భూసేకరణపై పూర్తి వివరాలివ్వండి
- మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
- విచారణ గురువారానికి వాయిదా
- ప్రభుత్వానిది బలవంతపు భూసేకరణ: పిటిషనర్లు
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ ఎత్తిపోతల పథకంలో భూసేకరణకు అనుసరిస్తున్న విధానానికి సంబంధించి పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టుల నిర్మాణం కోసం అవసరమైన భూములను సేకరించేందుకు వీలుగా ప్రభుత్వం జారీ చేసిన జీవో 123 చట్ట విరుద్ధమని ప్రకటించడంతోపాటు 2013 భూసేకరణ చట్టాన్ని సర్కారు అమలు చేసేలా ఆదేశించాంటూ మెదక్ జిల్లాకు చెందిన రైతులు సేరుపల్లి ఉపేందర్‌రెడ్డి, మరో 14 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యాన్ని మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ 2013 భూసేకరణ చట్టం రైతులకు నిర్దిష్టంగా కొన్ని ప్రయోజనాలు కల్పిస్తోందన్నారు. అయితే ఈ ప్రయోజనాలను ప్రభుత్వం జీవో 123 ద్వారా హరించిందని... పరిహారం, పునరావాస ప్యాకేజీలు రైతులకు దక్కకుండా చేసేందుకే జీవో 123 జారీ చేసిందని ఆరోపించారు. జీవో ద్వారా ప్రభుత్వం బలవంతపు భూసేకరణకు పాల్పడుతోందన్నారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిల్వ సామర్థ్యాన్ని 2 టీఎంసీల నుంచి 50 టీఎంసీలకు పెంచుతున్నారని, దీని వల్ల ఐదు గ్రామాలు ముంపునకు గురవుతాయని వివరించారు. 2013 భూసేకరణ చట్ట నిబంధనల ప్రకారం కొత్త భూసేకరణ చట్టం తీసుకొచ్చే అధికారం ప్రభుత్వాలకు ఉందని, అయితే 2013 చట్టం కల్పిస్తున్న ప్రయోజనాలకన్నా ఎక్కువ ప్రయోజనాలు కల్పించేలా కొత్త చట్టం ఉండి తీరాలని పేర్కొన్నారు.
2013 చట్టంతో భూసేకరణకు 10-15 ఏళ్లు: ఏజీ
జీవో 123పై ధర్మాసనం అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వివరణ కోరగా రైతుల నుంచి బలవంతంగా భూములను సేకరించడం లేదని, వారిని ఒప్పించి, వారు అంగీకరించిన ధరకు భూములను కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. భూములిచ్చేందుకు వారు అంగీకరించని పక్షంలో భూసేకరణ చట్టం ప్రకారం ఆ భూములను సేకరిస్తామని, అందుకు ప్రభుత్వానికి అధికారం ఉందన్నారు. జీవో 123 ప్రకారం భూసేకరణ వేగవంతంగా పూర్తవుతుందని, అదే 2013 చట్టం ప్రకారమైతే 10-15 ఏళ్లు పడుతుందని వాదించారు. జీవో 123 ద్వారానే రైతులకు ఎక్కువ ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందన్నారు.
ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ ఏజీ స్పష్టమైన ప్రకటన చేస్తున్నారని, దాని ప్రకారం చూస్తే తదుపరి విచారణ ఏదీ అవసరం లేదన్నది తమ అభిప్రాయమని తేల్చి చెప్పింది. దీనిపై పిటిషనర్ల తరఫు న్యాయవాది స్పందిస్తూ రాష్ట్ర విభజన సందర్భంగా నాటి ప్రధాని ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ రాజ్యసభలో ప్రకటించిన హామీ ఇప్పటి వరకు నెరవేరలేదని గుర్తుచేశారు. దీనిపై స్పందించిన ధర్మాసనం... కోర్టుకు నివేదించిన విషయాలన్నింటినీ రాతపూర్వకంగా అఫిడవిట్ రూపంలో సమర్పించాలని అడ్వొకేట్ జనరల్‌ను ఆదేశించింది.