డెల్టాలో సాగు చేస్తున్న వనామి రొయ్య
ఆకివీడు: ఈక్వెడార్.. ఓ బుల్లి దేశం. అంతర్జాతీయంగా రొయ్యల మార్కెట్‌కు పెద్ద దెబ్బే కొట్టింది. మొత్తం ప్రపంచ దేశాలను కుదిపేస్తోంది. నాణ్యతతో కూడిన రొయ్యలను తక్కువ ధరకు ఎగుమతి చేస్తుండటంతో ఇతర దేశాల రొయ్యల ధరలు పడిపోయాయి. ఈ ప్రభావం రాష్ట్రంలోని రొయ్యల ఎగుమతులపైనా పడింది. ధరలు తగ్గిపోయి, రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
మొత్తం ప్రపంచవ్యాప్తంగా రొయ్యల ఉత్పత్తి 5049.5 మెట్రిక్ టన్నులు. ఇందులో ఇండియా వాటా 700 మెట్రిక్ టన్నులు.మన దేశం నుంచి ప్రాసెసింగ్ జరిగిన రొయ్యలు అమెరికా, చైనా, జపాన్, బంగ్లాదేశ్ దేశాలకు ఎగుమతి అవుతాయి. ఆ దేశాల్లో ప్యాకింగ్ చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఇటీవలి కాలంలో రొయ్యల సాగులో ఈక్వెడార్ తారాజువ్వలా దూసుకొచ్చింది.
గత ఆరు నెలల్లో ఏకంగా 1,150 మెట్రిక్ టన్నుల రొయ్యలు ఉత్పత్తి చేసింది. దీనిలో 1,010 మెట్రిక్ టన్నులు వనామి, మిగిలినవి టైగర్ రొయ్య. 2021లో ఈక్వెడార్ ఉత్పత్తులు 1,010 మెట్రిక్ టన్నులు మాత్రమే. అయితే, గత ఆరు నెలల్లోనే అక్కడ అంతకు మించి రొయ్యల ఉత్పత్తి జరిగింది. పైగా, ఈక్వెడార్‌లో వేగంగా యాంత్రీకరణ జరిగి, రొయ్యల ఉత్పత్తి వ్యయం బాగా తగ్గింది.
ఎకరాకు 50 వేల పిల్లలను మాత్రమే పెంపకానికి వినియోగిస్తారు. ఎగుమతుల ఖర్చు తక్కువ. ఆరు నెలల్లోనే కౌంట్‌కు వస్తున్నాయి. ఈక్వెడార్‌లో తల్లి రొయ్య నుంచి 3 నుంచి 5 సార్లు మాత్రమే సీడ్ తీస్తారు. దీంతో నాణ్యమైన సీడ్ రైతులకు లభిస్తుంది. ఇది వైరస్‌లు, వ్యాధులను తట్టుకుంటుంది. దీంతో ఉత్పత్తి నాణ్యత ఎక్కువగా ఉంది. మన దేశంలో తల్లి రొయ్య నుంచి 10 నుంచి 15 సార్లు సీడ్ తీస్తున్నారు. దీంతో నాసిరకం, ఇమ్యూనిటీ లేని రొయ్య సీడ్ వస్తోంది. దీనినే పెంపకందారులకు సరఫరా చేస్తున్నారు.
ఇటువంటి రొయ్యలు వ్యాధులు, వైట్‌గట్ తదితర వైరస్‌ల బారిన పడుతున్నాయి. 30, 40, 50 కౌంట్ రొయ్యల పెంపకానికి మన దేశంలో.. ముఖ్యంగా డెల్టా ప్రాంతాల్లో రూ.250 పైబడి ఖర్చవుతుంది. దీంతో పోలిస్తే ఈక్వెడార్‌లో అన్ని కౌంట్ రొయ్యలు రూ.100 తక్కువకు లభిస్తున్నాయి. దీంతో మన దేశం రొయ్యలకు ఆర్డర్లు తగ్గిపోయాయి. చైనా, అమెరికా దేశాల నుంచి ఆర్డర్లు రావడంలేదని బయ్యర్లు వాపోతున్నారు.
మంచి ధర లభించేలా ప్రభుత్వ చర్యలు..
రొయ్య రైతులను ఆదుకునేందుకు గత రెండు నెలలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. రొయ్య ధరలు తగ్గకుండా చూసేందుకు ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ యూనిట్ యజమానులతో సంప్రదింపులు జరిపేందుకు ముగ్గురు మంత్రులతో కూడిన సాధికార కమిటీని నియమించింది. నిపుణుల కమిటీని వేసి పరిశీలన జరుపుతోంది.
సాధికార కమిటీ నిత్యం రొయ్యల మార్కెట్‌ను సమీక్షిస్తోంది. ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతి సంస్థలు, సీడ్, ఫీడ్ ఉత్పత్తిదారులతో సంప్రదింపులు జరుపుతోంది. మేత ధరలు తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా నాణ్యమైన రొయ్య ఉత్పత్తికి చర్యలు తీసుకుంది. దీనివల్ల కొద్ది రోజుల్లోనే మన రాష్ట్రంలోని రొయ్యలకు కూడా మంచి డిమాండ్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అక్కడ ఉత్పత్తి వ్యయం తక్కువ.. నాణ్యత ఎక్కువ
అంతర్జాతీయ రొయ్యల మార్కెట్‌లో ఈక్వెడార్ విపరీతంగా పోటీనిస్తోంది. అక్కడ ఉత్పత్తి వ్యయం తక్కువ. నాణ్యత ఎక్కువ. పోటీని తట్టుకునేందుకు మన దేశంలో నాణ్యమైన రొయ్య సీడు రైతులకు అందజేయాలి. మేత, మందుల ధరలను నియంత్రించాలి. ఉత్పత్తి వ్యయం బాగా తగ్గాలి. ఆధునిక పద్ధతులు వినియోగించాలి.
ప్రభుత్వ సబ్సిడీలు కొనసాగించాలి. ఆక్వా రైతులకు తర్ఫీదు ఇవ్వాలి. ఈ ఏడాది చివరి నాటికి ఈక్వెడార్ ఉత్పత్తులు రెండువేల మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందని అంచనా. అప్పటికల్లా మనమూ పోటీని తట్టుకొని నిలబడగలగాలి.
– గోవిందరావు, ఆక్వా కన్సల్టెంట్, ఆకివీడు, పశ్చిమగోదావరి జిల్లా
ఒడుదుడుకులు తాత్కాలికమే
ఆక్వా మార్కెట్‌లో ఒడుదుడుకులు తాత్కాలికమే. రొయ్య ధరలు తగ్గకుండా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంది. మంత్రుల కమిటీ, నిపుణుల కమిటీలను వేసి పరిశీలన చేస్తోంది. ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులతో సంప్రదింపులు జరుపుతోంది. త్వరలోనే రొయ్యలకు మంచి ధర లభిస్తుంది.
–కేఎస్‌వీ నాగ లింగాచారి, జిల్లా మత్స్య శాఖ, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment