సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులెవరినీ వారి సొంత గ్రామ పంచాయతీలకు లేదా వారి సొంత మున్సిపల్ వార్డుల పరిధిలోకి ఎట్టి పరిస్థితిలో బదిలీ చేయబోమని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ శాఖ డైరెక్టర్ లక్ష్మీశ శనివారం పూర్తి మార్గదర్శకాలను విడుదల చేశారు.
2019, 2020 నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు పొంది.. ఈ ఏడాది మే 25 నాటికి ప్రొబేషన్ ప్రక్రియ పూర్తయిన వారు బదిలీ కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఇక ఏఎన్ఎంలకు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు పరస్పర అంగీకార బదిలీలకు మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. బదిలీలకు దరఖాస్తు చేసుకునే వారిపైన ఎలాంటి శాఖపరమైన క్రమశిక్షణా చర్యలు, ఏసీబీ, విజిలెన్స్ కేసులు పెండింగ్‌లో ఉండకూడదని స్పష్టం చేశారు.
ఒంటరి మహిళలకే తొలి ప్రాధాన్యం..
♦ కాగా బదిలీ దరఖాస్తులో సచివాలయాల ఉద్యోగులు ఐదు మండలాలు లేదా ఐదు మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్లను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకునే వీలు కల్పించారు. పరస్పర అంగీకార బదిలీలకు కేవలం ఒక మండలం లేదా మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్‌నే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసేటప్పుడు ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్ల ద్వారా పొందిన నో డ్యూస్ సర్టిఫికెట్‌ను అప్‌లోడ్ చేయాలి.
♦ బదిలీలు కోరుకునేవారిలో... వితంతువులు తమ భర్త మరణ ధ్రువీకరణ పత్రాన్ని, వ్యాధిగ్రస్తులు మెడికల్ సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. చెరొక చోట ఉద్యోగం చేస్తున్న భార్యాభర్తలకు వివాహ ధ్రువీకరణపత్రంతో పాటు భర్త లేదా భార్య ఆధార్ వివరాలు, వారి ఉద్యోగ ఐడీ కార్డు, ఉన్నతాధికారి జారీ చేసిన సర్టిఫికెట్లు ఉండాలి. వాటిని దరఖాస్తుతోపాటు జత చేయాలి.
♦ ఒక జిల్లా పరిధిలో 15 శాతం నాన్ లోకల్ నిబంధనలకు లోబడి అంతర్ జిల్లాల బదిలీలు ఉంటాయి. ఒక లోకల్ ఉద్యోగి, మరొక నాన్ లోకల్ ఉద్యోగి పరస్పర అంగీకారంతో అంతర్ జిల్లా కేటగిరీలో బదిలీ కోరుకున్నప్పుడు ఈ పరిస్థితి ఉత్పన్నమవుతుందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో బదిలీపై వెళ్తున్న ఉద్యోగితో సహా కొత్తగా ఆ జిల్లాకు వచ్చే నాన్ లోకల్ ఉద్యోగి సంఖ్య మొత్తం ఉద్యోగుల్లో 15 శాతం మించి ఉన్నప్పుడు అంతర్ జిల్లాల బదిలీలకు అవకాశం ఉండదని వెల్లడించారు.
♦ బదిలీలకు కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించే సమయంలో మొదట జిల్లా పరిధిలో, ఆ తర్వాత దశలో మాత్రమే అంతర్ జిల్లాల బదిలీలను పరిగణనలోకి తీసుకోవాలని కలెక్టర్లతోసహా ఇతర నియామక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పరిధిలో బదిలీల్లో మొదట ఒంటరి మహిళ లేదా వితంతువులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆ తర్వాత వరుస క్రమంలో అనారోగ్య కారణాలు, భార్యాభర్తలు వేర్వేరు చోట్ల పనిచేస్తుండడం వంటివాటిని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఇక చివరి ప్రాధాన్యతగా పరస్పర అంగీకార బదిలీలకు వీలు కల్పించాలన్నారు.
అర్హులందరికీ బదిలీలకు అవకాశం
బదిలీ కోరుకునే ఏ ఒక్క ఉద్యోగికి అన్యాయం జరగకుండా.. నిర్ణీత గడువులోగా అర్హులందరికీ ప్రొబేషన్ కూడా పూర్తయ్యేలా కలెక్టర్లతో కలిసి ఆయా శాఖాధిపతులు చర్యలు చేపట్టాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ సూచించారు.
డైరెక్టర్ లక్ష్మీశతో కలిసి శనివారం ఆయన సచివాలయాల ఉద్యోగుల బదిలీల ప్రక్రియపై జిల్లా కలెక్టర్లు, ఇతర శాఖాధిపతులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment