సాక్షి, అమరావతి: ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభించేందుకు జిల్లా, డివిజన్ స్థాయి కార్యాలయాల్లో పోస్టుల విభజన, ఉద్యోగుల ప్రొవిజనల్ కేటాయింపు కసరత్తు పూర్తయింది. నూతన రెవెన్యూ డివిజన్లలో పోస్టుల విభజన, ఉద్యోగుల కేటాయింపులను జనాభా ప్రాతిపదికన పూర్తి చేశారు. కొత్త జిల్లాలు, డివిజన్లకు సుమారు పది వేల మంది ఉద్యోగులు ప్రొవిజనల్ కేటాయింపుతో పాటు బదిలీలు కానున్నట్లు ఆర్ధిక శాఖ అంచనా వేసింది. ప్రొవిజనల్ కేటాయింపులో కొత్త జిల్లాలకు బదిలీ చేసే ఉద్యోగులు, అధికారుల సర్వీసు సీనియారిటీతో పాటు ఇతర సర్వీసు అంశాలన్నీ యథాతథంగా ఉంటాయి. కొత్త జిల్లాలు, డివిజన్లకు ప్రొవిజనల్ కేటాయింపులతో బదిలీ అయ్యే ఉద్యోగుల స్థానికత యథాతధంగా ఉంటుందని ఆర్ధిక శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.
సీనియారిటీ, పదోన్నతులపై ప్రభావం లేకుండా..
ఉదాహరణకు అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ రంగాల్లో 90 పోస్టులుంటే కొత్తగా ఏర్పాటవుతున్న సత్యసాయి జిల్లాకు జనాభా ప్రాతిపదికన ఆ పోస్టులను విభజిస్తారు. ఆ పోస్టుల విభజన మేరకు ఉద్యోగులను ప్రొవిజనల్‌గా కేటాయిస్తారు. కొత్త జిల్లాలు, డివిజన్లకు ఉద్యోగుల ప్రొవిజనల్ కేటాయింపుల కోసం ప్రస్తుత జిల్లాలు, డివిజన్లలో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి ఆప్షన్లను తీసుకున్నారు. ఒకే పోస్టుకు ఎక్కువ మంది ఆప్షన్లు ఇస్తే రివర్స్ విధానంలో జూనియర్లను బదిలీ చేస్తారు. కొత్త జిల్లాలు, డివిజన్లకు ప్రొవిజనల్ కేటాయింపుల్లో వెళ్లే ఉద్యోగుల సీనియారిటీ, పదోన్నతులపై ఎటువంటి ప్రభావం చూపదు. ప్రొవిజనల్ కేటాయింపుల్లో కొత్త జిల్లాలు, డివిజన్లకు బదిలీ అయ్యే ఉద్యోగులు, అధికారులకు బదిలీ ట్రావెలింగ్ అలవెన్స్ ఇవ్వాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. కొత్తజోనల్ వ్యవస్థపై రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ బదిలీలన్నీ తాత్కాలికంగా ప్రొవిజనల్‌గా పనిచేయడానికి మాత్రమేనని ఆర్ధిక శాఖ స్పష్టం చేసింది.
31న తుది నోటిఫికేషన్
కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటుకు ఈ నెల 31వ తేదీన తుది నోటిఫికేషన్ జారీ కానుంది. ఆ వెంటనే కొత్త జిల్లాలకు, డివిజన్లకు ప్రొవిజనల్‌గా ఉద్యోగులను బదిలీ చేస్తూ సంబంధిత శాఖలు ఉత్తర్వులు జారీ చేయనున్నాయి. ప్రస్తుతం 13 జిల్లాల్లో ఆసరా–సంక్షేమ జాయింట్ కలెక్టర్లుగా పనిచేస్తున్న వారిని కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలకు రెవెన్యూ ఆఫీసర్లు (డీఆర్‌వో)గా నియమించాలని నిర్ణయించారు. ప్రస్తుత జిల్లా వ్యవసాయ జాయింట్ డైరెక్టర్ లేదా డిప్యుటీ డైరెక్టర్‌ను కొత్త జిల్లాలకు కేటాయిస్తే వారిని జిల్లా వ్యవసాయ అధికారిగానే పరిగణించాలని స్పష్టం చేశారు. ప్రస్తుత జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ ప్రాజెక్టు డైరెక్టర్‌ను కొత్త జిల్లాకు కేటాయిస్తే జిల్లా మహిళా శిశు సంక్షేమ ఆఫీసర్‌గా పరిగణిస్తారు. కొత్త జిల్లాలకు బదిలీ అయ్యే ఉద్యోగులు, అధికారుల వివరాలను ఈ విధంగానే రూపొందించాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఉద్యోగి పేరు, గుర్తింపు నెంబర్, క్యాడర్, హోదా, ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాంతం, ప్రొవిజనల్‌గా కేటాయిస్తున్న జిల్లా పేరుతో జాబితాలను రూపొందించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment