పశ్చిమ డెల్టాలో ఫిషరీస్‌ వర్సిటీ  | University of Fisheries At West Godavari District | Sakshi
Sakshi News home page

పశ్చిమ డెల్టాలో ఫిషరీస్‌ వర్సిటీ 

Published Thu, Jul 22 2021 3:17 AM | Last Updated on Thu, Jul 22 2021 3:17 AM

University of Fisheries At West Godavari District - Sakshi

సాక్షి, అమరావతి: ఆక్వా రాజధాని ‘పశ్చిమ డెల్టా’లో ఫిషరీస్‌ యూనివర్సిటీ నెలకొల్పే దిశగా రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సరిపల్లి–లిఖితపూడి గ్రామాల మధ్య ఈ వర్సిటీ ఏర్పాటు కాబోతోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 40 ఎకరాల భూమిని కేటాయించింది. దీనికి రూ.332 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.100 కోట్లు కేటాయించింది. వర్సిటీ నిర్మాణానికి సెప్టెంబర్‌ మొదటి వారంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.  

నిపుణుల కొరత తీర్చేలా.. 
చేపలు, రొయ్యల ఉత్పత్తిలో మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా చేపల ఉత్పత్తిలో 29 శాతం, రొయ్యల ఉత్పత్తిలో 68 శాతం వాటా ఏపీదే. మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లోనూ 40 శాతం వాటా రాష్ట్రానిదే. రాష్ట్ర స్థూల ఆదాయంలో 8.67 శాతం (రూ.55,294 కోట్లు) ఈ రంగం నుంచే వస్తోంది. గడచిన పదేళ్లలో సముద్ర చేపల ఉత్పత్తి రెట్టింపు కాగా, రొయ్యల ఉత్పత్తి నాలుగు రెట్లు, సంప్రదాయ చెరువుల్లో చేపల ఉత్పత్తి రెండున్నర రెట్లు, ఉప్పు, మంచినీటి చెరువుల్లో రొయ్యల ఉత్పత్తి 15 రెట్లు పెరిగింది. ఈ రంగంపై 8.50 లక్షల మంది మత్స్యకార కుటుంబాలతో పాటు 26.50 లక్షల మంది ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. ఏటా 11 శాతం వృద్ధిరేటు సాధిస్తున్న ఆక్వా రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ రంగంలో నిపుణుల కొరతను తీర్చడంతోపాటు లోతైన పరిశోధనలు చేపట్టడం.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో ప్రత్యేకంగా ఫిషరీస్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తోంది. 

మరో రెండు కళాశాలల ఏర్పాటు 
ఈ వర్సిటీకి అనుబంధంగా శ్రీకాకుళం జిల్లా పలాస, కృష్ణా జిల్లా కైకలూరు వద్ద కూడా ఫిషరీస్‌ కళాశాలలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వర్సిటీకి అనుబంధంగా మరిన్ని పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు కాబోతున్నాయి. సర్కారు చర్యల వల్ల ఆక్వా రంగంలో పరిశోధనలు పెరగడమే కాకుండా నిరుద్యోగ యువతకు విద్యా, ఉద్యోగ అవకాశాలు మెరుగుపర్చడంతోపాటు ఆక్వా రంగంపై ఆధారపడిన వారి నైపుణ్యతను పెంపొందించేందుకు అవకాశం కలుగుతుంది. 

దేశంలోనే మూడో వర్సిటీ 
దేశంలోని కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రమే ఫిషరీస్‌ యూనివర్సిటీలు ఉన్నాయి. ఏపీలో నిర్మిస్తున్న ఈ వర్సిటీ దేశంలోæ మూడోది కానుంది. ఇందుకు అవసరమైన భూమిని రెవెన్యూ శాఖ ఇప్పటికే గుర్తించి ఇటీవలే మత్స్య శాఖకు అప్పగించింది. తొలి దశలో ఇచ్చే రూ.100 కోట్లతో పరిపాలనా భవనం, అకడమిక్‌ బ్లాక్, విద్యార్థులు, విద్యార్థినులకు వేర్వేరుగా హాస్టల్స్, రైతులకు శిక్షణ కేంద్రం, మల్టీపర్పస్‌ బిల్డింగ్‌ వంటి సదుపాయాలు కల్పిస్తారు. రాష్ట్ర విద్య, సంక్షేమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ పర్యవేక్షణలో అంతర్జాతీయ ప్రమాణాలతో వర్సిటీని నిర్మించేందుకు త్వరలోనే టెండర్లు పిలవనున్నారు.

టెండర్లు పిలిచేందుకు కసరత్తు 
ఫిషరీస్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.100 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో పరిపాలన, విద్యా సంబంధిత భవనాలతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు త్వరలో టెండర్లు పిలవబోతున్నాం.  
– కె.కన్నబాబు, కమిషనర్, మత్స్య శాఖ  

వచ్చే విద్యా సంవత్సరం నుంచే.. 
ఫిషరీస్‌ యూనివర్సిటీ ప్రాంగణంలో కొత్తగా మత్స్య కళాశాల కూడా ఏర్పాటు కానుంది. తొలుత బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ సైన్సెస్‌ కోర్సుతో వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ తరువాత మాస్టర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ సైన్సెస్, పీహెచ్‌డీ కోర్సులను సైతం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీహెచ్‌డీలలో ఆక్వా కల్చర్, అక్వాటిక్, యానిమల్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్, ఫిషరీస్‌ రిసోర్సెస్‌ మేనేజ్‌మెంట్‌ తదితర కోర్సులు ఉంటాయని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం నెల్లూరు జిల్లా ముత్తుకూరు వద్ద మత్స్య కళాశాల, అవనిగడ్డ మండలం బావదేవరపల్లి వద్ద ఫిషరీస్‌ పాలిటెక్నిక్‌ కళాశాల ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఉప్పు నీటి రొయ్యలు, బిక్కవోలు మండలం బలభద్రపురంలో మంచినీటి చేపల పరిశోధనా కేంద్రాలు ఉండగా.. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి వద్ద మంచినీటి చేపలు, రొయ్యల పరిశోధనా కేంద్రం ఉంది. ఇవన్నీ ఇకపై ఫిషరీస్‌ యూనివర్సిటీకి అనుబంధంగా పనిచేస్తాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement