సాక్షి, అమరావతి: సహజ మత్స్య సంపదను వృద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంచినీటి వనరుల్లో పెద్ద ఎత్తున చేప పిల్లలను వదలగా.. ఈ ఏడాది తొలిసారి రొయ్య పిల్లలనూ వదిలింది. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీరప్రాంతం ఉండగా, 5 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. రాష్ట్రంలో పెద్ద రిజర్వాయర్ల విస్తీర్ణం 3.10 లక్షల ఎకరాలు కాగా, చిన్న, మధ్య తరహా రిజర్వాయర్ల విస్తీర్ణం మరో 4.02 లక్షల ఎకరాలుగా ఉంది. మత్స్య సాగుకు అనువైన మైదాన ప్రాంతంలో 11 శాతంలో ఆక్వా కల్చర్ ఉండగా, మరో 11 శాతం విస్తీర్ణంలో పంచాయతీ, మైనర్ ఇరిగేషన్ చెరువులున్నాయి.
ఇక రిజర్వాయర్ ప్రాంతం 9% ఉండగా, నదులు, కాలువలు 63 శాతం మేర విస్తరించి ఉన్నాయి. ప్రస్తుతం 1.86 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పెద్ద రిజర్వాయర్లు, 402 ఎకరాల్లో చిన్న, మధ్య తరహా రిజర్వాయర్లలో మాత్రమే చేపల పెంపకం సాగుతోంది. వీటిలో మత్స్య దిగుబడులు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీంతో పట్టుబడి ద్వారా 2018–19లో 13.42 లక్షల టన్నుల దిగుబడి రాగా, 2019–20లో 15.91 లక్షల టన్నులు, 2020–21లో 18.46 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. గతేడాది పశ్చిమ గోదావరి జిల్లాలో 5,88 లక్షల టన్నులు, నెల్లూరులో 3.06 లక్షల టన్నులు, తూర్పుగోదావరి జిల్లాలో 1.96 లక్షల టన్నులు, విశాఖలో 1.77 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులు పట్టుబడి చేయగలిగారు. ఇలా సహజ సిద్ధంగా పెరిగే మత్స్య ఉత్పత్తుల దిగుబడులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ప్రధాన రిజర్వాయర్లలోకి 6.66 లక్షల రొయ్య పిల్లలు
ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 35 రిజర్వాయర్లలో 2.08 కోట్ల చేప పిల్లల(బొచ్చెలు, ఎర్రమోసు, శీలావతి)ను వదిలారు. అత్యధికంగా వెలుగొండ రిజర్వాయర్‌లో 29 లక్షలు, గోదావరి బ్యారేజ్‌లో 15.25 లక్షలు, ఏలేరు రిజర్వాయర్‌లో 14.39 లక్షలు, ఆరానియార్ రిజర్వాయర్‌లో 12 లక్షలు, వెలిగాలు, పేరూరు రిజర్వాయర్లలో 11.45 లక్షలు, నాగార్జున సాగర్, ప్రకాశం రిజర్వాయర్లలో 10 లక్షల చొప్పున చేప పిల్లలను వదిలారు. ఇక తొలిసారి 5.66 లక్షల వెనామియా జాతికి చెందిన రొయ్య పిల్లలను ప్రధాన రిజర్వాయర్లలో వదిలారు. శ్రీకాకుళం జిల్లాలో 51,450, విజయనగరం జిల్లాలో 1,80,180, విశాఖలో 1,20,120, తూర్పుగోదావరిలో 83,400, ప్రకాశం జిల్లాలో 1.31 లక్షల చొప్పున రొయ్య పిల్లలను వదిలారు. వీటి కోసం ఇప్పటి వరకూ కోటిన్నర వరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment