సాక్షి, అమరావతి: వివిధ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల మేరకు ఉద్యోగుల పరస్పర బదిలీలకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరస్పర బదిలీలకు వచ్చే ఏడాది జనవరి 4వ తేదీ వరకు ప్రభుత్వం అనుమతి ఇస్తూ సాధారణ బదిలీలపై ఉన్న నిషేధాన్ని పాక్షికంగా సడలించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్ తొలి, రెండో వేవ్ నేపథ్యంలో 2020 మే, 2021 మే నెలల్లో సాధారణ బదిలీలకు అనుమతించడం సాధ్యం కాలేదని, ఈ నేపథ్యంలో పలు ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల మేరకు పాక్షికంగా సడలింపు ఇస్తూ పరస్పర బదిలీలకు అనుమతిస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. తిరిగి జనవరి 5వ తేదీ నుంచి సాధారణ బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుంది.
రెండేళ్ల సర్వీసు పూర్తయిన వారికే..
ఉద్యోగులు పరస్పర బదిలీల నిమిత్తం సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. పరస్పర బదిలీలు కోరుకునే వారిద్దరూ ప్రస్తుతం పనిచేసే చోట రెండేళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలి. బదిలీలు అదే కేడర్ పోస్టులకు ఉండాలి. వారి బదిలీలను ప్రభుత్వ నియమ, నిబంధనలకు అనుగుణంగా మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఏసీబీ, విజిలెన్స్ కేసులు పెండింగ్‌లో ఉన్న ఉద్యోగులు పరస్పర బదిలీలకు అనర్హులు. పరస్పర బదిలీలను సంబంధిత శాఖలు, శాఖాధిపతులు పారదర్శకంగా, ఎటువంటి ఫిర్యాదులు, ఆరోపణలు, నిబంధనల ఉల్లంఘనలకు ఆస్కారం లేకుండా చేయాలి.
నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. ఈ ప్రక్రియ అమలు పర్యవేక్షణ బాధ్యతలను సంబంధిత శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు ప్రభుత్వం అప్పగించింది. పరస్పర బదిలీలన్నీ వారి విజ్ఞప్తి మేరకు చేస్తున్నందున ఎటువంటి టీటీఏ, ఇతర బదిలీ ప్రయోజనాలు వర్తించవు. కాగా, ప్రభుత్వం ఉద్యోగుల పరస్పర బదిలీలకు అవకాశం కల్పించడంపై ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక హర్షం వ్యక్తం చేసింది. సీఎంకు వేదిక గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
పరస్పర బదిలీలకు గ్రీన్‌సిగ్నల్
Published Tue, Dec 7 2021 4:10 AM | Last Updated on Tue, Dec 7 2021 12:46 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment