ఓ మహిళకు సీక్రెట్ బుక్‌ను చూపిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు. చిత్రంలో దేవినేని
సాక్షి, అమరావతి: విద్యార్థులపై ఒత్తిడి ఎక్కు వవుతోందని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. వారిపై ఒత్తిడి పెంచొద్దని విద్యార్థుల తల్లితండ్రులకు సూచించారు. ఒత్తిడిని తట్టు కోలేక కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా రని, ఇది బాధాకరమని అన్నారు. ఒత్తిడి లేకుండా ఆహ్లాదకర వాతావరణంలో వారు చదివేలా చూడాలన్నారు. ఆత్మహత్యలు ఇకపై జరగకూడదన్నారు. అబ్దుల్‌కలాం జయంతిని పురస్కరించుకుని ఆదివారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ సభలో సీఎం మాట్లాడారు.
విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచాల్సి ఉందని, డబ్బుతోగాక ప్రతిభతో విద్యార్థులు చదివే పరిస్థితి రావాలని అన్నారు. రాబోయేకాలంలో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా పూర్తిగా చదివించే బాధ్యతను తామే తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతమిస్తున్న 6,500 ప్రతిభా పురస్కారాలకుతోడు మరో వెయ్యి పెంచుతామని, ఇందుకోసం మరో రూ.30 కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. పదో తరగతిలో మెరిట్ స్కాలర్‌షిప్ వచ్చినవారిని ఇంటర్, ఇంటర్‌లో మెరిట్ స్కాలర్‌షిప్ వస్తే వాళ్లు తర్వాత ఏ కోర్సులో చేరాలన్నా సహకరిస్తామని, బిట్స్ పిలానీ, ఐఐటీ, ఐఐఎం.. ఎక్కడైనా చదివించడానికి సిద్ధమేనన్నారు. డిగ్రీ నుంచి పీజీకి వెళ్లినా, విదేశాల్లో అయినా చదివిస్తామన్నారు.
పిల్లలకివ్వాల్సింది ఆస్తులు కాదు.. చదువూ సంస్కారం
పిల్లలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదని, చదువూ సంస్కారమని సీఎం అన్నారు. ప్రతిభా పురస్కారాల్లో బాలికలు ఎక్కువమంది ఉండడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో అమ్మాయిల్ని ఎదురుకట్నమిచ్చి పెళ్లి చేసుకునే పరిస్థితి వస్తుందన్నారు. గతంలో తాను సీఎంగా ఉన్నప్పుడు ఐటీకి ప్రాధాన్యమివ్వడం వల్ల లక్షలాదిమందికి లబ్ధి చేకూరిందన్నారు. ప్రపంచంలోని ఐటీ ఇంజనీర్లలో 25% తెలుగువాళ్లున్నారని, ఇందుకు తానేసిన బీజమే కారణమన్నారు.
త్వరలో అన్ని వర్సిటీల్లో తెలుగు భాషను తప్పనిసరి చేస్తామన్నారు. మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రతిభా పురస్కారానికి ఎంపికైన 6,500 మందికి రూ.20 వేల నగదు, ప్రశంసాపత్రం, మెడల్, ల్యాప్‌టాప్‌తోపాటు, లక్షలాదిమందికి స్ఫూర్తినిచ్చిన ‘సీక్రెట్’ బుక్ ఇస్తున్నామని తెలిపారు. సభలో 56 మంది విద్యార్థులకు సీఎం అవార్డులు బహూకరించారు. కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment