మల్లన్నసాగర్ వ్యవహారంలో ప్రజలను ప్రభుత్వం విభజించి పాలిస్తోందని సీనియర్ న్యాయవాది వేదుల వెం కటరమణ ఆరోపించారు.
- అధిక పరిహారం పేరుతో ప్రలోభపెడుతోంది
- మల్లన్నసాగర్ కేసులో హైకోర్టులో వాదనలు
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ వ్యవహారంలో ప్రజలను ప్రభుత్వం విభజించి పాలిస్తోందని సీనియర్ న్యాయవాది వేదుల వెం కటరమణ ఆరోపించారు. ఈ ప్రాజెక్టు కోసం జీవో 123 ద్వారా భూముల కొనుగోలును సవాలు చేస్తూ భూ యజమానులు, వాటిపై ఆధారపడ్డ వ్యవసాయ కూలీలు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావుల ధర్మాసనం బుధవారం విచారించింది. పిటిషనర్లలో కొందరి తరఫున వెంకటరమణ వాదనలు వినిపించారు. ‘‘ప్రజలను ప్రభుత్వం రెండు వర్గాలుగా విభజించి ఒక్కొక్కరి పట్ల ఒక్కోలా వ్యవహరిస్తోంది.
భూములమ్మేందుకు ముందుకొచ్చిన వారిపట్ల ఒకలా, భూ సేకరణ చట్టం కింద పరిహారం తీసుకునే వారిపట్ల మరోలా వ్యవహరిస్తోంది. పైగా భూములమ్మేవారికి ఎక్కువ పరిహారం ఇస్తామంటూ ఆశ చూపుతోంది. ఇది ప్రలోభపెట్టడం కిందకు వస్తుంది. ఈ భూముల కొనుగోలు వల్ల భూ యజమానులకు నష్టమేమీ ఉండదు గానీ వాటిపై ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ కార్మికులు, చేతివృత్తుల వారు నష్టపోతారు. కానీ వారేమో భూములను అమ్మకుండా యజమానులను నిరోధించలేరు. ఈ ఒక్క కారణంతో మొత్తం ప్రక్రియను నిలుపుదల చేయవచ్చు’’ అని వాదించారు. 298 అధికరణ ప్రకారం ప్రభుత్వం వ్యాపారాలు, వర్తక అవసరాల కోసం భూములు కొనుగోలు చేయాలే తప్ప ప్రాజెక్టుల కోసం కాదని సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్ అన్నారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలే తప్ప ప్రైవేటు వ్యక్తిలా వ్యవహరించడానికి వీల్లేదని వివరించారు. పిటిషనర్ల తరఫు వాదనలు పూర్తవడంతో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించేందుకు వీలుగా విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.