Prawns cultivation
-
రొయ్యల మార్కెట్‌ను కుదిపేస్తున్న ‘ఈక్వెడార్’
ఆకివీడు: ఈక్వెడార్.. ఓ బుల్లి దేశం. అంతర్జాతీయంగా రొయ్యల మార్కెట్‌కు పెద్ద దెబ్బే కొట్టింది. మొత్తం ప్రపంచ దేశాలను కుదిపేస్తోంది. నాణ్యతతో కూడిన రొయ్యలను తక్కువ ధరకు ఎగుమతి చేస్తుండటంతో ఇతర దేశాల రొయ్యల ధరలు పడిపోయాయి. ఈ ప్రభావం రాష్ట్రంలోని రొయ్యల ఎగుమతులపైనా పడింది. ధరలు తగ్గిపోయి, రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా రొయ్యల ఉత్పత్తి 5049.5 మెట్రిక్ టన్నులు. ఇందులో ఇండియా వాటా 700 మెట్రిక్ టన్నులు.మన దేశం నుంచి ప్రాసెసింగ్ జరిగిన రొయ్యలు అమెరికా, చైనా, జపాన్, బంగ్లాదేశ్ దేశాలకు ఎగుమతి అవుతాయి. ఆ దేశాల్లో ప్యాకింగ్ చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఇటీవలి కాలంలో రొయ్యల సాగులో ఈక్వెడార్ తారాజువ్వలా దూసుకొచ్చింది. గత ఆరు నెలల్లో ఏకంగా 1,150 మెట్రిక్ టన్నుల రొయ్యలు ఉత్పత్తి చేసింది. దీనిలో 1,010 మెట్రిక్ టన్నులు వనామి, మిగిలినవి టైగర్ రొయ్య. 2021లో ఈక్వెడార్ ఉత్పత్తులు 1,010 మెట్రిక్ టన్నులు మాత్రమే. అయితే, గత ఆరు నెలల్లోనే అక్కడ అంతకు మించి రొయ్యల ఉత్పత్తి జరిగింది. పైగా, ఈక్వెడార్‌లో వేగంగా యాంత్రీకరణ జరిగి, రొయ్యల ఉత్పత్తి వ్యయం బాగా తగ్గింది. ఎకరాకు 50 వేల పిల్లలను మాత్రమే పెంపకానికి వినియోగిస్తారు. ఎగుమతుల ఖర్చు తక్కువ. ఆరు నెలల్లోనే కౌంట్‌కు వస్తున్నాయి. ఈక్వెడార్‌లో తల్లి రొయ్య నుంచి 3 నుంచి 5 సార్లు మాత్రమే సీడ్ తీస్తారు. దీంతో నాణ్యమైన సీడ్ రైతులకు లభిస్తుంది. ఇది వైరస్లు, వ్యాధులను తట్టుకుంటుంది. దీంతో ఉత్పత్తి నాణ్యత ఎక్కువగా ఉంది. మన దేశంలో తల్లి రొయ్య నుంచి 10 నుంచి 15 సార్లు సీడ్ తీస్తున్నారు. దీంతో నాసిరకం, ఇమ్యూనిటీ లేని రొయ్య సీడ్ వస్తోంది. దీనినే పెంపకందారులకు సరఫరా చేస్తున్నారు. ఇటువంటి రొయ్యలు వ్యాధులు, వైట్‌గట్ తదితర వైరస్ల బారిన పడుతున్నాయి. 30, 40, 50 కౌంట్ రొయ్యల పెంపకానికి మన దేశంలో.. ముఖ్యంగా డెల్టా ప్రాంతాల్లో రూ.250 పైబడి ఖర్చవుతుంది. దీంతో పోలిస్తే ఈక్వెడార్‌లో అన్ని కౌంట్ రొయ్యలు రూ.100 తక్కువకు లభిస్తున్నాయి. దీంతో మన దేశం రొయ్యలకు ఆర్డర్లు తగ్గిపోయాయి. చైనా, అమెరికా దేశాల నుంచి ఆర్డర్లు రావడంలేదని బయ్యర్లు వాపోతున్నారు. మంచి ధర లభించేలా ప్రభుత్వ చర్యలు.. రొయ్య రైతులను ఆదుకునేందుకు గత రెండు నెలలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. రొయ్య ధరలు తగ్గకుండా చూసేందుకు ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ యూనిట్ యజమానులతో సంప్రదింపులు జరిపేందుకు ముగ్గురు మంత్రులతో కూడిన సాధికార కమిటీని నియమించింది. నిపుణుల కమిటీని వేసి పరిశీలన జరుపుతోంది. సాధికార కమిటీ నిత్యం రొయ్యల మార్కెట్‌ను సమీక్షిస్తోంది. ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతి సంస్థలు, సీడ్, ఫీడ్ ఉత్పత్తిదారులతో సంప్రదింపులు జరుపుతోంది. మేత ధరలు తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా నాణ్యమైన రొయ్య ఉత్పత్తికి చర్యలు తీసుకుంది. దీనివల్ల కొద్ది రోజుల్లోనే మన రాష్ట్రంలోని రొయ్యలకు కూడా మంచి డిమాండ్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అక్కడ ఉత్పత్తి వ్యయం తక్కువ.. నాణ్యత ఎక్కువ అంతర్జాతీయ రొయ్యల మార్కెట్లో ఈక్వెడార్ విపరీతంగా పోటీనిస్తోంది. అక్కడ ఉత్పత్తి వ్యయం తక్కువ. నాణ్యత ఎక్కువ. పోటీని తట్టుకునేందుకు మన దేశంలో నాణ్యమైన రొయ్య సీడు రైతులకు అందజేయాలి. మేత, మందుల ధరలను నియంత్రించాలి. ఉత్పత్తి వ్యయం బాగా తగ్గాలి. ఆధునిక పద్ధతులు వినియోగించాలి. ప్రభుత్వ సబ్సిడీలు కొనసాగించాలి. ఆక్వా రైతులకు తర్ఫీదు ఇవ్వాలి. ఈ ఏడాది చివరి నాటికి ఈక్వెడార్ ఉత్పత్తులు రెండువేల మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందని అంచనా. అప్పటికల్లా మనమూ పోటీని తట్టుకొని నిలబడగలగాలి. – గోవిందరావు, ఆక్వా కన్సల్టెంట్, ఆకివీడు, పశ్చిమగోదావరి జిల్లా ఒడుదుడుకులు తాత్కాలికమే ఆక్వా మార్కెట్లో ఒడుదుడుకులు తాత్కాలికమే. రొయ్య ధరలు తగ్గకుండా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంది. మంత్రుల కమిటీ, నిపుణుల కమిటీలను వేసి పరిశీలన చేస్తోంది. ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులతో సంప్రదింపులు జరుపుతోంది. త్వరలోనే రొయ్యలకు మంచి ధర లభిస్తుంది. –కేఎస్వీ నాగ లింగాచారి, జిల్లా మత్స్య శాఖ, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా -
రాష్ట్రమంతా ఒకేలా కొనుగోలు చేయాలి
సాక్షి, అమరావతి: ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు రాష్ట్రమంతా ఒకేరీతిలో రొయ్యల కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, డాక్టర్ సీదిరి అప్పలరాజు అధికారులను ఆదేశించారు. 100 కౌంట్ రొయ్యల ధర రూ.210కి తగ్గడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఈ ధర కంటే తక్కువగా కొనుగోలు చేసే ప్రాసెసింగ్ కంపెనీలను ఉపేక్షించబోమన్నారు. ఆక్వా సాధికారత కమిటీ సమావేశం బుధవారం మంత్రి పెద్దిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో జరిగింది. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు తీరును అధికారులు మంత్రులకు వివరించారు. ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ వడ్డి రఘురాం మాట్లాడుతూ 100 కౌంట్ రూ.210 చొప్పున కొనుగోలు చేయాలన్న గత కమిటీ భేటీలో నిర్ణయాన్ని మెజార్టీ ప్రాసెసింగ్ కంపెనీలు పాటిస్తున్నాయని, కొన్ని కంపెనీలు మాత్రం నేటికీ రూ.190 నుంచి రూ.200 చొప్పున కొనుగోలు చేస్తున్నాయని చెప్పారు. అటువంటి కంపెనీలు, వ్యాపారులతో నిత్యం సంప్రదిస్తూ ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, కమిషనర్ కన్నబాబు మాట్లాడుతూ సాధికారత కమిటీ సమావేశాల్లో మంత్రులు ఇచ్చిన ఆదేశాల మేరకు సీడ్, ఫీడ్ రేట్లు, ఆక్వా ఉత్పత్తుల కొనుగోలు ధరలపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించినట్లు చెప్పారు. సీడ్, ఫీడ్ రేట్లను ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ పోర్టల్‌లో ఉంచుతున్నామన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌తోపాటు దేశీయంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ధరలను కూడా పోర్టల్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఆక్వారంగానికి ప్రభుత్వం చేయూత మంత్రులు మాట్లాడుతూ ఆక్వా రంగానికి ప్రభుత్వం చేయూతనిస్తోందని చెప్పారు. ఆక్వా రైతులు, ప్రాసెసింగ్ యూనిట్లు, సీడ్, ఫీడ్ తయారీదారులు సమన్వయంతో ముందుకు సాగితేనే ఆక్వారంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందన్నారు. ఆక్వారంగం సమస్యల పరిష్కారం కోసమే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సాధికారత కమిటీ ఏర్పాటైందని చెప్పారు. ధరల విషయంలో నిరంతరం అధికారుల పర్యవేక్షణ ఉండాలని, సమస్య ఏర్పడిన వెంటనే స్పందించాలని ఆదేశించారు. రొయ్యల ధరల స్థిరీకరణ, సీడ్, ఫీడ్ రేట్లు, నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థలను కలిగి ఉన్న రాష్ట్రం మనదేనని చెప్పారు. అత్యధికంగా ఆక్వా ఎగుమతులు చేస్తున్న రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకున్నామన్నారు. అంతర్జాతీయ మార్కెట్ల కారణంగా మన రాష్ట్రంలో ఆక్వారేట్లు కొన్నిసార్లు తగ్గిపోతున్నాయని, స్టోరేజీ అవకాశాలను పరిశీలించి అటువంటి సమయాల్లో ధరలను స్థిరీకరించేందుకు పరిశీలించాలని వారు సూచించారు. ఈ సమావేశంలో పర్యావరణం, అటవీ సైన్స్, సాంకేతిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్‌కుమార్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
Aqua Farmers: ఆక్వా రైతులను ముంచేస్తున్నారు..
వ్యాపారులంతా ఒక్కటయ్యారు. సిండికేట్‌గా మారి ఆక్వా రైతులను నిట్టనిలువునా ముంచేస్తున్నారు. 40 కౌంట్ రొయ్యలను రూ.395కి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. వ్యాపారులు మాత్రం రూ.330కే కొనుగోలు చేస్తున్నారు. నిర్ణీత ధరలకే రైతుల నుంచి రొయ్యలు కొనుగోలు చేయాలని స్పష్టం చేసినా.. వారిలో ఎలాంటి మార్పు కనిపించడంలేదు. సంబంధిత శాఖల అధికారులు సైతం దృష్టి సారించకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యాపారులు, ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానుల తీరుతో సాగుకు పెట్టిన పెట్టుబడి రాక ఆక్వా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది సాక్షి ప్రతినిధి, ఒంగోలు: డాలర్ల పంటగా పేరొందిన ఆక్వా సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోంది. గత ప్రభుత్వ నిర్ణయాలతో తీవ్రంగా నష్టపోయిన వీరిని ఆదుకునేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ రాయితీలు ప్రకటించారు. వాణిజ్యపరంగా అండగా నిలిచేందుకు ఆక్వా హబ్‌లు, మార్కెట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కానీ, వ్యాపారులు మాత్రం రైతులను అడ్డగోలుగా దోచేస్తున్నారు. ఎంతగా అంటే.. ఒక్కో రైతు రూ.లక్షల్లో నష్టపోయేంత. రాష్ట్ర వ్యాప్తంగా రొయ్యల రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించింది. ఈ నెల 17వ తేదీ విజయవాడలో అధికారులు, మంత్రులు, రైతులు, వ్యాపారులతో ఉమ్మడిగా సమావేశం నిర్వహించింది. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే రొయ్యలు కొనుగోలు చేయాలని వ్యాపారులకు దిశానిర్దేశం చేసింది. సమావేశం ముగిసి పదిరోజులు కావస్తున్నా వ్యాపారులు, రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానుల్లో కనీస మార్పు రాలేదు. దానికితోడు జిల్లాలోని అధికారులు సైతం రొయ్యల మార్కెట్‌పై దృష్టి సారించకపోవడం కూడా ప్రధాన కారణమని విమర్శలూ వినిపిస్తున్నాయి. విజయవాడలో వ్యాపారులతో ప్రభుత్వం చర్చలు జరిపి కనీస మద్దతు ధర ప్రకటించినా ఆ ధరలను వ్యాపారులు అమలు చేయడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన ధర కంటే వెనామీ రొయ్యలు కేజీకి రూ.30 నుంచి రూ.55 వరకు తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. కౌంట్ పేరుతో దోపిడీ... వ్యాపారులు కూటమికట్టి ఇష్టారీతిన దోపిడీ చేస్తున్నారు. వెనామీతో పాటు టైగర్ రొయ్యలను కూడా తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. అందుబాటులో ఉన్న కౌంట్ రొయ్యలు తీసుకోకుండా లేని కౌంట్ రొయ్యలు కావాలని వ్యాపారులు మెలికపెట్టి మరీ దోచుకుంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధరకంటే మరీ తక్కువ చేసి కొనుగోలు చేయడంతో రైతులు భారీగా నష్టపోవాల్సి వస్తోంది. ఎకరా సాగుకయ్యే ఖర్చు రూ.4.15 లక్షలు... రైతును తీవ్రంగా నష్టపరుస్తున్నారు వ్యాపారులు, రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులు రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారు. అధికారుల పట్టించుకోవడం లేదు. దిగుబడి వచ్చిన తర్వాత రొయ్యలను నిల్వ చేసుకునే అవకాశం లేదు. దీనిని ఆసరా చేసుకుంటున్న వ్యాపారులు ఇష్టమొచ్చిన ధరకు కొనుగోలు చేస్తున్నారు. అధికారులు పట్టించుకుని ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానుల ఎగుమతులను ఆపేయాలి. అప్పుడే వాళ్లకు కష్టం అర్థమవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే వ్యాపారులు రైతులను అణగదొక్కుతున్నారు. – బత్తుల రమేష్‌రెడ్డి, ఆక్వా రైతు, కొత్తపట్నం అధికారులు నిర్లక్ష్యం వీడాలి రొయ్యల ధరల విషయంలో జిల్లా అధికారులు నిర్లక్ష్యం వీడాలి. ప్రభుత్వం స్పష్టంగా చెప్పినా రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, వ్యాపారులు రైతులను నిలువునా నష్టపరుస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధరల కంటే తక్కువకు కొనుగోలు చేయడం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. లేకుంటే రైతులు తీవ్రంగా నష్టపోతారు. – దుగ్గినేని గోపీనాథ్, రొయ్యల రైతుల సంఘ నాయకుడు జిల్లా వ్యాప్తంగా సమావేశం ఏర్పాటు చేస్తాం జిల్లా వ్యాప్తంగా రొయ్యల వ్యాపారులు, రైతులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం ఇప్పటికే వారికి ప్రకటించిన ధరలకే అమ్మాలని నిర్దేశించింది. అయినా తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్దేశించిన ధరలను అమలుచేస్తాం. – ఆవుల చంద్రశేఖరరెడ్డి, మత్స్యశాఖ జిల్లా అధికారి -
మీసం మెలేస్తున్న రొయ్య!
సాక్షి, అమరావతి : రొయ్య మీసం మెలేస్తోంది. కొన్నాళ్ల కిందట వరకు అంతంతమాత్రంగా ఉన్న రొయ్య ధర ఇప్పుడు గణనీయంగా పెరిగింది. చాన్నాళ్లుగా ప్రతికూల పరిస్థితులతో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న అక్వా రైతుకు వీటి ధర పెరుగుదల, ప్రభుత్వం విద్యుత్ యూనిట్ చార్జీని సగానికి పైగా తగ్గించడం వెరసి ఉపశమనం కలిగిస్తోంది. దీంతో ఇప్పుడు ఒకింత ఒడ్డున పడ్డామన్న ఆనందం వీరిలో వ్యక్తమవుతోంది. ఆక్వా సాగులో భాగమైన రొయ్యల సాగు జూదంలా మారింది. ఒక ఏడాది లాభాల పంట పండితే మరో ఏడాది నష్టాల పాల్జేస్తోంది. దీంతో రైతులు ఈ ఏడాది కాకుంటే వచ్చే ఏడాదైనా కలిసొస్తుందన్న ఆశతో దీనిని వదులుకోలేకపోతున్నారు. ఇలా ఏటికేడాది చెరువులకు ఎదురీదుతున్నారు. కొన్నేళ్ల నుంచి పరిస్థితి మరింతగా దిగజారింది. ఒకపక్క ప్రకృతి ప్రతికూలత, మరోపక్క నాణ్యత లేని సీడ్, అదుపు లేని ఫీడ్ ధర, వ్యాధుల బెడద, గిట్టుబాటు కాని రొయ్యల రేటు వెరసి ఈ రైతును నిలువునా ముంచుతున్నాయి. అన్నింటికీ మించి విద్యుత్ చార్జీలు పెను భారంగా మారుతూ వచ్చాయి. ఈ తరుణంలో రొయ్యల ధర పెరగడం, అదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఆక్వా రంగానికి విద్యుత్ చార్జీలను యూనిట్‌కు రూ.3.85 నుంచి 1.50కి (రూ.2.35) తగ్గించడం ఈ రైతును కోలుకునేలా చేస్తోంది. కృష్ణా జిల్లాలో 50 వేల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. ఎకరానికి 2 నుంచి 2.50 టన్నుల దిగుబడి వస్తుంది. నాలుగు నెలలకు ఒక దఫా పంట చేతికొస్తుంది. ఇలా ఏడాదికి రెండు పర్యాయాలు మాత్రమే రొయ్యల సాగుకు వీలుంటుంది. ఇలా వీటి ద్వారా ఏటా 1.50 లక్షల టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ఎగబాకుతున్న రొయ్యల ధర రొయ్యల ధర ఇప్పుడిప్పుడే ఎగబాకుతోంది. ఉదాహరణకు నెల రోజుల క్రితం 100 కౌంట్ రొయ్య టన్ను ధర రూ.1.90 లక్షలుండగా ఇప్పుడది 2.40 లక్షలకు చేరుకుంది. 70 కౌంట్ 2.45 నుంచి 2.70 లక్షలకు, 30 కౌంట్ 4.50 నుంచి 5 లక్షల చొప్పున ఎగబాకింది. ఏ కౌంట్ ఎంత? (టన్నుల్లో) ఎగుమతులకు ఊపు.. రాష్ట్రంలో ఉత్పత్తవుతున్న రొయ్యలను అధికశాతం తైవాన్ మార్కెట్‌కు ఎగుమతి అవుతున్నాయి. తైవాన్‌లో జూన్ నెలతో రొయ్యల సాగు పూర్తయింది. మరో రెండు మూడు నెలల పాటు అక్కడ రొయ్యల ఉత్పత్తి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాదు. అందువల్ల అప్పటిదాకా రొయ్యల ఎగుమతికి ఊపు కొనసాగుతుందని, ప్రస్తుత ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉందని ఆక్వా రైతులు ఆశాభావంతో ఉన్నారు. విద్యుత్ చార్జీ తగ్గింపుతో ఊరట! గతంలో ఆక్వా రంగానికి యూనిట్‌కు రూ.3.85 చెల్లించే వారం. అసలే గిట్టుబాటు కాని ధరలతో నష్టాలను తట్టుకోవడం కష్టంగా ఉండేది. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక యూనిట్ చార్జీని రూ.1.50కి తగ్గించడం ఊరటనిస్తోంది. దీనికి రొయ్య రేటు ఆశాజనకంగా ఉండడం ఆక్వా రైతును బతికిస్తోంది. గతంలోలా పాత ధరలు కొనసాగితే కుదేలే. ఈ ఏడాది ప్రతికూల వాతావరణంతో రొయ్యలకు వైట్‌గట్ అనే వ్యాధి సోకి నష్టాల పాల్జేసింది. –వెంకట్, రొయ్యల సాగు రైతు, ఎదురుమొండి, నాగాయలంక -
డెల్టా.. చెరువుల తవ్వకంతో ఉల్టా
పాలకొల్లు, న్యూస్‌లైన్ : డెల్టాలో రొయ్యల పెంపకం కోసం విస్తారమైన పంట భూములు ఉప్పునీటి కయ్యలుగా మారుతున్నాయి. వరిసాగుతో వరుస నష్టాలను మూటగట్టుకుంటున్న రైతులు రొయ్యల సాగుపై మక్కువ పెంచుకుంటున్నారు. దీనితో ఎంతో విస్తారమైన భూములకు సుమారు 200 అడుగుల లోతులోని ఉప్పు నీటిని తోడడం వల్ల భూములు ఉప్పునీటికయ్యలవుతున్నాయి. వరి సాగుపై విముఖత డెల్టాలో దాదాపు రెండు లక్షల ఎకరాల్లో వరిసాగు చేయాల్సి వుండగా ఇటీవల కాలంలో వరిసాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయి రొయ్యల సాగు పెరుగుతోంది. ఇటీవల వరుస తుపాన్లు, భారీ వర్షాలు కారణంగా వరిసాగు చేసే రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు. వరి సాగు కోసం పెట్టుబడులు పెరగటం, ప్రతికూల వాతావరణంతో ఆశించిన దిగుబడులు రాకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన కౌలు రైతులు వరిసాగుపై విముఖత చూపుతున్నారు. ఈ తరుణంలో రొయ్యల సాగు ఆశజనకంగా ఉండంతో భూస్వాములు రొయ్యల సాగుకే తమ భూములను లీజుకిస్తున్నారు. ఎకరం భూమి లీజుకిస్తే కేవలం రెండు పంటలకు 24 బస్తాలు మగతా( సుమారు రూ.24 వేలు) వస్తోంది. అయితే రొయ్యల చెరువుకు లీజుకిస్తే ఎకరాకు ఏడాదికి రూ. 50 వేలు నుంచి రూ.70 వేలు వరకు ఆదాయం లభిస్తోంది. ఆకివీడు, కాళ్ల, భీమవరం, గణపవరం తదితర మండలాల్లో చేపల చెరువులకు ఎకరాకు ఏడాదికి రూ.60 వేలు నుంచి లక్ష రూపాయలు వరకు లీజుకు ఇస్తున్నారు. దీంతో దాదాపు డెల్టా ప్రాంతంలో ఎక్కువ శాతం భూస్వాములు తమ భూములను చెరువులకు లీజుకు ఇవ్వడానికే మొగ్గుచూపుతున్నారు. తగ్గిన సరిహద్దు వివాదాలు గతంలో రొయ్యల చెరువులు తవ్వే సమయంలో సరిహద్దు భూముల రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యేవి. దీంతో అధికారులకు ఫిర్యాదు చేసి తవ్వకాలను అడ్డుకునే వారు. అయితే ప్రస్తుతం చెరువుల తవ్వకాలపై రైతులు అభ్యంతరం తెలపకపోవడం, భవిష్యత్‌లో తమ భూముల కూడా చెరువులుగా మార్చకోవచ్చుననే ముందుచూపుతో వారు అడ్డు చెప్పడం లేదు. దీనితో ఏమాత్రం మురుగునీటి పారుదల అవకాశం ఉన్న భూమినైనా చెరువులుగా మార్చేస్తున్నారు. పెరుగుతున్న సీడ్ ట్యాంక్‌లు రొయ్యల చెరువుల విస్తీర్ణం పెరగడంతో రొయ్యల సీడ్ ట్యాంకులు కూడా పెరుగుతున్నాయి. ప్రధానంగా వీరవాసరం మండలంలో సీడ్ ట్యాంకులు ఎక్కువగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. ఒంగోలు, వైజాగ్, కాకినాడ తదితర ప్రాంతాల నుంచి ఉప్పునీటిలోని రెడ్(చిన్నసైజు పిల్లలు)ను తీసుకువచ్చి ఈ సీడ్ ట్యాంక్‌ల్లో వేసి తీపి నీటి రొయ్యలుగా మార్పుచేసి అమ్మకాలు సాగిస్తున్నారు. సీడ్ వ్యాపారం మూడు పిల్లలు, ఆరు రొయ్యలగా సాగడంతో అనేకమంది ఈ వ్యాపారంపై ఆశక్తి చూపుతున్నారు. అధికారులకు పెద్దమొత్తంలో ముడుపులు ప్రధాన రహదారుల పక్కనే విస్తారమైన భూములను అక్రమంగా రొయ్యల చెరువులు, సీడ్ ట్యాంక్‌లుగా మార్పు చేస్తున్నా అధికారులు కన్నెత్తి చూడకపోవడం విశేషం. ఇటీవల కాలంలో రొయ్యల ధర గణనీయంగా పెరగడంతో లాభాలు ఆర్జిస్తున్న రైతులు అధికారులకు ముడుపులు కూడా పెద్దమొత్తంలో ఇస్తున్నారని, దీంతో రొయ్యల చెరువు దరిదాపులకు అధికారులు వెళ్లడం లేదని పలువురు చెబుతున్నారు. రొయ్యల చెరువుల తవ్వకాలపై ఉన్నాతాధికారులు కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ ప్రాంతంలోని సాగు భూములన్నీ ఉప్పునీటి కయ్యలు మారిపోయే ప్రమాదం ఉందని, తద్వారా ఈ ప్రాంతంతో 15 అడుగుల లోతులో లభించే మంచినీరు కరువౌతుందని పలువురు ఆందోళన వ్యక్తమవుతోంది.