దొంగ పట్టాలపై విచారణ జరపాలి
సీపీఐ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ రిజర్వాయర్ పరిధిలో దొంగ పట్టాల వ్యవహారంపై సీనియర్ ఐఏఎస్ అధికారితో విచారణ జరిపించి దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. భూమి ఇచ్చేందుకు కొన్ని గ్రామా ల్లో రైతులు ఎదురు తిరగడంతో దొంగ సర్టిఫికెట్ల వ్యవహారం చోటు చేసుకుందని అన్నారు.ప్రభుత్వ తొందరపాటు, దుందుడుకు ఆలోచనలే ఇటువంటి అక్రమాలకు ప్రధాన కారణమన్నారు.
ఈ రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.5 టీఎంసీల నుంచి 50 టీఎంసీలకు పెంచడమే ప్రధాన వివాదాం శమన్నారు. దాదాపు 23వేల ఎకరాలను ప్రభుత్వం తీసుకోవడంతో అక్కడి ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉద్యమరూపు దాల్చిందన్నారు. అధికారపార్టీ ప్రజాప్రతి నిధులు, అధికార యంత్రాంగం కుమ్మక్కై విభజించు–పాలించు విధానాన్ని అమలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.