సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎప్పుడు, ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నామని, త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధిస్తామని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ధీమా వ్యక్తం చేసింది. తెలంగాణతోపాటు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్తాన్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చారిత్రక తీర్పు ఇస్తారనే విశ్వాసాన్ని ప్రకటించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన ఆదివారం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్లో రెండోరోజు సీడబ్ల్యూసీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది.
ఈ భేటీలో సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అశోక్‌గహ్లోత్, సిద్ధరామయ్య, భూపేశ్‌భగేల్, సీడబ్ల్యూసీ సభ్యులు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు పాల్గొన్నారు. త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు, పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు, దేశ రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు. ఐదు రాష్ట్రాలకు చెందిన పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు, ఆయా రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలు ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు ఎదుర్కొనేందుకు అనుసరిస్తున్న వ్యూహాల గురించి వివరించారు.
తెలంగాణ నుంచి రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో ఈసారి తప్పకుండా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తంచేశారు. విజయం సాధించడమే లక్ష్యంగా వ్యూహాలు రూపొందిస్తున్నామని, ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, పదేళ్ల బీజేపీ పాలనా వైఫల్యాలు, పార్టీ అనుసరించాల్సిన వైఖరి తదితర అంశాలపై ఖర్గే దిశానిర్దేశం చేశారు.
యుద్ధానికి సిద్ధం
చర్చ అనంతరం వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సీడబ్ల్యూసీ తీర్మానించింది. ఎన్నికల యుద్ధానికి సంసిద్ధం కావాలని నిర్ణయించింది. దేశ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పింది. ఆదివారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన సీడబ్ల్యూసీ భేటీ మధ్యాహ్నం 4 గంటలకు ముగిసింది. అనంతరం ప్రియాంక ఢిల్లీ వెళ్లిపోగా, సోనియా, రాహుల్, ఖర్గేతోపాటు మిగిలిన సీడబ్ల్యూసీ సభ్యులు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు తుక్కుగూడ బహిరంగ సభకు వెళ్లారు.
జోడో యాత్ర ఉన్నట్టా లేనట్టా?
ఖర్గే చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర మరోమారు ఉంటుందా లేదా అన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సమావేశంలో భారత్‌జోడో యాత్రపై చర్చించిన సందర్భంగా రాహుల్ అన్ని శక్తులు అప్పుడే ఉపయోగించాల్సిన అవసరం లేదని, సమయం వచ్చినప్పుడు ఆయన శక్తియుక్తులు పార్టీకి ఉపయోగపడతాయని ఖర్గే చెప్పారు. ఈ నేపథ్యంలో అరుణాచల్‌ప్రదేశ్ నుంచి చేపట్టాలని భావించిన 2.0 యాత్రపై ఉత్కంఠ నెలకొంది.
మీరు కాంగ్రెస్‌ను ఎందుకు ఎంచుకున్నారు: ఖర్గేకు రాహుల్ ప్రశ్న
సీడబ్ల్యూసీలో చర్చ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. మీరు యువకుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌ను ఎందుకు ఎంచుకున్నారని ఖర్గేను రాహుల్ ప్రశ్నించారు. ‘అప్పుడు అందరూ కాంగ్రెస్‌ను వదిలి కాంగ్రెస్(ఓ)లో చేరుతున్నారు. కానీ, పేదలు, బడుగు, బలహీన వర్గాల పక్షాన పని చేసేది కాంగ్రెస్ మాత్రమేనన్న భావనతో కాంగ్రెస్ లో చేరా. 1969, నవంబర్‌లో పార్టీ బ్లాక్ అధ్యక్షుడి గా బాధ్యతలు చేపట్టా. ఇప్పుడు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిని అయ్యా’ అని ఖర్గే బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment