no elections
-
Congress: ఎన్నికల్లేవ్.. ఖర్గేకు ఫ్రీహ్యాండ్? అయినా లుకలుకలు
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీబ్ల్యూసీ) విషయంలో సీనియర్లు అసంతృప్తితో రగిలిపోతున్నారా?. అలాంటి కమిటీకి సభ్యుల ఎంపిక కోసం ఎన్నిక నిర్వహించకూడదని పార్టీ చీఫ్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారా?. రాయ్‌పూర్(ఛత్తీస్‌గఢ్) పార్టీ ప్లీనరీ వేదికగా మరోసారి కాంగ్రెస్ లుకలుకలు బయటపడ్డాయా?.. సీడబ్ల్యూసీకి ఎన్నికతో కాకుండా.. నేరుగా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రతిపాదించిన అభ్యర్థులను కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ విషయాన్ని సీనియర్ నేత, కాంగ్రెస్ కమ్యూనికేషన్ ఇంచార్జి సెక్రటరీ జైరాం రమేశ్ శుక్రవారం వెల్లడించారు. మొత్తం 45 మంది స్టీరింగ్ కమిటీ సభ్యులు హాజరైన సమావేశం.. మూడు గంటలపాటు వాడీవేడిగా సాగినట్లు తెలుస్తోంది. సీడబ్ల్యూసీ ఎన్నిక విషయంలో ఎవరికి వారు తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వివరించినట్లు తెలుస్తోంది. అయితే చివరకు నిర్ణయం.. ఏకగ్రీవ ఆమోదం పొందలేని కాంగ్రెస్ వర్గాల సమాచారం. అజయ్ మాకెన్, అభిషేక్ మను సింఘ్వీ, దిగ్విజయ్ సింగ్ లాంటి సీనియర్ల సీబ్ల్యూసీకి ఎన్నికలు నిర్వహించాల్సిందేనని రాయ్‌పూర్(ఛత్తీస్‌ఘడ్)లో జరిగిన 85వ ప్లీనరీ సందర్భంగా తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందులో సింఘ్వీ మాత్రం 2024 ఎన్నికల తర్వాత అయినా పర్వాలేదని ప్లీనరీలో సూచించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఖర్గే ఎంపిక చేసిన జాబితానే సీడబ్ల్యూసీ కోసం కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ ద్వారా ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో.. దళారీ సంస్కృతిని తొలగించేందుకు పార్టీ చేస్తున్న పోరాటానికి మరోసారి ద్రోహం జరిగిందంటూ కొందరు సీనియర్లు రగిలిపోతున్నారు. స్టీరింగ్ కమిటీకి సూచనలకు ప్రాధాన్యం ఇవ్వనప్పుడు.. అభిప్రాయ సేకరణ ఎందుకని నిలదీస్తున్నారు. మరోవైపు.. కాంగ్రెస్‌లో ఏకాభిప్రాయం లేదన్న విషయం బయటకు పొక్కడంతో.. కాంగ్రెస్ నేతలు మీడియాకు వివరణలు ఇస్తున్నారు. కాంగ్రెస్‌లో ఎలాంటి బేధాభిప్రాయాలు లేవు. మల్లికార్జున ఖర్గే నాయకత్వంపై నమ్మకంతో ఉన్నాం. ఆ నమ్మకంతోనే కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలనే యత్నంలో ఉన్నాం. అని సీనియర్ నేత దినేశ్ గుండు రావు తెలిపారు. ఇదిలా ఉంటే రాయ్‌పూర్ ప్లీనరీకి స్టీరింగ్ కమిటీ సభ్యులైన.. సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్, తనయ ప్రియాంక గాంధీ వాద్రా దూరంగా ఉన్నారు. ఖర్గేకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే వాళ్లు దూరంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే శని, ఆదివారాల్లో జరగబోయే ప్లీనరీకి ఈ కీలక నేతలంతా హాజరుకావొచ్చని భావిస్తున్నారు. మరోవైపు పార్టీ రాజ్యాంగానికి 30 సవరణలు చేసింది రాయ్‌పూర్ ప్లీనరీలో. అందులో గ్రామ, మండల, వార్డ్ స్థాయిలో పార్టీ యూనిట్ల ఏర్పాటు అనే ప్రధాన అంశం కూడా ఉంది. -
మొక్కుబడితంతుకు ఆరేళ్లు
కాకినాడ కార్పొరేషన్లో కొనసాగుతున్న ప్రత్యేకాధికారి పాలన పాలకవర్గం లేకపోవడంతో పేరుకుపోతున్న సమస్యలు ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వాల తాత్సారం కాకినాడ : కాకినాడ కార్పొరేషన్లో ప్రత్యేకాధికారి పాలనకు నేటితో సరిగ్గా ఆరేళ్లు పూర్తయింది. తొలి నగరపాలక సంస్థ పదవీకాలం 2010 అక్టోబర్ 29వ తేదీతో ముగిసిపోయింది. దీంతో ఆ మరుసటిరోజు అంటే అక్టోబర్ 30వ తేదీ నుంచి కాకినాడ ప్రత్యేకాధికారి పాలనలోకి వెళ్లిపోయింది. పాలకవర్గంలేని ప్రభావం జిల్లా కేంద్రంపై తీవ్రంగానే కని పిస్తోంది. గట్టిగా అడిగే నాథుడు కరువవడం, ప్ర త్యేకాధికారిగా తీరికలేని కలెక్టర్‌ను నియమించడం తో మౌలిక సదుపాయాల కల్పన నుంచి నిత్యం ఎదుర్కొనే సమస్యల వరకు మొక్కుబడిగానే పరిష్కారానికి నోచుకుంటున్నాయి. ఆరంభంలో కొద్దిరోజులపాటు జాయింట్ కలెక్టర్‌ను ప్రత్యేకాధికారిగా నియమించడంతో కనీసం వారానికి రెండుమూడుసార్లు కార్పొరేషన్‌కు వచ్చి అధికారులతో సమీక్షలు జరపడం, పనితీరు బాగాలేకపోతే కొర డా ఝుళిపించడం, సిబ్బందిపై వేటు వేయడం వంటి చర్యలతో కొంతవరకు గాడిలోపడింది. అయితే ఈ విధానం ఎంతోకాలం సాగలేదు. ఆరంభంలో జాయింట్ కలెక్టర్లుగా ఉన్న కోన శశి« దర్, బాబు .ఎ. హయాంలో కార్పొరేషన్ కొంతవరకు పరిపాలన పరంగా ముందుకు సాగినా కొద్దిరోజులకే కలెక్టర్లను ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ వచ్చిన ఉత్తర్వులు పాలనపై ప్రభావం చూపించాయి. నగరపాలక సంస్థకు ఐఏఎస్ హోదా కలిగిన అధికారులను కమిషనర్లుగా నియమిస్తారని ఆశించినా అదికూడా జరగకపోగా డిప్యూటేషన్‌పై వచ్చిన అధికారులే ఇక్కడ కమిషనర్లుగా కొనసాగడం కూడా కాకినాడ అభివృద్ధిపై ప్రభావం చూపించాయి. పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడకపోవడం, అక్రమ కట్టడాలపై నియంత్రణ లేకపోవడం, రహదారి విస్తరణ పనులు కుంటుపడడం, వివిధ విభాగాల్లో నియంత్రణ కరువై అవినీతి రాజ్యమేలడం పెరిగిపోయాయి. విలీనమే అవరోధం పంచాయతీలు విలీనమే నగరపాలక సంస్థ ఎన్నికలకు అవరోధంగా మారాయి. తొలిపాలకవర్గం 2005 అక్టోబర్ 1న బాధ్యతలు స్వీకరించగా 2010 అక్టోబర్ 29 నాటికి పదవీకాలం ముగిసిపోయింది. అప్పటి నుంచి గత ప్రభుత్వం 2014 వరకు ఎన్నికలు జరగకుండా కాలయాపన చేస్తూ వచ్చింది. పంచాయతీల విలీనం పేరుతో జరిగిన కాలయాపన నేపథ్యంలో 2014లో తూరంగి పంచాయతీని కలిపి ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ తరువాత మరికొన్ని పంచాయతీల విలీనంలో కొత్త సమస్యలు తలెత్తడం, న్యాయపరమైన అవరోధాలు, ఓటమి భయం, కుంటిసాకులతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కూడా రెండేళ్లుగా ఎన్నికలు జరిపేందుకు ముందుకు రాలేదు. ఇప్పుడైనా ఎన్నికలు జరిగేనా? కోర్టు అక్షింతలతో... ఆరేళ్ల తరువాత కార్పొరేషన్ ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం ఇటీవలే సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పుడైనా ఎన్నికలు నిర్వహించి కొత్తపాలకవర్గం ఏర్పాటయ్యే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. స్మార్ట్‌సిటీగా ఎంపికైన నేపథ్యంలో పాలకవర్గం కూడా ఉంటే మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు వీలుంటుందన్న భావన ప్రజల్లో వ్యక్తమౌతోంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే వచ్చే జనవరి నాటికి ఎన్నికలు జరగగలవన్న ఆశాభావంతో ఈ ప్రాంత ప్రజలు ఉన్నారు. -
‘ప్రత్యేకంగా’ మగ్గుతున్నాయి
పాలకుల్లేని పంచాయతీలు విలీన కొర్రితో ఐదేళ్లుగా ప్రత్యేక పాలనలో 37 పంచాయతీలు రెండేళ్లుగా అనపర్తి పంచాయతీలో ప్రత్యేక పాలన మరణాలు, రాజీనామాలతో ఇన్చార్జీల ఏలుబడిలో మరో ఏడు సమస్యలతో సతమవుతున్న ప్రజలు మండపేట : వెలగని వీధి దీపాలు...తొలగని చెత్త, డ్రైన్లలో పారని మురుగునీరు, కుళాయిల్లోంచి రాలని నీటిబొట్టు, వెంటాడుతున్న రోగాలు, అందుబాటులో ఉండని అధికారులు ఇవన్నీ పల్లెలను చుట్టుముడితే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదేళ్లుగా పాలకులు లేకుండా దుర్భరజీవనం సాగిస్తున్న పల్లెలు జిల్లాలో చాలానే ఉన్నాయి. సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో, అధికారులు ఎప్పుడు వస్తారో తెలియని దుస్థితి. దీంతో నిధుల వ్యయం, అభివృద్ధి పథకాల అమలు అంతా అయోమయంగా తయారైంది. విలీన ప్రతిపాదనలు నేపధ్యంలో జిల్లాలోని 37 పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. మృతులు, ఇతర కారణాలతో సర్పంచులు లేని పంచాయతీలు మరో ఏడు వరకూ ఉన్నాయి. ఏళ్ల తరబడి ప్రత్యేకపాలనలోనే మగ్గిపోతున్నాయి. 2011 సెప్టెంబరుతో గత పాలకవర్గాల పదవీ కాలం ముగియగా, బీసీ రిజర్వేషన్లు వివాదం, ఇతర కారణాలతో 2013 జూలైలో పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. జిల్లాలో 1069 పంచాయతీలకుగాను నగర, పురపాలక సంస్థల్లో సమీప గ్రామాలను విలీన ప్రతిపాదనలపై కోర్టు వివాదాల నేపధ్యంలో జిల్లాలోని 37 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించలేదు. వీటిలో రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలో విలీన నేపధ్యంలో రూరల్ మండలంలో 10 గ్రామాలు, రాజానగరం మండలంలో ఏడు, కోరుకొండ మండలంలో నాలుగు గ్రామాలకు ఎన్నికలు నిలిచిపోయాయి. కాకినాడ కొర్పొరేషన్ పరిధిలో కాకినాడ రూరల్ మండలంలో ఏడు గ్రామాలు, మండపేట మున్సిపాల్టీ పరిధిలో ఆరు గ్రామాలు, సామర్లకోట పరిధిలో రెండు, పెద్దాపురం పరిధిలో ఒక గ్రామానికి ఎన్నికలు జరగలేదు. అనపర్తి పంచాయతీ పదవీకాలం 2014 ఆగస్టు 4వ తేదీతో ముగియగా నగర పంచాయతీగా స్థాయి పెంపుదలకు వ్యతిరేకంగా నడుస్తున్న కోర్టు వాజ్యంతో ఎన్నికలు నిలిచిపోయాయి. రంగంపేట మండలం జి. దొంతమూరులో ఎన్నికలను గ్రామస్తులు బహిష్కరించడంతో ప్రత్యేకపాలనలో ఉంది. ఇదిలా ఉండగా విలీన ప్రతిపాధనను నిరసిస్తూ పలు గ్రామాలకు చెందిన వారు కోర్టులను ఆశ్రయించి ఎన్నికల నిర్వహణకు ఉత్తర్వులు తెచ్చుకున్నా వాటి అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఆయా పంచాయతీల పరిధిలోని 240కు పైగా వార్డులకు ఎన్నికలు జరపాల్సి ఉంది. మరణాలు.. రాజీనామాలు... పెదపూడి మండలం జి.మామిడాడ, మలికిపురం మండలం ఇరుసుమండ, ఆత్రేయపురం మండలం లొల్ల తదితర పంచాయతీల్లో సర్పంచుల మృతితో ఉప సర్పంచులకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. జంటిల్మెన్ ఒప్పందంలో భాగంగాSకాజులూరు మండలం నామవానిపాలెం సర్పంచి రాజీనామా చేశారు. కరప మండలం పాతర్లగడ్డ సర్పంచి జెడ్పీటీసీగా గెలుపొందడంతో సర్పంచి పదవికి రాజీనామా చేయగా ఉప సర్పంచి ఇన్చార్జి ఉన్నారు. ఆయా గ్రామాల్లో ఎన్నికలు జరపాల్సి ఉంది. ఎన్నికలు జరుగక ఏళ్ల తరబడి ప్రత్యేక పాలనలోనే ఆయా గ్రామాలు మగ్గుతున్నాయి. గ్రామ ప్రజలకు అవసరమైన సేవలతో పాటు పంచాయతీలకు విడుదలయ్యే నిధుల వినియోగంలోను పారదర్శక లోపించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా : బూరిగ జానీ, ఏడిద, మండపేట మండలం మండపేట మున్సిపాల్టీలో విలీన ప్రతిపాదనతో పంచాయతీ ఎన్నికలు నిలిపివేశారు. ఏడిద పంచాయతీకి ఎన్నికలు జరపాలని రెండేళ్ల క్రితం హైకోర్టు నుంచి వచ్చిన ఉత్తర్వులు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అవస్థలు పడుతున్నాం : నాగమణి, తూరంగి, కాకినాడ రూరల్. పట్టించుకునే వారు లేకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉంది. ఎక్కడికక్కడ అపరిశుభ్రత తాండవిస్తోంది. దోమల విజృంభణతో జ్వరాలు పెరిగిపోతున్నాయి.