రాష్ట్ర మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న నాయకులు శ్రీనివాసరావు, శివారెడ్డి, ఉల్లి కృష్ణ తదితరులు
మచిలీపట్నంటౌన్: ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరిస్తూనే.. మరికొన్ని డిమాండ్లను కూడా నెరవేర్చేందుకు సీఎం జగన్ సానుకూలంగా స్పందిస్తున్నారని ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, కె.వి.శివారెడ్డి చెప్పారు. ఆదివారం విజయవాడలో వారు.. ఉద్యోగులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి అంచెలంచెలుగా పరిష్కరిస్తున్నారని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజేషన్‌పై త్వరలోనే జీవో రాబోతోందన్నారు.
సీఎం జగన్.. ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవటం అభినందనీయమన్నారు. ఉద్యోగులపై సీఎం జగన్ ప్రేమాభిమానాలు చూపుతున్నారనే దానికి ఇది ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. 33 ఏళ్లుగా కార్పొరేషన్ కింద ఉన్న ఏపీ వైద్య విధాన పరిషత్ ఉద్యోగులను సీఎం జగన్ 010 పరిధిలోకి తెచ్చారని వివరించారు. ఈ ఉద్యోగులు గతంలో ఎప్పుడు జీతం పడుతుందో తెలియక ఇబ్బందులు పడేవారని.. ఇప్పుడు ప్రతి నెలా 1వ తేదీనే జీతం అందుకుంటున్నారని చెప్పారు. సీపీఎస్ కాకుండా జీపీఎస్ ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని.. ఇది కూడా ఉపయోగకరమేనన్నారు.
71 డిమాండ్లను ప్రభుత్వానికి నివేదించగా.. 65 డిమాండ్లపై సానుకూలంగా స్పందించారని.. మిగిలిన వాటిని కూడా సీఎం జగన్ పరిష్కరిస్తారనే ఆశాభావం తమకు ఉందన్నారు. ఆగస్ట్ 21, 22 తేదీల్లో ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే సంఘం మహాసభలను జయప్రదం చేయాలని ఉద్యోగులను కోరారు. ఈ సభలకు సీఎం జగన్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు కూడా హాజరవుతున్నారన్నారు. సమావేశంలో ఏపీఎన్జీవో సంఘం నాయకులు ఉల్లి కృష్ణ, ఎ.వెంకటేశ్వరరావు, దారపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment