ఎన్నికల్లో గెలిపించే అధికారులు కావాలి | Cm chandrababu fires on ministers | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో గెలిపించే అధికారులు కావాలి

Published Wed, Jun 22 2016 1:21 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

ఎన్నికల్లో గెలిపించే అధికారులు కావాలి - Sakshi

ఎన్నికల్లో గెలిపించే అధికారులు కావాలి

- మాది రాజకీయ పరిపాలన: చంద్రబాబు
- ఉద్యోగుల బదిలీలపై మంత్రులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్
- మాట వినని అధికారులను వెయిటింగ్‌లో పెట్టాలి
డీఎస్పీ, ఆర్డీవోల బదిలీలను నేనే చేస్తా
పారదర్శకత అంటూ నాకే ఫిలాసఫీ చెబుతారా?
మంత్రులపై ముఖ్యమంత్రి ఆగ్రహం
బదిలీల గడువు నేటి వరకు పొడిగింపు
 
 సాక్షి, విజయవాడ బ్యూరో/హైదరాబాద్:  ఉద్యోగుల సాధారణ బదిలీల విషయంలో స్వయంగా ప్రభుత్వమే పారదర్శతకు పాతరేసింది. పైరవీలకు తెరలేపింది. వాస్తవానికి బదిలీల గడువు సోమవారం అర్ధరాత్రి 12 గంటలతో ముగిసింది. కావాల్సిన వారిని కావాల్సిన చోట నియమించుకోవడానికి వీలుగా బదిలీల ప్రక్రియను ప్రభుత్వం బుధవారం వరకు పొడిగించింది. మరో మూడేళ్లలో జరిగే ఎన్నికల్లో గెలవాలంటే మాట వినే అధికారులను నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆదేశించడం గమనార్హం. ఉద్యోగుల బదిలీలు పూర్తి పారదర్శకంగా, పనితీరు ఆధారంగానే జరుగుతాయని, ఇందులో రాజకీయ జోక్యానికి తావులేదని ఇప్పటిదాకా చెప్పిన సీఎం హఠాత్తుగా మాట మార్చేశారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బదిలీలు చేపట్టాలని నిర్దేశించారు. ఇక అధికార పార్టీ నేతలు సిఫార్సు చేసిన వారికే పోస్టింగులు దక్కుతాయని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఇందులో భారీగా అవినీతి చోటుచేసుకోనుందని, కోట్ల రూపాయల సొమ్ము చేతులు మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 మా పార్టీకి విధేయులైన వారిని నియమించాలి
 ‘‘మాది రాజకీయ పరిపాలన.. మళ్లీ ఎన్నికల్లో గెలవాలంటే మా మాట వినే అధికారులను నియమించాలి. మాట వినని అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టాలి. జపాన్‌లో కేబినెట్ కార్యదర్శి కూడా అధికార పార్టీకి చెందిన వారే ఉంటారు. కీలకమైన డీఎస్పీ, ఆర్డీవోల బదిలీలు, నియామకాలకు సంబంధించిన ఫైళ్లను నాకే పంపించండి. నేను స్వయంగా చూసి ఆదేశాలు జారీ చేస్తా’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఉద్యోగుల సాధారణ బదిలీలపై ముఖ్యమంత్రి మంగళవారం కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులతోపాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఉద్యోగుల బదిలీల వ్యవహారాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని మంత్రులను చంద్రబాబు నిలదీశారు. బదిలీలు పారదర్శకంగా, పనితీరు ఆధారంగానే జరుగుతాయని చెప్పడం వల్ల తాము పట్టించుకోలేదని మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు అన్నారు. దీంతో ముఖ్యమంత్రి వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు ఫిలాసఫీ చెబుతున్నావా? పారదర్శకత అంటే రాజకీయంగా ఆలోచించవద్దా? అని అచ్చెన్నాయుడిని గద్దించారు. మరో మూడేళ్లలో ఎన్నికలు ఉన్నందున ఉద్యోగుల బదిలీల విషయంలో ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సూచించగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.  

 మంత్రులు, అధికారుల మధ్య సమన్వయం లేదు    
 ఉద్యోగుల బదిలీల విషయంలో మంత్రులు, ఉన్నతాధికారుల మధ్య సమన్వయం లేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు మంత్రులు భేషజాల(ఇగో)కు పోతున్నారని, బదిలీల వ్యవహారంలో సరిగా వ్యవహరించట్లేదని ఆగ్రహం వెలిబుచ్చారు. వ్యవసాయ శాఖలో బదిలీ ల వ్యవహారం ముందుకెళ్లకపోవడంపై సంబంధిత మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు క్లాసు తీసుకున్నారు. అధికారులను సమన్వయం చేసుకోలేనప్పుడు మిమ్మల్ని మంత్రిగా, మరొకరిని ఇన్‌చార్జిగా పెట్టి ఉపయోగం ఏముందని ప్రశ్నించారు. బదిలీల ప్రక్రియను ఇంతవరకూ చేపట్టని ఆరోగ్యశాఖ, మరో రెండు రోజులు గడువు అడుగుతున్న విద్యాశాఖ తక్షణం ఈ ప్రక్రియను చేపట్టి గడువులోగా పూర్తి చేయాలన్నారు. పరిపాలనలో ముఖ్య భూమికగా ఉండే ఉద్యోగ వ్యవస్థ నుంచి ఉత్తమ బృందాల్ని ఎంపిక చేయడానికే బదిలీల ప్రక్రియ చేపట్టామని సీఎం చెప్పారు.

 మంత్రి గంటాపై చంద్రబాబు రుసరుసలు
 సాక్షి, విశాఖపట్నం:  విద్యాశాఖలో బదిలీలు ఎందుకు జరగట్లేదు.. ఇంకెంత సమయం కావాలి? ఏడాది పొడవునా చేస్తారా? అంటూ సీఎం చంద్రబాబు మంత్రి గంటా శ్రీనివాసరావుపై రుసరుసలాడారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ కల్లాం మాట్లాడుతూ... బదిలీలు పూర్తి చేసేందుకు నీటి పారుదల, విద్యా శాఖలు గడువు కోరినట్టు చెప్పారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ‘‘ఖరీఫ్ ప్రారంభమైనందున ఆగస్టు వరకు వ్యవసాయ, నీటిపారుదల శాఖలకు మనమే గడువిచ్చాం. విద్యాశాఖకు ఎందుకు గడువు అడుగుతున్నారు? వేసవి సెలవుల్లోనే బదిలీలు పూర్తి చేసి విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే విధుల్లో చేరాలి కదా.. ఇప్పుడు గడువు కోరితే ఏడాది పొడవునా చేస్తారా?’’ అని ప్రశ్నించారు. మంత్రి గంటా బదులిస్తూ.. తమ ప్రిన్సిపల్ సెక్రటరీ 15 రోజులు సెలవుపై వెళ్లారని, అందువల్లే బదిలీలు చేపట్టలేకపోయామన్నారు. ‘‘నాకు సాకులు కాదు.. పని కావాలి’’ అని అసంతృప్తి వ్యక్తం చేయగా.. తాను వచ్చి వ్యక్తిగతంగా కలుస్తానని గంటా అన్నారు.
 
 గతంలో ఏ ముఖ్యమంత్రీ ఇలా మాట్లాడలేదు
 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బదిలీలు ఉండాలని, మాట వినే వారికే పోస్టింగ్ ఇవ్వాలని వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల పట్ల కలెక్టర్లు, ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా మాట్లాడలేదని వారు చెబుతున్నారు. ఇన్ని రోజులూ ఉద్యోగుల బదిలీల విషయంలో మంత్రుల జోక్యం అంతగా లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు ఇప్పుడు సీఎం చేసిన వ్యాఖ్యలతో కంగుతిన్నారు. కలెక్టర్లు కోరిన అధికారులను కీలక పోస్టుల్లో నియమించి, పరిపాలనలో సత్ఫలితాలు సాధించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ భావించారు. ఇందులో భాగంగా బదిలీల ఫైళ్ల ను మంత్రుల ఆమోదం కోసం సోమవారం పంపారు. అయినా మంత్రుల నుంచి ఆ ఫైళ్లు వెనక్కి రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement