కర్ణాటక: ఉద్యోగుల బదిలీల గురించి అధికార, విపక్షాల మధ్య వాగ్వివాదంతో మంగళవారం విధానసభ మార్మోగింది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉదయం విధానసభ ప్రారంభం కాగానే విజయపుర మహానగర పాలికె కమిషనర్ బదిలీపై బీజేపీ ఎమ్మెల్యేలు ధర్నాకు దిగడంతో స్పీకర్ ఖాదర్ కొద్దిసేపు సభను వాయిదా వేశారు. జీర్ అవర్‌లో బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాళ్ పాలికె కమిషనర్ బదిలీ విషయాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బదిలీలు సహజం.
ఐఏఎస్, కేఏఎస్ కేడర్ పోస్టులకు అదే కేడర్ అధికారిని నియమించాలి. కానీ విజయపుర మహానగర పాలికె కమిషనర్‌గా అర్హతలేని అధికారిని నియమించారు, వలయ కమిషనర్ కేడర్ కంటే తక్కువ హోదా ఉంది అని యత్నాళ్ దుయ్యబట్టారు. నగరాభివృద్ధి శాఖ మంత్రి బైరతి సురేశ్ మాట్లాడుతూ ఆ పోస్టుకు కేఏఎస్ అధికారినే నియమించామని, ఇందులో ఏ కులం అనేది చూడలేదని అన్నారు. యత్నాళ్ మాట్లాడుతూ తనను అణచివేయడానికి ప్రయత్నించిన అధికారిని నియమించారని, అర్హత కలిగిన అధికారిని కాదని ఆరోపించారు. ఉద్యోగుల బదిలీలతో వ్యాపారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
సీఎం అభ్యంతరం
యత్నాళ్ మాటలపై అభ్యంతరం తెలిపిన సీఎం సిద్దరామయ్య, వ్యాపారమని ఎందుకు చెబుతున్నారు, మేము వ్యాపారం చేస్తున్నామని చెప్పడానికి మీరు హరిశ్చంద్రులా? అనవసరంగా మాట్లాడకండి అని మండిపడ్డారు. దీనిపై జీరో అవర్‌లో చర్చకు అవకాశం లేదని సీఎం చెప్పడంతో బీజేపీ ఎమ్మెల్యేలు వాగ్వివాదం ప్రారంభించారు. వ్యాపారం చేస్తున్నారు అనే పదం తొలగించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవరాజరాయరెడ్డి స్పీకర్‌ను కోరారు. మాజీ సీఎం బసవరాజ బొమ్మై మాట్లాడుతూ యత్నాళ్ మాటలను సమర్థించడంతో అధికార– విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అరుపులతో సభలో గందరగోళం ఏర్పడింది. మంత్రి బైరతిసురేశ్ మాట్లాడుతూ మీ వద్దకు వ్యాపారం చేయడానికి అధికారిని పంపించాలా అని ప్రశ్నించడంతో బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
రికార్డుల నుంచి తొలగించాలి
డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పోస్టుకు రూ.2500 కోట్లు, మంత్రి పదవికి రూ.1000 కోట్లు అని యత్నాళ్ గతంలో బీజేపీపైనే ఆరోపణలు చేశారని ఎద్దేవా చేశారు. మా పార్టీ అయితే 24 గంటల్లో యత్నాళ్ ను బహిష్కరించేదన్నారు. దీనిపై యత్నాళ్ మాట్లాడుతూ తన వ్యాఖ్యలపై సీబీఐ తో దర్యాప్తు చేయించండని అన్నారు. బొమ్మై జోక్యం చేసుకుంటూ అధికారం ఉందని ఇష్టానుసారం చేయడం సరికాదని మంత్రిపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాట్లాడుతూ వ్యాపారం చేస్తున్నారు అనేది రికార్డులు నుంచి తొలగించాలని స్పీకర్‌ను మనవిచేశారు. మీరు లూటీ చేయడంతోనే ప్రజలు మిమ్మల్ని విపక్షంలో కూర్చోబెట్టారని దుయ్యబట్టారు. గొడవ చెలరేగడంతో స్పీకర్ పది నిమిషాల పాటు సభను వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment