- కాకినాడ కార్పొరేషన్‌లో కొనసాగుతున్న ప్రత్యేకాధికారి పాలన
- పాలకవర్గం లేకపోవడంతో పేరుకుపోతున్న సమస్యలు
- ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వాల తాత్సారం
మొక్కుబడితంతుకు ఆరేళ్లు
Published Thu, Sep 29 2016 9:39 PM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM
కాకినాడ :
కాకినాడ కార్పొరేషన్‌లో ప్రత్యేకాధికారి పాలనకు నేటితో సరిగ్గా ఆరేళ్లు పూర్తయింది. తొలి నగరపాలక సంస్థ పదవీకాలం 2010 అక్టోబర్ 29వ తేదీతో ముగిసిపోయింది. దీంతో ఆ మరుసటిరోజు అంటే అక్టోబర్ 30వ తేదీ నుంచి కాకినాడ ప్రత్యేకాధికారి పాలనలోకి వెళ్లిపోయింది. పాలకవర్గంలేని ప్రభావం జిల్లా కేంద్రంపై తీవ్రంగానే కని పిస్తోంది. గట్టిగా అడిగే నాథుడు కరువవడం, ప్ర త్యేకాధికారిగా తీరికలేని కలెక్టర్‌ను నియమించడం తో మౌలిక సదుపాయాల కల్పన నుంచి నిత్యం ఎదుర్కొనే సమస్యల వరకు మొక్కుబడిగానే పరిష్కారానికి నోచుకుంటున్నాయి. ఆరంభంలో కొద్దిరోజులపాటు జాయింట్ కలెక్టర్‌ను ప్రత్యేకాధికారిగా నియమించడంతో కనీసం వారానికి రెండుమూడుసార్లు కార్పొరేషన్‌కు వచ్చి అధికారులతో సమీక్షలు జరపడం, పనితీరు బాగాలేకపోతే కొర డా ఝుళిపించడం, సిబ్బందిపై వేటు వేయడం వంటి చర్యలతో కొంతవరకు గాడిలోపడింది. అయితే ఈ విధానం ఎంతోకాలం సాగలేదు. ఆరంభంలో జాయింట్ కలెక్టర్‌లుగా ఉన్న కోన శశి« దర్, బాబు .ఎ. హయాంలో కార్పొరేషన్ కొంతవరకు పరిపాలన పరంగా ముందుకు సాగినా కొద్దిరోజులకే కలెక్టర్లను ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ వచ్చిన ఉత్తర్వులు పాలనపై ప్రభావం చూపించాయి. నగరపాలక సంస్థకు ఐఏఎస్ హోదా కలిగిన అధికారులను కమిషనర్లుగా నియమిస్తారని ఆశించినా అదికూడా జరగకపోగా డిప్యూటేషన్‌పై వచ్చిన అధికారులే ఇక్కడ కమిషనర్లుగా కొనసాగడం కూడా కాకినాడ అభివృద్ధిపై ప్రభావం చూపించాయి. పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడకపోవడం, అక్రమ కట్టడాలపై నియంత్రణ లేకపోవడం, రహదారి విస్తరణ పనులు కుంటుపడడం, వివిధ విభాగాల్లో నియంత్రణ కరువై అవినీతి రాజ్యమేలడం పెరిగిపోయాయి.
విలీనమే అవరోధం
పంచాయతీలు విలీనమే నగరపాలక సంస్థ ఎన్నికలకు అవరోధంగా మారాయి. తొలిపాలకవర్గం 2005 అక్టోబర్ 1న బాధ్యతలు స్వీకరించగా 2010 అక్టోబర్ 29 నాటికి పదవీకాలం ముగిసిపోయింది. అప్పటి నుంచి గత ప్రభుత్వం 2014 వరకు ఎన్నికలు జరగకుండా కాలయాపన చేస్తూ వచ్చింది. పంచాయతీల విలీనం పేరుతో జరిగిన కాలయాపన నేపథ్యంలో 2014లో తూరంగి పంచాయతీని కలిపి ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ తరువాత మరికొన్ని పంచాయతీల విలీనంలో కొత్త సమస్యలు తలెత్తడం, న్యాయపరమైన అవరోధాలు, ఓటమి భయం, కుంటిసాకులతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కూడా రెండేళ్లుగా ఎన్నికలు జరిపేందుకు ముందుకు రాలేదు.
ఇప్పుడైనా ఎన్నికలు జరిగేనా?
కోర్టు అక్షింతలతో... ఆరేళ్ల తరువాత కార్పొరేషన్ ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం ఇటీవలే సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పుడైనా ఎన్నికలు నిర్వహించి కొత్తపాలకవర్గం ఏర్పాటయ్యే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. స్మార్ట్‌సిటీగా ఎంపికైన నేపథ్యంలో పాలకవర్గం కూడా ఉంటే మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు వీలుంటుందన్న భావన ప్రజల్లో వ్యక్తమౌతోంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే వచ్చే జనవరి నాటికి ఎన్నికలు జరగగలవన్న ఆశాభావంతో ఈ ప్రాంత ప్రజలు ఉన్నారు.
Advertisement
Advertisement