సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
– కరువు తాండవిస్తున్నా నివారణ చర్యలు శూన్యం
– సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట మహాధర్నా
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.షడ్రక్, జిల్లా కార్యదర్శి కె.ప్రభాకరరెడ్డి విమర్శించారు. ప్రజాపోరు యాత్ర ముగింపును పురస్కరించుకొని శనివారం కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. అంతకు ముందు సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో పాతబస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో కరువు తాండవిస్తున్నా నివారణ చర్యలను చేపట్టడంలో జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. పింఛన్ల కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతువులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆరోపించారు.
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాను పరిశ్రమల హబ్‌గా మారుస్తామని గొప్పులు చెబుతున్నారని.. ఆచరణలో ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదన్నారు. పేదలకు రెండు సెంట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వమని అడిగితే సవాలక్ష ప్రశ్నలు వేస్తున్నారని, పెట్టుబడిదారుల కోసం వేలాది ఎకరాలను కట్టబెట్టడం దారుణమన్నారు. పెద్ద నోట్ల రోద్దుతో ప్రజల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావన్నారు. సీపీఎం నగర కార్యదర్శి గౌస్‌దేశాయ్ మాట్లాడుతూ..కర్నూలు నగరంలో అండర్ డ్రెయినేజీలు, అదనపు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నిర్మించడంలో అధికార పార్టీ నేతలు విఫలమయ్యారన్నారు. జగన్నాథగట్టులో మౌలిక వసతులు కల్పించాలని, మూడో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లులు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నగర నాయకులు పుల్లారెడ్డి, రాముడు, ఎండీ అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.