
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీల్లో కదలిక వచ్చింది. హైకోర్టు తుది తీర్పునకు కట్టుబడి ఉంటామని సమ్మతిపత్రం అందజేసిన దరఖాస్తుదారుల పరస్పర బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు పరస్పర బదిలీలపై వెంటనే ఉత్తర్వులు జారీచేయాలని అన్ని ప్రభుత్వశాఖలను సాధారణ పరిపాలన శాఖ ఆదేశించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 2,558 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రయోజనం కలగనుందని అధికారులు వెల్లడించారు.
విద్య, హోంశాఖల నుంచి అధికసంఖ్యలో పరస్పర బదిలీల కోసం దరఖాస్తులొచ్చాయి. విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి సోమవారం ఉపాధ్యాయుల పరస్పర బదిలీలపై సమీక్ష నిర్వహించారు. మంత్రి ఆదేశాల మేరకు పరస్పర బదిలీలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వాకాటి కరుణ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మల్టీ జోనల్, జోనల్, జిల్లా క్యాడర్లకు పలువురు ఉపాధ్యాయుల పరస్పర బదిలీల జాబితాలను ఈ ఉత్తర్వుల్లో వెల్లడించారు.
బదిలీపై వెళ్లేవారికి కొత్త లోకల్ క్యాడర్‌లోని ప్రస్తుత రెగ్యులర్ చివరి ఉద్యోగి తర్వాతి ర్యాంక్‌ను కేటాయించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ బదిలీలకు టీఏ, డీఏ వర్తించదని తెలిపారు. ఇదిలా ఉండగా, పరస్పర బదిలీల్లో భాగంగా ఒక లోకల్ కేడర్ నుంచి మరో లోకల్ కేడర్‌కు వెళ్తే మొత్తం సీనియారిటీని కోల్పోవాల్సి ఉంటుందని గతంలో జారీ చేసిన జీవోలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. దీనిని సవాలు చేస్తూ అప్పట్లో కొందరు హైకోర్టులో కేసు వేయడంతో బదిలీల ప్రక్రియ ఆగిపోయింది.
ఈ అంశంపై తుదితీర్పునకు లోబడి తుదినిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణపత్రం జారీ చేయడంతో పరస్పర బదిలీలకు అనుమతిస్తూ ఇటీవల హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పరస్పర బదిలీలపై హైకోర్టు తుదితీర్పునకు కట్టుబడి ఉంటామని దరఖాస్తుదారుల నుంచి సమ్మతిపత్రాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment