‘ప్రత్యేకంగా’ మగ్గుతున్నాయి
-
పాలకుల్లేని పంచాయతీలు
-
విలీన కొర్రితో ఐదేళ్లుగా ప్రత్యేక పాలనలో 37 పంచాయతీలు
-
రెండేళ్లుగా అనపర్తి పంచాయతీలో ప్రత్యేక పాలన
-
మరణాలు, రాజీనామాలతో ఇన్‌చార్జీల ఏలుబడిలో మరో ఏడు
-
సమస్యలతో సతమవుతున్న ప్రజలు
మండపేట :
వెలగని వీధి దీపాలు...తొలగని చెత్త, డ్రైన్లలో పారని మురుగునీరు, కుళాయిల్లోంచి రాలని నీటిబొట్టు, వెంటాడుతున్న రోగాలు, అందుబాటులో ఉండని అధికారులు ఇవన్నీ పల్లెలను చుట్టుముడితే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదేళ్లుగా పాలకులు లేకుండా దుర్భరజీవనం సాగిస్తున్న పల్లెలు జిల్లాలో చాలానే ఉన్నాయి. సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో, అధికారులు ఎప్పుడు వస్తారో తెలియని దుస్థితి. దీంతో నిధుల వ్యయం, అభివృద్ధి పథకాల అమలు అంతా అయోమయంగా తయారైంది. విలీన ప్రతిపాదనలు నేపధ్యంలో జిల్లాలోని 37 పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. మృతులు, ఇతర కారణాలతో సర్పంచులు లేని పంచాయతీలు మరో ఏడు వరకూ ఉన్నాయి. ఏళ్ల తరబడి ప్రత్యేకపాలనలోనే మగ్గిపోతున్నాయి.
2011 సెప్టెంబరుతో గత పాలకవర్గాల పదవీ కాలం ముగియగా, బీసీ రిజర్వేషన్లు వివాదం, ఇతర కారణాలతో 2013 జూలైలో పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. జిల్లాలో 1069 పంచాయతీలకుగాను నగర, పురపాలక సంస్థల్లో సమీప గ్రామాలను విలీన ప్రతిపాదనలపై కోర్టు వివాదాల నేపధ్యంలో జిల్లాలోని 37 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించలేదు. వీటిలో రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలో విలీన నేపధ్యంలో రూరల్ మండలంలో 10 గ్రామాలు, రాజానగరం మండలంలో ఏడు, కోరుకొండ మండలంలో నాలుగు గ్రామాలకు ఎన్నికలు నిలిచిపోయాయి. కాకినాడ కొర్పొరేషన్ పరిధిలో కాకినాడ రూరల్ మండలంలో ఏడు గ్రామాలు, మండపేట మున్సిపాల్టీ పరిధిలో ఆరు గ్రామాలు, సామర్లకోట పరిధిలో రెండు, పెద్దాపురం పరిధిలో ఒక గ్రామానికి ఎన్నికలు జరగలేదు. అనపర్తి పంచాయతీ పదవీకాలం 2014 ఆగస్టు 4వ తేదీతో ముగియగా నగర పంచాయతీగా స్థాయి పెంపుదలకు వ్యతిరేకంగా నడుస్తున్న కోర్టు వాజ్యంతో ఎన్నికలు నిలిచిపోయాయి. రంగంపేట మండలం జి. దొంతమూరులో ఎన్నికలను గ్రామస్తులు బహిష్కరించడంతో ప్రత్యేకపాలనలో ఉంది. ఇదిలా ఉండగా విలీన ప్రతిపాధనను నిరసిస్తూ పలు గ్రామాలకు చెందిన వారు కోర్టులను ఆశ్రయించి ఎన్నికల నిర్వహణకు ఉత్తర్వులు తెచ్చుకున్నా వాటి అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఆయా పంచాయతీల పరిధిలోని 240కు పైగా వార్డులకు ఎన్నికలు జరపాల్సి ఉంది.
మరణాలు.. రాజీనామాలు...
పెదపూడి మండలం జి.మామిడాడ, మలికిపురం మండలం ఇరుసుమండ, ఆత్రేయపురం మండలం లొల్ల తదితర పంచాయతీల్లో సర్పంచుల మృతితో ఉప సర్పంచులకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. జంటిల్‌మెన్ ఒప్పందంలో భాగంగాSకాజులూరు మండలం నామవానిపాలెం సర్పంచి రాజీనామా చేశారు. కరప మండలం పాతర్లగడ్డ సర్పంచి జెడ్పీటీసీగా గెలుపొందడంతో సర్పంచి పదవికి రాజీనామా చేయగా ఉప సర్పంచి ఇన్‌చార్జి ఉన్నారు. ఆయా గ్రామాల్లో ఎన్నికలు జరపాల్సి ఉంది.
ఎన్నికలు జరుగక ఏళ్ల తరబడి ప్రత్యేక పాలనలోనే ఆయా గ్రామాలు మగ్గుతున్నాయి. గ్రామ ప్రజలకు అవసరమైన సేవలతో పాటు పంచాయతీలకు విడుదలయ్యే నిధుల వినియోగంలోను పారదర్శక లోపించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా : బూరిగ జానీ, ఏడిద, మండపేట మండలం
మండపేట మున్సిపాల్టీలో విలీన ప్రతిపాదనతో పంచాయతీ ఎన్నికలు నిలిపివేశారు. ఏడిద పంచాయతీకి ఎన్నికలు జరపాలని రెండేళ్ల క్రితం హైకోర్టు నుంచి వచ్చిన ఉత్తర్వులు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
అవస్థలు పడుతున్నాం : నాగమణి, తూరంగి, కాకినాడ రూరల్.
పట్టించుకునే వారు లేకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉంది. ఎక్కడికక్కడ అపరిశుభ్రత తాండవిస్తోంది. దోమల విజృంభణతో జ్వరాలు పెరిగిపోతున్నాయి.