అక్టోబర్ టెన్‌షన్
- 10వ తేదీలోపు పూర్తి చేయాలని జీవో జారీ
- విధివిధానాలు మాత్రం మరిచారు
- ప్రజాప్రతినిధుల ప్రమేయంపై ఆందోళన
- చేతులు మారుతున్న నగదు
మచిలీపట్నం : జిల్లాలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బందిని ‘అక్టోబర్ టెన్’షన్ వెంటాడుతోంది. అక్టోబర్ పదో తేదీలోపు అన్ని శాఖల్లోనూ బదిలీల ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వం ఈ నెల ఐదో తేదీన జీవో విడుదల చేయడమే ఇందుకు కారణం. గడువు సమీపిస్తుండటం, కొన్ని శాఖల్లో బదిలీ అయ్యే వారి జాబితాలు సిద్ధం కావడంతో ఉద్యోగవర్గాల్లో రోజురోజుకూ ఉత్కంఠ పెరుగుతోంది.
ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం బిల్ కలెక్టర్ నుంచి కలెక్టర్ స్థాయి అధికారి వరకు బదిలీ చేసే అవకాశం ఉంది. అయితే, బదిలీల ప్రక్రియ ఎలా ఉండాలనే విషయమై కేడర్లు, శాఖలవారీగా విధివిధానాలను మాత్రం పూర్తిస్థాయిలో ప్రభుత్వం ప్రకటించలేదు. కేవలం వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి కన్నా తక్కువ కేడర్ ఉన్న గుమాస్తాలు, బిల్ కలెక్టర్లు, అటెండర్లు తదితర ఉద్యోగులను మాత్రం కౌన్సెలింగ్ ద్వారా బదిలీ చేయాలని నిర్ణయిం చింది.
ఐదేళ్లకు పైగా ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని ఆదేశించింది. మూడు సంవత్సరాలుగా ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న వారిలోనూ 20 శాతం మందిని బదిలీ చేయాలని నిర్ణయించింది. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేల ఇష్టానుసారంగానే బదిలీలు జరుగుతాయని ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. ఏడాది మధ్యలో బదిలీ అయితే ఇబ్బందులు ఉంటాయని, అందువల్ల తమ స్థానాలను కాపాడుకునేందుకు కొందరు అధికారులు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు.
ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉద్యోగులు
బదిలీలపై జోరుగా ప్రచారం జరుగుతుండటంతో ఉద్యోగులు తమ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. కొందరు మధ్యవర్తులు, యూనియన్ నాయకులు.. ఉద్యోగులకు, ఉన్నతాధికారులకు మధ్య వారధిగా వ్యవహరిస్తూ డబ్బు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖతోపాటు మరికొన్ని శాఖల్లో బదిలీ అయ్యే ఉద్యోగుల జాబితాలను తయారు చేసి కలెక్టర్ అనుమతి కోసం పంపేందుకు సిద్ధం చేసినట్లు సమాచారం. మరోవైపు ప్రభుత్వం అక్టోబర్ నెలాఖరు వరకు పలు కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించడంతో బదిలీల ప్రక్రియకు బ్రేక్ పడే అవకాశం ఉందని కొందరు ఉద్యోగులు భావిస్తున్నారు.
ఉపాధ్యాయులకు బదిలీలు లేనట్టే!
ఉపాధ్యాయులకు కూడా బదిలీలు ఉంటాయని ఇటీవల వరకు ప్రచారం జరిగింది. రెండు రోజల క్రితం ఉపాధ్యాయల సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించిన మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు టీచర్ల బదిలీలు వేసవిలోనే ఉంటాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల 26 నుంచి అక్టోబరు 1వ తేదీ వరకు గ్రామాల్లో శానిటేషన్ డ్రైవ్‌ను నిర్వహించనుంది. అక్టోబరు 2వ తేదీ నుంచి జన్మభూమి గ్రామసభలు నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగులను బదిలీ చేసి కొత్తవారితో గ్రామసభలు నిర్వహిస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మరికొందరు మాత్రం ఉద్యోగులు కేవలం ప్రభుత్వ పథకాలను ప్రకటిస్తారని, వాటిని అమలు చేసేందుకు నగదు ఖర్చు చేయటం లేదని, కాబట్టి బదిలీలకు అవేమీ అడ్డు కాదని వాదిస్తున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా కొన్ని శాఖల్లో బదిలీల ఫైళ్లు తయారుకావడం.. ఉద్యోగులు తమ ఉన్నతాధికారులను కలవడం.. యూనియన్ నేతలు జోక్యం చేసుకోవడం.. నగదు చేతులు మారడం.. చకచకా జరిగిపోతున్నట్లు తెలుస్తోంది.