వనరులు ఫుల్‌.. అవకాశాలు నిల్‌ | Natural Resources In Mulugu District | Sakshi
Sakshi News home page

వనరులు ఫుల్‌.. అవకాశాలు నిల్‌

Published Thu, Aug 22 2019 10:58 AM | Last Updated on Thu, Aug 22 2019 10:58 AM

Natural Resources In Mulugu District  - Sakshi

గనుల్లో ప్రతీ రోజు లక్షల టన్నుల ముడిసరుకు తవ్వితీసి, వేలాది లారీల్లో పక్క రాష్ట్రాల్లోని సిమెంట్‌ పరిశ్రమలకు తరలిస్తున్నారు.  దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు త్రైమాసికంగా రూ.కోట్లల్లో పన్నుల రూపంలో ఆదాయం సమకూరుతోంది. కానీ స్థానికంగా ఎలాంటి ఉపయోగం లేకుండా పోతోంది. చదువుకున్న ఈ ప్రాంత యువత వేలల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగంతో సతమతవుతున్నారు. ఇక్కడే సిమెంట్‌ పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడడంతో పాటు ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉంది. సిమెంట్‌ పరిశ్రమ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఉన్నప్పటికీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ విషయం తెరపైకి రావడం లేదని తెలిసింది.

మల్లంపల్లి, రామచంద్రాపురంలో ఎర్రమట్టి గనులు
సాక్షి ములుగు: సహజ వనరుల ఖిల్లా ములుగు జిల్లా. కానీ వనరుల వినియోగంలో మాత్రం నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. ములుగు మండలం మల్లంపల్లి నుంచి వరంగల్‌ రూరల్‌ జిల్లా నల్లబెల్లి సరిహద్దు వరకు, మరో వైపు శాయపేట మండల సరిహద్దు వరకు వేలాది ఎకరాల్లో ఎర్రమట్టి గనులు విస్తారంగా విస్తరించి ఉన్నాయి. ఇక్కడ 30పైగా క్వారీల నిర్వహణ జరుగుతుండగా 220 హెక్టార్లకు పైగా భూముల్లో తవ్వకాలు చేపడుతున్నారు. ప్ర«ధానంగా ఎర్రమట్టి, బాక్సైట్, డోలమైట్, క్రే, లాటరైట్, ఐరన్‌ఓర్‌ వంటి నిక్షేపాలు తవ్వి తీస్తున్నారు.  

ఐరన్‌ ఓర్, ఇసుక, నీరు.. 
సిమెంట్‌ తయారీలో కాల్షియం, సిలికాన్, అల్యూమినీయం, ఐరన్‌ఓర్, ఇసుక, నీరు, సున్నపురాయి ప్రధానమైనవి. ఇందులో మల్లంపల్లి ఎర్రమట్టి క్వారీలో పుష్కలమైన ఐరన్‌ఓర్‌ ఉంది. అలాగే జిల్లా తలాపున గోదావరి పారుతోంది. మల్లంపల్లి పరీవాహక ప్రాంతానికి కేవలం 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఇసుకతో పాటు, నీటి లభ్యత ఆశించే స్థాయిలో ఉన్నాయి.  అలాగే మాన్‌సింగ్‌ తండా సమీపంలో పరిశ్రమ ఏర్పాటుకు వందల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. రావాణా పరంగా చూస్తే ఇక్కడి నుంచి వరంగల్‌ కేంద్రం కేవలం 37 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. వరంగల్, కాజీపేటలో  రైల్వే కేంద్రాలు రవాణాకు మరింత సౌలభ్యంగా ఉన్నాయి. ఇన్ని రకాల సౌకర్యాలు ఉన్న మల్లంపల్లి, రామచంద్రాపురం ఏరియాలో సిమెంట్‌ పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఏజెన్సీ అభివృద్ధి చెందుతుంది.   

క్వారీలన్నీ లీజు.. 
ప్రస్తుతం మల్లంపల్లి, రామచంద్రాపురం సమీపంలోని ఎర్రమట్టి క్వారీలు అన్నీ లీజులో నడుస్తున్నాయి. 20 సంవత్సరాల చొప్పున గనుల శాఖ వ్యాపారులకు అప్పగించింది. ఇదంతా పక్కనబెట్టి నేరుగా ప్రభుత్వమే తవ్వకాలు జరిపి సిమెంట్‌ ముడి సరుకుకు అవసరమైన ఐరన్‌ఓర్, నాణ్యమైన ఎర్రమట్టిని సేకరించి పరిశ్రమకు ప్రోత్సహిస్తే బాగుంటుందని నిరుద్యోగ యువత కోరుతుంది. అనుకున్న మేర ప్రభుత్వం చొరవ తీసుకుంటే సుమరు 3వేల నుంచి 5వేల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయి.

స్థానిక వనరులతో పరిశ్రమ ఏర్పాటు చేయాలి 
మల్లంపల్లి. రామచంద్రాపురం ప్రాంతాల్లో లభ్యమయ్యే వనరుల ఆధారంగా వీలును బట్టి చిన్న, భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు రావాలి. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇక్కడున్న ముడిసరుకును బయటి ప్రాంతాలకు తరలించి పన్నులు వసూలు చేస్తున్నారే తప్ప అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. కొత్త పరిశ్రమలను ప్రోత్సహిస్తామని చెబుతున్న ప్రభుత్వం మల్లంపల్లి ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకోవాలి.        
– ధనసరి సీతక్క, ఎమ్మెల్యే, ములుగు

ఉపాధి కల్పించాలి 
మల్లంపల్లిలో సిమెంట్‌ ఆధారిత, ఖనిజాధార పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. స్థానికంగా ఎలాంటి అవకాశాలు లేక యువత హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌ ప్రాంతాలలోని పరిశ్రమల్లో పని చేయడానికి వలస వెళ్తున్నారు.
– మొర్రిరాజు యాదవ్, మల్లపల్లి  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement