జన్మభూమి- మన ఊరు కేవలం ప్రభుత్వ కార్యక్రమం. అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రమే హాజరవ్వాలి. కానీ పచ్చ చొక్కాల దౌర్జన్యాలతో గందరగోళంగా మారాయి. అధికారులు కూడా తానా తందానా అనడంతో ప్రొటోకాల్ పత్తాలేకుండా పోయింది. రెండో విడత వచ్చే సరికి కమిటీల పేరుతో అధికార ముద్రతో సర్కారు సభలపైకి ఉసి గొల్పడంతో ప్రజా సమస్యలు పక్కకు తొలగి పార్టీ ఎజెండా ముందుకు వచ్చింది.
సర్వేల పేరుతో అర్హులను కూడా తొలగించడంతో మనస్థాపానికి గురై పలువురు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడ్డారు. ఓ వృద్ధురాలు ఏకంగా కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆ మృతదేహంతో బంధువులు ధర్నాకు దిగారు. ఇంకో సంఘటనలో మరో వృద్ధుడు గుండె ఆగి చనిపోయాడు. తను పట్టిన కుందేలుకు మూడే కాళ్లున్నాయన్న చందంగా అధికారులు పని చేసుకుపోవడంతో సంక్షేమం స్థానంలో సంక్షోభం ఏర్పడింది. లబ్ధిదారుల్లో మానసిక ఆందోళన నెలకొంది. ఇంతలో బది‘లీల’లు ప్రారంభమయ్యాయి. ఈ అర్జీల గతి ఏమవుతుందోనని లబ్ధిదారుల్లో సరికొత్త భయం నెలకొంది. వచ్చిన అధికారికి అంతా కొత్తే. ‘పెద్దాయనొచ్చె...మళ్లీ మొదలెట్టు’ అన్న చందంగా తయారవుతుందేమోనని అనుమానాలు ప్రారంభమయ్యాయి.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో పలు అవాంతరాలతో ముగిసిన జన్మభూమి సభలు అనుకున్న లక్ష్యానికి చేరుకోక విమర్శల పాలయింది. వచ్చిన లక్షల అర్జీలు సంబంధిత శాఖలకు పంపించే తరుణంలో బదిలీల ప్రక్రియకు శ్రీకారం చుట్టడంతో ప్రయోజనం ప్రశ్నార్ధకంగా మారింది. ప్రకాశం జిల్లాలో రెండు విడతలుగా 22 రోజులపాటు జరిగిన ‘జన్మభూమి - మా ఊరు’ సభలకు రెండు లక్షల 80 వేల అర్జీలు వచ్చాయి. ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ఇంకా నడుస్తుండటంతో ఈ దరఖాస్తులు ఆయా కార్యాలయాల్లోనే మూలుగుతున్నాయి. అర్జీలకు ఆధార్‌తో ముడిపెట్టారు.
ఆధార్ నెంబర్‌తోపాటు సెల్ నెంబర్ కూడా సేకరించాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా 1255 గ్రామసభలు నిర్వహించారు. అందులో రెండు లక్షల 80 వేల దరఖాస్తులు వస్తే కేవలం రెవెన్యూ శాఖకు సంబంధించే లక్షా రెండువేల అర్జీలున్నాయి. భూ సమస్యలు, పట్టాదార్ పాసు పుస్తకాల కోసమే ఎక్కువ ధరఖాస్తులు వచ్చాయి. పట్టాదారు పాస్‌పుస్తకాలకు సంబంధించిన 1బీ ఖాతాలను క్రాస్ చెక్ చేయకపోవడంవల్ల సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఒక్క చీరాల మండలంలోనే 80 శాతం అర్జీలు అధికారుల రికార్డులతో సరిపోలడం లేదు. దీంతో రైతులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వచ్చిన అర్జీలలో వ్యక్తిగతమైనపనుల కోసం ఎన్ని అర్జీలు వచ్చాయి, సామాజికపరంగా ఎన్ని ఉన్నాయనే అంశాన్ని విడగొట్టాల్సి ఉంది. వీటిని పరిష్కరించడానికి ఒక నిర్ధిష్టమైన గడువు లేదు. దీంతో అధికారులు వీటిని ప్రాధాన్యతాక్రమంలో రానున్న ఐదు సంవత్సరాల్లో వారి అవసరాలు తీర్చేందుకు చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ముఖ్యంగా డబ్బుతో ముడిపడిన ఏ అంశం కూడా పరిష్కారమయ్యే అవకాశం కనపడటం లేదు. ఆరోగ్య శిబిరాలు, వెటర్నరీ శిబిరాలు, పొలం పిలుస్తోంది, బడి పిలుస్తోంది.
పేదరికంపై గెలుపు, స్వచ్ఛ ఆంధ్రా, నీరు -చెట్టు తదితర కార్యక్రమాలు కూడా మొక్కుబడిగా నిర్వహించారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా పొలం పిలుస్తోంది, బడి పిలుస్తోంది అంటూ సభలు నిర్వహించినా తర్వాత ఎక్కడా వాటి ఊసే లేదు. కొత్తగా బడికి వెళ్లని వారిని గుర్తించి స్కూళ్లలో చేర్చింది కూడా లేదు. డ్వాక్రా రుణాలు కూడా ముఖ్యమంత్రి సభలో ఇచ్చినవే. రుణమాఫీ అమలు కాకపోవడం వల్ల డ్వాక్రా గ్రూపులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రాలేదు. నిర్దేశించిన లక్ష్యం ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది.
రెవెన్యూ శాఖకు సంబంధించినవే కాకుండా, పింఛన్లకు సంబంధించి 55,703 అర్జీలు, పౌరసరఫరాల శాఖకు సంబంధించి 42, 650, హౌసింగ్‌కు సంబంధించి 38,469, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి 11,754 అర్జీలు, మున్సిపాలిటీలకు సంబంధించి 5 వేల అర్జీలు వచ్చాయి. పింఛన్లకు పేరు మార్చి ఎన్‌టీఆర్ భరోసా పేరుతో పంపిణీ చేసిన సంగతి తెలిసిందే, ఈ సభల్లో 2,56000 మందికి పింఛన్లు పంపిణీ చేశారు. పింఛన్లకు సంబంధించి జిల్లాలో 79 వేల మంది పేర్లను తొలగించామని జిల్లా కలెక్టర్ విజయకుమార్ అధికారికంగా వెల్లడించారు.
అందులో 27 వేలు పునరుద్ధరించారు. ఇంకా 52 వేల మందిలో అర్హత ఉండి కూడా పింఛన్ లేక చాలా మంది అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. పింఛన్లకు అర్హులైనప్పటికీ జాబితాలో లేనివారు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీలకు సమాచారం అందించాలని అధికారులు చెబుతున్నారు. అయితే వారికి మాత్రం న్యాయం జరగడం లేదు. ఈ కమిటీలు కూడా పూర్తిగా తెలుగుదేశం వారితో నింపడంతో అర్హులకు న్యాయం జరగడం లేదు.
తమకు పింఛన్ అందని కారణంగా జిల్లాలో ఒకరు ఆత్మహత్య చేసుకోగా ఇంకొకరు గుండె ఆగి చనిపోయిన సంగతి తెలిసిందే. ఇంత జరిగినా ప్రభుత్వంలో మార్పు రాలేదు. ‘జన్మభూమి మా ఊరు’ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ పూర్తిగా తమ పార్టీ కార్యక్రమంగా నిర్వహించింది. పార్టీ నాయకులను వేదికపైన కూర్చోపెట్టేందుకు ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చిన జిల్లా మంత్రి, ఇతర శాసనసభ్యులు జన్మభూమి ముగిసిన తర్వాత దీనిపై సమీక్షించిన పాపాన పోలేదు.
బదిలీలతో బిజీబిజీ...ఎవరూ అతీగతీ
Published Mon, Nov 17 2014 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 4:35 PM
Advertisement
Advertisement