పంచాయతీలకు పైసల్లేవ్! | GPs minor nagging problem of funding | Sakshi
Sakshi News home page

పంచాయతీలకు పైసల్లేవ్!

Published Thu, Sep 11 2014 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 1:10 PM

పంచాయతీలకు పైసల్లేవ్!

పంచాయతీలకు పైసల్లేవ్!

  • మైనర్ పంచాయతీలను వేధిస్తున్న నిధుల సమస్య
  •  పారిశుద్ధ్య పనులకూ డబ్బుల్లేవు
  •  విజృంభిస్తున్న దోమలు
  •  అల్లాడుతున్న జనం   
  •  పట్టించుకోని ప్రభుత్వం
  • మచిలీపట్నం/నూజివీడు : నిధుల కొరత వల్ల జిల్లాలోని మైనర్ పంచాయతీల్లో అనేక సమస్యలు తిష్టవేశాయి. ఏ పని చేయాలన్నా పైసా డబ్బుల్లేవని సర్పంచిలు వాపోతున్నారు. కనీసం పన్నులు వసూలు చేసినా, కొన్ని సమస్యలు తీరే అవకాశం ఉంది. కానీ, కార్యదర్శులపై పని ఒత్తిడి వల్ల వారు పన్నుల వసూలుపై దృష్టి పెట్టలేకపోతున్నారు.

    మరోవైపు ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహక నగదు అందించినా, ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం  ఉంది. ఈ నిధుల విడుదలకు కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో గ్రామాల్లో మౌలిక సదుపాయల కల్పన కలగానే మిగులుతోంది. సమస్యలు రాజ్యమేలుతున్నాయి. పలు గ్రామాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా మారడంతో దోమలు పెరిగి ప్రజలు జ్వరాల బారినపడుతున్నారు.
     
    మూడేళ్లుగా నిధులు నిల్..!

    జిల్లాలో ప్రస్తుతం 970 పంచాయతీలు ఉన్నాయి. వాటిలో 820 మైనర్ పంచాయతీలే. స్థానికంగా వసూలు చేసే పన్నులతోపాటు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్(ఎస్‌ఎఫ్‌సీ), వృత్తి పన్ను, సీనరేజీ, భూముల క్రయ, విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం,కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే తలసరి ఆదాయం పంచాయతీల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది.

    ఈ ఏడాదికి సంబంధించి ఎస్‌ఎఫ్‌సీ, వృత్తి పన్నులను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేయలేదు. సుమారు 13వేల మంది జనాభా ఉన్న పంచాయతీకి ఏడాదికి తలసరి ఆదాయం కింద రూ.80వేలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయాల్సి ఉండగా, మూడేళ్లుగా ఆ నిధులు కూడా రావడంలేదు. ఈ ఏడాది కాలంలో కేవలం 13వ ఆర్థిక సంఘం నిధులు మాత్రమే వచ్చాయని, వాటిని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఖర్చు చేయాల్సి ఉండటంతో అత్యవసర పనులు చేపట్టలేకపోతున్నామని పలువురు సర్పంచిలు తెలిపారు.
     
    విద్యుత్ బిల్లుల చెల్లింపునకు మంగళం

    మైనర్ పంచాయతీల్లో వీధి దీపాల నిర్వహణకు సంబంధించిన విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మేజర్ పంచాయతీలకు కూడా విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. వైఎస్ మరణానంతరం ఈ విధానానికి పాలకులు మంగళం పాడారు. ఒక్కో మేజర్ పంచాయతీ ఏడాదికి రూ.10 లక్షల వరకు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి రావడంతో వచ్చిన ఆదాయంలో సగభాగం దానికే సరిపోతోంది. దీంతో నిధుల లేమి కారణంగా మేజర్ పంచాయతీల్లోనూ కనీస వసతులు కల్పించలేని దుస్థితి నెలకొంది.
     
    ప్రభుత్వ కార్యక్రమాలతో అదనపు భారం

    పంచాయతీలకు అరకొరగా వస్తున్న ఆదాయం వీధి లైట్ల కొనుగోలు, గుమస్తాల జీతభత్యాలకు సరిపోవడంలేదు. ఈ పరిస్థితుల్లో ఇటీవల ప్రభుత్వం ఏదో ఒక పేరుతో వారోత్సవాలు, పొలం పిలుస్తోంది.. బడిపిలుస్తోంది.. తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుండటంతో వాటికి సంబంధించి గ్రామ సభలు నిర్వహించేదుకు సైతం పంచాయతీల వద్ద నిధులు లేక ఇబ్బందులు పడుతున్నారు.
     
    సమస్యల మేట

    పంచాయతీలకు ఆదాయం లేకపోవడంతోపాటు ప్రభుత్వం నుంచి గ్రాంట్లు సకాలంలో మంజూరు కావడంలేదు. దీంతో డ్రెయినేజీలకు కనీస మరమ్మతులు చేయించేందుకు, దోమల నివారణకు మందుల పిచికారీ చేసేందుకు కూడా దిక్కులు చూడాల్సిన దుస్థితి నెలకొంది. కొద్దిపాటి వర్షాలకే కొన్ని ప్రాంతాల్లో మురుగు సమస్య తలెత్తింది. ముసునూరు మండలంలోని చక్కపల్లి, కొర్లగుంట పంచాయతీలలో సైడు కాలువల్లో మురుగునీరు ముందుకు కదలడం లేదు. తీవ్ర దుర్వాసన వస్తోందని, పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. నూజివీడు మండలం గొల్లపల్లి, మీర్జాపురం, అన్నవరం, తుక్కులూరు, పడమర దిగవల్లి, వెంకటాయపాలెంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
     
    ఆగిరిపల్లి మండలంలో చొప్పరమెట్ల, నర్శింగపాలెం, చిన్నాగిరిపల్లి, కొత్త ఈదర, నెక్కలం గొల్లగూడెం, సూరవరం ప్రాంతాల్లో డ్రెయినేజీలకు కనీస మరమ్మతుల చేసిన దాఖలాలు లేవు. విస్సన్నపేట మండలంలోని పుట్రేల, తెల్లదేవరపల్లి, రెడ్డిగూడెం మండలంలోని కూనపరాజుపర్వ, ముచ్చనపల్లి, పాతనాగులూరు, రంగాపురం పంచాయతీల్లోనూ రోడ్లు, సైడు కాలువలు అధ్వానంగా ఉన్నాయి. మైలవరం మండలం చంద్రాల, తోలుకోడు, కీర్తిరాయునిగూడెం, ఎ.కొండూరు మండలం తూర్పు మాధవరం, రేపూడి, మచిలీపట్నం మండలంలో ఎస్‌ఎన్ గొల్లపాలెం, చిన్నాపురం, వాడపాలెం తదితర గ్రామాలలోని సైడు కాలువల్లో పూడిక తొలగించకపోవడంతో ఎక్కడి మురుగునీరు అక్కడే నిలిచిపోతోంది.

    దీంతో దోమల బెడదతో ప్రజలు పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఇబ్బందుల పాలవుతున్నారు. ఇప్పటికే నందిగామ, గూడూరు, బంటుమిల్లి మండలాల్లో జ్వరాలు ప్రబలాయి. ఈ పరిస్థితి జిల్లా అంతటా వ్యాపించక ముందే పంచాయతీలకు నిధులు మంజూరు చేసి పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు, ఇతర సదుపాయాలు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
     
    ఏకగ్రీవ పంచాయతీలకు అందని ప్రోత్సాహకాలు

    జిల్లాలో ఏడాది క్రితం జరిగిన ఎన్నికల సమయంలో 119 పంచాయతీ పాలకవర్గాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఏకగ్రీవమైన  ఒక్కో పంచాయతీకి ప్రోత్సాహకంగా రూ.5లక్షలు మంజూరు చేయనున్నట్లు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ప్రభుత్వం మారింది. రాష్ర్టం విడిపోయింది. ఈ తరుణంలో గతంలో ప్రకటించిన విధంగా ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ప్రోత్సాహక నగదు అందిస్తుందా.. లేదా.. అనే విషయంపై స్పష్టత కొరవడింది.
     
    పన్నుల వసూలుపై దృష్టి పెట్టని కార్యదర్శులు  

    జిల్లాలో 970 పంచాయతీల నుంచి ఈ ఏడాది రూ.41.09 కోట్లను వన్నుల రూపంలో వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు రూ.18.26 కోట్లు మాత్రమే వసూలు చేశారు. మూడు, నాలుగు పంచాయతీల బాధ్యతలు చూడాల్సి ఉండటంతో పన్నుల వసూలుపై దృష్టి సారించలేకపోతున్నామని కార్యదర్శులు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వంద రోజుల కార్యక్రమానికి సంబంధించి రోజూ వివిధ ఫార్మాట్లలో నివేదికలు పంపడానికే సమయం సరిపోవడం లేదని, ఇతర పనులపై ఎలా దృష్టి పెట్టగలని పలువురు పేర్కొంటున్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement