రైతుల ఉసురు తగులుతుంది
► మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్
► మన్నెంపల్లిలో ఎండిన పంటల పరిశీలన
అల్గునూర్: రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ అన్నారు. గురువారం తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లిలోని ఎండిన మొక్కజొన్న, వరి పంటలను పరిశీలించిన సందర్భంగా మాట్లాడారు. ప్రభుత్వం, ప్రభుత్వాధికారుల సూచనతో రైతులు ఎకరాకు రూ.800 బీమా చెల్లించినా నష్టపోయిన రైతులకు ఒక్క రూపాయి కూడా పరిహారం అందలేదన్నారు.
యాసంగిలో ఒక్క ఎకరం కూడా ఎండిపోనివ్వమని చెప్పిన ప్రభుత్వం ఒక్క మన్నెంపల్లిలోనే 200 ఎకరాల వరిపంట ఎండిపోయిందన్నారు. కేంద్రం మంజూరు చేసిన ఇన్‌పుట్ సబ్సిడీ కూడా చెల్లించకపోవడంతో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. సింగిల్‌విండో మాజీ చైర్మ¯ŒS సుధగోని లక్ష్మీనారాయణ, సింగిల్‌విండో డైరెక్టర్లు మేడి అంజయ్య, బుర్ర కనకయ్య, ఎడ్ల తిరుపతిరెడ్డి, నాయకులు శ్రీనివాస్, జలపతి, దుర్గయ్య, నర్సింహస్వామి, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
నీరు విడుదల చేసి రైతులను ఆదుకోండి
ఎండిపోతున్న వరిపంటలను కాపాడేందుకు మానేరు డ్యామ్ నుంచి ఎల్‌ఎండీ కాల్వకు నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, టీపీసీసీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ నీరు లేక పంటలు ఎండుతున్నాయన్నారు. చేతికొచ్చే సమయంలో పంట ఎండిపోతుంటే రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పరిధిలోని అనేక మండలాల్లో పంటలు చివరి దశకు వచ్చాయన్నారు. కలెక్టర్ జోక్యం చేసుకొని నీటి విడుదలకు చర్యలు చేపట్టాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు ఆకుల ప్రకాశ్, ఒంటెల రత్నాకర్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు ఉప్పరి రవి, శ్రీనివాస్, కటుకం వెంకటరమణ, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.