జీతం మూరెడు.. చాకిరీ బారెడు
జీతం మూరెడు.. చాకిరీ బారెడు
Published Wed, Apr 26 2017 12:00 AM | Last Updated on Tue, Sep 5 2017 9:40 AM
నెలలు తరబడి వేతన బకాయిలు
సమస్యల నడుమ పంచాయతీ సిబ్బంది జీవితాలు
నేడు డీపీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు రంగం సిద్ధం
కపిలేశ్వరపురం(మండపేట): చీకటితో లేస్తారు..చీపురుతో ఊరంతా ఊడుస్తారు.. గ్రామస్తులు నిద్ర లేచే సరికి ఊరును అద్దంలా ఉంచుతారు.. వారికి అందుబాటులో తాగునీరును సిద్ధం చేస్తారు.. అధికారులు పర్యటనకు వస్తే ఉరుకులు పరుగులు తీస్తూ మర్యాదలు చేస్తారు.. ప్రభుత్వ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తారు.. ఇంతటి సేవ చేస్తున్న పంచాయతీ వర్కర్లను ప్రభుత్వం విస్మరిస్తోంది. కనీసం ఇచ్చే అరకొర జీతాన్ని కూడా సకాలంలో ఇవ్వకుండా నెలలు తరబడి బకాయిలు పెడుతోంది. పారిశుద్ధ్య కార్మికులు, ట్యాంక్ వాచ్‌మెన్, బిల్ కలెక్టర్ తదితర సిబ్బంది పుట్టెడు సమస్యలతో సతమతమవుతున్నారు. సమస్యల సాధన కోసం నేడు కాకినాడ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం ఎదుట ఆందోళనకు సమాయత్తమవుతున్నారు.
జిల్లాలో 1,100 పంచాయతీలు, ఏడు మున్సిపాలిటీలున్నాయి. వాటి పరిధిలో వేలాది మంది కార్మికులు క్షేత్ర స్థాయిలో విశేష సేలందిస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో సుమారు మూడు వేల మంది కాంట్రాక్టు, టెండరు, ఎన్‌ఎంఆర్ పద్ధతుల్లో పారిశుద్ధ్య, ట్యాంక్ వాచర్, బిల్ కలెక్టరు, ఎలక్ట్రీషియన్లుగా పనిచేస్తున్నారు. వీరి పనిచేస్తున్న ప్రాంతాల్లో వీరి సంఖ్య పరిమితంగా ఉండటంతో ఎక్కువ పనిగంటలు, అధిక పనిభారం మోస్తున్నారు.
అరకొర వేతనాలు
కార్మికులకు 2014లో జారీ చేసిన జీవో 11 ప్రకారం పంచాయతీ ఆర్థిక వనరులను బట్టి జీతాలిస్తున్నారు. రూ.వెయ్యి నుంచి ఏడు వేలు లోపే చాకిరీకి జీతంగా అందుకుంటున్నారు. 2016 ఆగస్టులో జారీ చేసిన జీవో 151 ప్రకారం స్వీపర్లుకు రూ.12 వేలు, ఇతర కార్మికులకు రూ.17వేలు వరకూ ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇచ్చే కొద్దిపాటి జీతం కాస్తా నెలలు తరబడి బకాయి పెడుతున్నారు. ఇంతలో కుటుంబ పోషణ కోసం బయట అప్పులు చేస్తున్నారు. వచ్చే జీతంలో అధిక మొత్తం వడ్డీలకే సరిపోతుందని సిబ్బంది వాపోతున్నారు.
రిజిస్టర్‌లో పేరు లేకుండా వేతనాల చెల్లింపు
ఇచ్చే జీతాలు చాలా పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికుని పేరున తీర్మానం చేసి ఇవ్వడం లేదు. కార్మికుల జీతాలు కోసం అంటూ మూకుమ్మడి తీర్మానాలు చేస్తున్నారు. దీంతో కార్మికులకు పంచాయతీలో పని చేస్తున్నట్టు, జీతం తీసుకుంటున్నట్టు ఆధారం లేని పరిస్థితి నెలకొంటుంది. ఈ వేతనాలను కూడా 010 పద్దు పద్ధతిలో చెల్లించాలని కోరుతున్నారు.
అమలుకాని డీఎల్‌పీఓ అత్యవసర ఉత్తర్వులు
సమస్యలపై సీఐటీయూ అనుబంధ ఏపీ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దీర్ఘకాలంగా ఉద్యమాన్ని చేస్తున్నారు. పలు అంశాలపై రాజమహేంద్రవరం డివిజనల్ పంచాయతీ అధికారి 956/015ఎ నంబరుతో 2015 డిసెంబర్ 16న అత్యవసర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి నెలా ఒకటో తేదీకల్లా బ్యాంక్ అకౌంట్ ద్వారా వేతనం ఇవ్వమని, వేతనాలు తీర్మానం రాసేటప్పుడు కార్మికుని పేరు ఒక్కాణించి రాయాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్‌లను అమలు చేయాలని, పోస్ట్ శాంక్షన్ ఆర్డర్లు రెన్యువల్‌ను క్రమం తప్పకుండా పై అధికారులకు పంపించాలని, జనశ్రీ బీమా పథకం అమలు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను చాలా పంచాయతీల్లో అమలు చేయడం లేదు.
పదోన్నతులు కల్పించాలి
క్షేత్రస్థాయిలో వాచ్‌మెన్, స్వీపరు, ఎలక్ట్రీషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లానే పంచాయతీరాజ్ శాఖలో కూడా పదోన్నతులివ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ శాఖలో 2008లోని జీవో 30, 2011లోని జీఓ 1866లు ప్రకారం ఐదేళ్ల సర్వీసు ఉండి పది, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన గ్రామ సేవకులకు వీఆర్వోలుగా పదోన్నతి కల్పించారు. అదే పద్ధతిలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న తమను కూడా పంచాయతీ కార్యదర్శులుగా నియమించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
సమరానికి సన్నద్ధం
సమస్యల పరిష్కారానికి పంచాయతీ కార్మికులు సమరానికి సన్నద్ధమవుతున్నారు. మండలస్థాయిలో నిరసన కార్యక్రమాలు అనంతరం కాకినాడ డీపీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగుతున్నారు.
డిమాండ్లు ఇవీ...
2012 ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా ఈఎస్‌ఐ, పీఎఫ్ సదుపాయాలను కల్పించాలి. జీఓఎంఎస్ 151 ప్రకారం జీతాలు చెల్లించాలని, జీతాలు పెంపుదలకు ఆటంకంగా ఉన్న 30 శాతం నిబంధనను తొలగించాలని, బకాయి జీతాలను వెంటనే చెల్లించాలని, ఎన్‌ఎంఆర్, కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, కాంట్రాక్టు కార్మికులకు పంచాయతీ పాలకవర్గాలతో సంబంధం లేకుండా ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని, హైకోర్టు ఉత్తర్వులు మేరకు టెండర్ విధానాన్ని ఆపాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పీఎఫ్, ఇఎస్‌ఐ, ప్రమాదబీమా సదుపాయాలు కల్పించాలని, డిగ్రీ పూర్తి చేసిన కార్మికులను పంచాయతీ కార్యదర్శిగా నియామకాలు చేపట్టాలని, పర్మినెంట్ కార్మికులకు 010 పద్దు ద్వారా జీతాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
హామీని తుంగలో తొక్కారు
పంచాయతీ కార్మికులు ఏళ్ల తరబడి కాంట్రాక్టు, టెండరు, ఎన్‌ఎంఆర్ పద్దతుల్లో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. వారిని రెగ్యులర్ చేస్తామంటూ ఎన్నికల్లో సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. రెండున్నరేళ్లు పాలన పూర్తవుతున్నా హామీ అమలు ఊసెత్తడంలేదు.
- నిమ్మకాయల భీమేశ్వరరావు, ఏపీ పంచాయతీ ఎంప్లాయీస్, అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి
Advertisement
Advertisement