానీ, ఎంపీడీవోను పరామర్శించే పేరిట రాజకీయ పర్యటన చేయడం వెనుక ప్రజల ద్వారా ఎన్నికైన ఎంపీపీలను చులకన చేయాలన్న ఆత్రుతే ఎక్కువగా ఉందని రాజకీయ విమర్శలు వస్తున్నాయి.
ప్రజలు ఎన్నుకొన్న ప్రజాప్రతినిధులంటే పవన్‌కు ఎప్పుడూ చులకనే అని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలోనూ పవన్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయినప్పటికీ, ప్రజల ద్వారా ఎన్నికైన అప్పటి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను గుడ్డలు ఊడతీసి కొడతానంటూ ప్రకటనలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు.
దేన్నీ ప్రశ్నించే బాధ్యత లేదా పవన్?
» విద్యుత్ చార్జీలు పెంచబోమని ఎన్నికల్లో హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత భారీగా పెంచారు. అయినా పవన్ కళ్యాణ్ ప్రశ్నించలేదు
» ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నా ప్రభుత్వం స్పందించడంలేదు.. దీనిపైనా పవన్ మాట్లాడటం లేదు..
» ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకపోవడంతో ఉచిత వైద్యం అందక పేదలు అల్లాడిపోతున్నారు.. అయినా పవన్ ప్రశ్నించడం లేదు
» రైతులకు రూ. 20 వేలు అన్నదాత సుఖీభవ కింద ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటినా ఆ ఊసే లేదు.. దీనిపైనా పవన్ మౌనం.ళీ ఈ–క్రాప్ సక్రమంగా చేయడంలేదు.. దీనినీ ప్రశ్నించడం లేదు
» ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైంది. మద్దతు ధర దక్కక రైతులు ధాన్యాన్ని అయినకాడికి తెగనమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.. అయినా పవన్‌కు నోరుపెగలదు.
ఇదో డ్రామా!
ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కలిసి పోటీ చేశారు. గెలిచారు. బాధ్యత తీసుకోవాల్సిన ఉప ముఖ్యమంత్రి పవన్.. ఆ బాధ్యత నుంచి తప్పుకుని, ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి డ్రామాలు చేస్తున్నారు. గాలివీడు మండలంలో పేరున్న నాయకుడు సుదర్శన్ రెడ్డి. న్యాయవాది, గతంలో ఎంపీపీగా పని చేశారు. ఓ ఎంపీపీకి జరుగుతున్న అవమానాలను ప్రశ్నించారు. దీనినీ రాజకీయాలకు వాడకునేందుకు పవన్ డ్రామాలాడటం విమర్శలకు తావిస్తోంది.
ఉద్యమానికి సిద్ధం
రాజ్యాంగంలోని 73, 74 సవరణల ద్వారా స్థానిక సంస్థల ప్రభుత్వాలకు సంక్రమించిన అధికారాల ప్రకారం.. గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌లకు కేటాయించిన లేదా వాటి సొంత నిధులను ఉపయోగించి ఆయా పంచాయతీ, మండల లేదా జిల్లా పరిషత్ ఆమోదం/తీర్మానం లేకుండా పనులు మంజూరు చేసే వీల్లేదు. అయితే ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ నెల 16న నగరి ఎంపీడీవో ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాలను ఉపసంహరించకుంటే ఉద్యమం తప్పదని రాష్ట్ర ఎంపీపీల సంఘం హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment