అయినా ఆగటం లేదు | no control on sand mafia | Sakshi
Sakshi News home page

అయినా ఆగటం లేదు

Published Wed, Apr 26 2017 12:58 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

అయినా ఆగటం లేదు - Sakshi

అయినా ఆగటం లేదు

సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. అధికార పార్టీ అండతో అనధికార ర్యాంపుల్లోనూ తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. పర్యావరణ అనుమతులు కూడా తీసుకోవడం లేదు. గోదావరి నది పొడవునా అక్రమ తవ్వకాలు పెద్దఎత్తున కొనసాగుతున్నాయి. చిత్తూరు జిల్లా ఏర్పేడులో ఇసుక అక్రమ దందాను నిలుపుదల చేయాలనే డిమాండ్‌తో అక్కడి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నా చేసిన గ్రామస్తులపైకి లారీ దూసుకెళ్లిన ఘటనలో 17 మంది దుర్మరణం పాలవగా, మరో 15 మంది గాయపడిన విషయం విదితమే. ఈ ఘటన తర్వాత కూడా అ«ధికార పార్టీ నేతల వైఖరిలో మార్పు రాలేదు. 
 
అడుగడుగునా అక్రమ దందాయే : జిల్లావ్యాప్తంగా చిన్నాపెద్ద కలిపి మొత్తం 42 ఇసుక ర్యాంపులు ఉన్నాయి. వీటిలో సుమారు 1.10 కోట్ల క్యూబిక్‌ మీటర్లకు పైగా ఇసుక తవ్వారు. తనిఖీలు తూతూమంత్రంగా సాగుతున్నాయి. పర్యావరణ అనుమతులు లేకుండానే చాలా ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయి. కొవ్వూరు, వాడపల్లి, సిద్ధాంతం, నరసాపురం రేవుల్లో జేసీబీలను ఉపయోగించి తవ్వకాలు జరుపుతున్నారు. యూనిట్‌ ఇసుక రూ.500 నుంచి రూ.వెయ్యి వరకూ ధర పలుకుతోంది. ఇసుక తరలింపుదారులు పంచాయతీలకు ఎటువంటి శిస్తు చెల్లించడం లేదు. ఇటీవల తమ్మిలేరు నుంచి ఇసుక తరలిస్తున్న వారిని అడ్డుకున్న స్థానికులపై తెలుగుదేశం నేతలు దాడులకు తెగబడ్డారు. ఉచితంగా ఇసుక తీసుకెళ్లే వాహనాలను స్థానిక నాయకులు అడ్డుకుంటూ.. తాము నిర్ణయించిన ధరకు కొనుగోలు చేయాలని హుకుం జారీ చేస్తున్నారు. లేకుంటే ఇసుక తరలించే లారీలపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారు. నిడదవోలు మండలం పందలపర్రు ఇసుక ర్యాంపును ఎటువంటి ఉత్తర్వులు లేకుండా టీడీపీ నాయకుల సహకారంతో వారం రోజులపాటు అనధికారికంగా నిర్వహించారు. కూలీలతో తవ్వకాలు చేయించాల్సి రావడంతో గిట్టుబాటు కావడం లేదని మూసివేశారు. మరోవైపు పెండ్యాల ఇసుక ర్యాంపులో 20 రోజులుగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. కూలీలతో ఎగుమతి  చేయిస్తుండటంతో అక్కడ భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. యూనిట్‌కు రూ.300, నిర్వాహణ చార్జీలంటూ రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారు. పందలపర్రు శివారు రావివారిపాలెంలో టీడీపీ నాయకులు బరితెగించారు. అనధికారికంగా ఇసుక ర్యాంపు ఏర్పాటు చేశారు. ఇందుకోసం గ్రామం నుంచి ర్యాంపు వరకు రహదారి సైతం నిర్మించారు. పొక్లెయిన్లతో నదిలోంచి ఇసుక తవ్వి అనధికారికంగా ఏర్పాటు చేసిన ర్యాంపులోకి డంప్‌ చేస్తున్నారు. ఇక్కడ నుంచి గుట్టుచప్పుడు కాకుండా రాత్రివేళ భారీ వాహనాల్లో తరలిస్తున్నారు. మూడు యూనిట్లకు రూ.2 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని టీడీపీ నాయకులు వెనుక ఉండి నడిపిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement