ఈవీఎంల వల్లే ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు
ప్రత్యర్థులకు మించిన వ్యూహ రచన చేయాలి
సీడబ్ల్యూసీ భేటీలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీని అట్టడుగు స్థాయి నుంచి సంస్థాగతంగా బలోపేతం చేయాలంటే కఠిన చర్యలు తీసుకోవడం తప్పనిసరని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ఇందుకోసం ముందుగా పార్టీ నేతలు ఐకమత్యంతో, జవాబుదారీతనంతో వ్యవహరించాలని, ఒకరినొకరు బహిరంగంగా విమర్శించుకోవడం మానాలని హితవు పలికారు.
అదేవిధంగా, ఈవీఎంల వల్లే ఎన్నికల ప్రక్రియను అనుమానించాల్సి వస్తోందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో దేశంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన రాజ్యాంగ బాధ్యత ఎన్నికల కమిషన్‌దేనని ఖర్గే నొక్కి చెప్పారు. అత్యున్నత నిర్ణాయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం శుక్రవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వైఫల్యంపై ఈ సమావేశంలో ప్రధానంగా నేతలు చర్చించారు. ఈ భేటీలో ఖర్గే ప్రసంగించారు.
నేతల మధ్య కలహాలతోనే పార్టీకి చేటు
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలపై ఖర్గే మండిపడ్డారు. నేతల్లో ఐకమత్యం లేకపోవడం, ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే పెడపోకడలు పార్టీకి చేటు తెస్తున్నాయన్నారు. ఎన్నికల సమయంలో ఒక్కతాటిపై నిలబడకుండా, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటే రాజకీయ ప్రత్యర్థులను ఎలా ఓడించగలం?అని ప్రశ్నించారు.
‘ఎన్నికల ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకుని, లోపాలను సరి చేసుకోవాలి. ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ, సరైన వ్యూహంతో ముందుకు సాగాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఐకమత్యం, క్రమశిక్షణ కలిగి ఉండటం ఎంతో ముఖ్యమైంది. పార్టీ గెలుపును తమ గెలుపుగా, ఓటమిని సొంత ఓటమిగా ప్రతి ఒక్కరూ భావించాల్సిన అవసరం ఉంది. పార్టీ బలమే మన బలం’అని ఖర్గే చెప్పారు. అదే సమయంలో ఇటీవలి ఎన్నికల ఫలితాలను చూసి నిరుత్సాహ పడరాదని ఆయన పార్టీ శ్రేణులను కోరారు. ‘అట్టడుగు స్థాయి నుంచి ఏఐసీసీ స్థాయి వరకు సమూలంగా మార్పులు చేస్తూ పార్టీని బలోపేతం చేయాలి. ఈ ప్రక్రియలో ఏఐసీసీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.
అవి ఊహించని ఫలితాలు
లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించి, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలు పార్టీని ఒక్కసారిగా కుదిపేశాయని ఖర్గే అన్నారు. ‘మహా వికాస్ అఘాడీ సాధించిన ఫలితాలు రాజకీయ పండితులు సైతం ఊహించనివి. ఇలాంటి ఫలితాలు ఏ అంచనాలకూ అందనివి. నాలుగు రాష్ట్రాల్లో పోటీ చేసిన ఇండియా కూటమి పార్టీలు రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. కానీ, మనం సాధించిన ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవు.
మన పార్టీ భవిష్యత్తుకు ఇదో సవాల్. ఈ ఫలితాలు మనకో గుణపాఠం. వీటిని బట్టి సంస్థాగతంగా మనకున్న బలహీనతలను, లోపాలను సరిచేసుకోవాలి. ఎన్నికల సమయంలో పరిస్థితులన్నీ మనకు అనుకూలంగానే ఉన్నట్లు కనిపించినా ఆ మేరకు విజయం సాధించలేకపోయాం. అనుకూల వాతావరణాన్ని అనుకూల ఫలితాలను సాధించేలా మనం మార్చుకోలేకపోయాం.దీనిపై ఆత్మ విమర్శ చేసుకోవాలి’అని ఖర్గే తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శులు ప్రియాంకా గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, జై రామ్ రమేశ్ పాల్గొన్నారు.
ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతపై ఉద్యమం
యావత్తూ ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయత దారుణంగా దెబ్బతిందని సీడబ్ల్యూసీ పేర్కొంది. ఈ అంశంపై త్వరలో దేశవ్యాప్త ఉద్యమం చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ఒక తీర్మానం ఆమోదించింది. ‘సమాజంలోని అన్ని వర్గాల్లో నిరాశ, నిస్పృహలు పెరుగుతున్నాయి. ప్రజల ఆందోళనలకు కాంగ్రెస్ జాతీయ స్థాయి ఉద్యమ రూపం తీసుకువస్తుంది’అని ఆ తీర్మానం తెలిపింది.
ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా జరపాలనే రాజ్యాంగ నిర్దేశం అమలు ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో ప్రశ్నార్థకంగా మారిపోయిందని తీర్మానం పేర్కొంది.దాదాపు నాలుగున్నర గంటలపాటు జరిగిన సీడబ్ల్యూసీ భేటీ దేశంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించి, తీర్మానం ఆమోదించిందని జైరాం రమేశ్, పవన్ ఖేరా, కేసీ వేణుగోపాల్ మీడియాకు చెప్పారు. సంస్థాగత అంశాలు, ఎన్నికల ఫలితాలపై విశ్లేషించేందుకు అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని కూడా సమావేశం నిర్ణయించిందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment