సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీబ్ల్యూసీ) విషయంలో సీనియర్లు అసంతృప్తితో రగిలిపోతున్నారా?. అలాంటి కమిటీకి సభ్యుల ఎంపిక కోసం ఎన్నిక నిర్వహించకూడదని పార్టీ చీఫ్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారా?. రాయ్‌పూర్(ఛత్తీస్‌గఢ్) పార్టీ ప్లీనరీ వేదికగా మరోసారి కాంగ్రెస్ లుకలుకలు బయటపడ్డాయా?..
సీడబ్ల్యూసీకి ఎన్నికతో కాకుండా.. నేరుగా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రతిపాదించిన అభ్యర్థులను కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ విషయాన్ని సీనియర్ నేత, కాంగ్రెస్ కమ్యూనికేషన్ ఇంచార్జి సెక్రటరీ జైరాం రమేశ్ శుక్రవారం వెల్లడించారు. మొత్తం 45 మంది స్టీరింగ్ కమిటీ సభ్యులు హాజరైన సమావేశం.. మూడు గంటలపాటు వాడీవేడిగా సాగినట్లు తెలుస్తోంది. సీడబ్ల్యూసీ ఎన్నిక విషయంలో ఎవరికి వారు తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వివరించినట్లు తెలుస్తోంది. అయితే చివరకు నిర్ణయం.. ఏకగ్రీవ ఆమోదం పొందలేని కాంగ్రెస్ వర్గాల సమాచారం.
అజయ్ మాకెన్, అభిషేక్ మను సింఘ్వీ, దిగ్విజయ్ సింగ్ లాంటి సీనియర్ల సీబ్ల్యూసీకి ఎన్నికలు నిర్వహించాల్సిందేనని రాయ్‌పూర్(ఛత్తీస్‌ఘడ్)లో జరిగిన 85వ ప్లీనరీ సందర్భంగా తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందులో సింఘ్వీ మాత్రం 2024 ఎన్నికల తర్వాత అయినా పర్వాలేదని ప్లీనరీలో సూచించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఖర్గే ఎంపిక చేసిన జాబితానే సీడబ్ల్యూసీ కోసం కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ ద్వారా ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో.. దళారీ సంస్కృతిని తొలగించేందుకు పార్టీ చేస్తున్న పోరాటానికి మరోసారి ద్రోహం జరిగిందంటూ కొందరు సీనియర్లు రగిలిపోతున్నారు. స్టీరింగ్ కమిటీకి సూచనలకు ప్రాధాన్యం ఇవ్వనప్పుడు.. అభిప్రాయ సేకరణ ఎందుకని నిలదీస్తున్నారు. మరోవైపు..
కాంగ్రెస్‌లో ఏకాభిప్రాయం లేదన్న విషయం బయటకు పొక్కడంతో.. కాంగ్రెస్ నేతలు మీడియాకు వివరణలు ఇస్తున్నారు. కాంగ్రెస్‌లో ఎలాంటి బేధాభిప్రాయాలు లేవు. మల్లికార్జున ఖర్గే నాయకత్వంపై నమ్మకంతో ఉన్నాం. ఆ నమ్మకంతోనే కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలనే యత్నంలో ఉన్నాం. అని సీనియర్ నేత దినేశ్ గుండు రావు తెలిపారు.
ఇదిలా ఉంటే రాయ్‌పూర్ ప్లీనరీకి స్టీరింగ్ కమిటీ సభ్యులైన.. సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్, తనయ ప్రియాంక గాంధీ వాద్రా దూరంగా ఉన్నారు. ఖర్గేకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే వాళ్లు దూరంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే శని, ఆదివారాల్లో జరగబోయే ప్లీనరీకి ఈ కీలక నేతలంతా హాజరుకావొచ్చని భావిస్తున్నారు. మరోవైపు పార్టీ రాజ్యాంగానికి 30 సవరణలు చేసింది రాయ్‌పూర్ ప్లీనరీలో. అందులో గ్రామ, మండల, వార్డ్ స్థాయిలో పార్టీ యూనిట్‌ల ఏర్పాటు అనే ప్రధాన అంశం కూడా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment