పిటిషనర్ల భూములు కొనుగోలు చేయం
- ఏడాది పాటు వారిని నిర్వాసితులను చేయం
- అవసరమైతే భూ సేకరణ కింద తీసుకుంటాం
- మల్లన్నసాగర్‌పై హైకోర్టుకు ఏజీ నివేదన
- విచారణ 31కి వాయిదా
సాక్షి, హైదరాబాద్ : మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై హైకోర్టును ఆశ్రయించిన పిటిషనర్ల నుంచి తాము భూములు కొనుగోలు చేయబోమని, కనీసం ఏడాది పాటు వారిని నిర్వాసితులను కూడా చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. దీంతో హైకోర్టు ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం జీవో 123 ద్వారా భూములు కొనుగోలు చేయడాన్ని సవాలు చేస్తూ అటు భూ యజమానులు, వాటిపై ఆధారపడి ఉన్న వ్యవసాయ కూలీలు, చేతివృత్తుల వారు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై సోమవారం ఏసీజే నేతృత్వం లోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వేదులు వెంకటరమణ, ఎ.సత్యప్రసా ద్ వాదనలు వినిపిస్తూ, 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయకుండా ప్రభుత్వం భూములను కొనుగోలు చేస్తోందన్నారు. దీని వల్ల వ్యవసాయ కూలీలు, చేతి వృత్తులవారు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారన్నారు. మరో న్యాయవాది బి.రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటోందన్నారు.
ముంపు అంశాన్నీ విచారిస్తాం..
అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి స్పందిస్తూ, కోర్టుకొచ్చిన పిటిషనర్ల నుంచి తాము భూములు కొనుగోలు చేయబోమన్నారు. పిటిషనర్ల భూములను అవసరమైతే భూ సేకరణ చట్టం ద్వారానే తీసుకుంటామన్నారు. వ్యవసాయ కార్మికుల పునరావాసం కోసం 190, 191 జీవోలు జారీ చేశామని, వాటి ద్వారా భూ సేకరణ చట్టం కన్నా మెరుగైన ప్రయోజనాలు కలుగుతాయన్నారు. ఈ సమయంలో ధర్మాసనం భూముల కొనుగోలుతో పాటు ముంపునకు గురయ్యే అంశంపై కూడా పూర్తిస్థాయిలో విచారణ చేపడతామంది. ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 190, 191లు నిమ్జ్‌కు సంబంధించినవని, అవి సాగునీటి ప్రాజెక్టులకు వర్తించవని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో ముంపు అంశం ఉంటుం దని, ముంపు బాధితులకు భూ సేకరణ చట్టంలో షెడ్యూల్ 3 కింద ప్రయోజనాలు వర్తింప చేయాలని తెలిపింది. ఈ సమయం లో ఏజీ స్పందిస్తూ, గడువునిస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పడంతో ధర్మాసనం అందుకు అంగీకరించింది.