అవి సర్కారు హత్యలే
- చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఆకలి చావులపై సీపీఐ నేత నారాయణ
- ఇందిరా పార్కు వద్ద చేనేత అఖిలపక్ష వేదిక ఆధ్వర్యంలో ధర్నా
- వెంటనే చేనేత విధానాన్ని ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్
హైదరాబాద్: చేనేత కార్మికుల ఆత్మ హత్యలు, ఆకలి చావులు సర్కారు హత్య లేనని, వారిపై కేసులు నమోదు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు నారాయణ డిమాండ్ చేశారు. చేనేత విధా నం ప్రకటించాలని కోరుతూ తెలంగాణ చేనేత అఖిలపక్ష వేదిక ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్కు వద్ద చేనేత కార్మి కులు ధర్నా నిర్వహించారు. ఈ సంద ర్భంగా చేనేత కార్మికులు ధర్నా శిబిరం వద్ద మగ్గాలపై వస్త్రాలు నేస్తూ, మహిళలు రాట్నాలపై పనిచేస్తూ నిరసన తెలిపారు. ధర్నాను ఉద్దేశించి నారాయణ మాట్లా డుతూ.. పాలకులు దేవుళ్లకు పట్టువస్త్రాలు సమర్పించి భక్తిని చాటుకుంటారే తప్ప.. వాటిని నేసే చేనేత కార్మికులపై మాత్రం వారికి భక్తి ఉండదని అన్నారు. తిరుపతి వెంకన్న, బెజవాడ అమ్మ వారికి రూ.కోట్ల ఆభరణాలు సమర్పించాలనుకునే కేసీఆర్.. ఆ డబ్బును చేనేత కార్మికులకు ఇస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. అన్ని రంగాలకు బడ్జెట్‌లో నిధులుంటాయి కానీ.. చేనేతకు మాత్రం నిధుల కేటాయింపు ఉండదని, చేనేతకు సహాయం అనేది వృత్తికి సంబంధించినది కాదని, అది ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. చేనేత సమస్యల పరిష్కారానికి కలసికట్టుగా పోరాటం చేయాలని, ఇందుకు సీపీఐ పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే చేనేత కార్మికులను ఆదుకునేలా ప్రభుత్వం హామీ ఇవ్వాలని, సమగ్రమైన చేనేత విధానాన్ని ప్రకటించాలని, సమస్యల పరిష్కారం కోసం చేనేత కార్మిక సహకార సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ చేనేత కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. సీపీఎం నాయకుడు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ గిట్టుబాటు కూలీ లభించక అనేక మంది చేనేత కార్మికులు వలస పోతున్నారని వాపోయారు. కాంగ్రెస్ నేత మల్లు రవి మాట్లాడుతూ మనిషికి నాగరికత నేర్పిన చేనేత కార్మికులు ప్రస్తుతం సమస్యల పరిష్కారం కోసం రోడ్డు ఎక్కాల్సి రావడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్, సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ, తెలంగాణ చేనేత అఖిలపక్ష వేదిక నాయకులు ధనుంజయ, గడ్డం జగన్నాథం, సిల్వేరు కాశీనాథ్, గోశిక యాదగిరి, పాశికంటి లక్ష్మీనర్సయ్య, వెంకటేష్, కూరపాటి రమేష్, గర్ధాసు బాలయ్య, సత్యనారాయణ, రాంచంద్రం, నరేందర్, కాశీనాథం తదితరులు పాల్గొన్నారు.